కుప్పకూలిన గిడ్డంగి పైకప్పు.. కూరుకుపోయిన 60 మంది కార్మికులు.. రంగంలోకి సైన్యం!
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బుధవారం మధ్యాహ్నం (జూన్ 24, 2026) ఘోర ప్రమాదం సంభవించింది. పశ్చిమ కోల్‌కతాలోని తారతలా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక భారీ గిడ్డంగి (Warehouse) అకస్మాత్తుగా కూలిపడింది. ఈ దుర్ఘటనలో దాదాపు 50 నుంచి 60 మంది కార్మికులు శిథిలాల కింద కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఇప్పటివరకు తొమ్మిది మందిని రక్షించి ఎస్‌ఎస్‌కెఎం (SSKM) ఆసుపత్రికి తరలించగా, వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

కోల్‌కతా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తారతలా ప్రాంతంలోని బ్రేస్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ట్రాన్స్‌పోర్ట్ డిపో రోడ్డుపై ఈ గిడ్డంగి నిర్మాణం జరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం కార్మికులు ఎప్పటిలాగే తమ పనుల్లో నిమగ్నమై ఉండగా, ఒక్కసారిగా గిడ్డంగి పైకప్పులోని అత్యధిక భాగం భారీ శబ్దంతో కుప్పకూలిపోయింది. లోపల ఇనుప దూలాలు, సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలు కార్మికులపై పడటంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదం ఎంత ఆకస్మికంగా జరిగిందంటే, కార్మికులకు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తే సమయం కూడా దొరకలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
రంగంలోకి సైన్యం.. యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే కోల్‌కతా పోలీసులు, విపత్తు నిర్వహణ బృందం, పౌర రక్షణ, అగ్నిమాపక, అత్యవసర సేవల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పరిస్థితి తీవ్రతను బట్టి సైనిక అధికారులను కూడా రప్పించారు. కూలిపోయిన భారీ ఇనుప దూలాలను, కాంక్రీట్ శిథిలాలను తొలగించడానికి పెద్ద ఎత్తున క్రేన్‌లు, అత్యాధునిక యంత్రాలను మోహరించి యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఐదుగురు మృతి చెందారని ప్రకటించిన బీజేపీ నేత!
ఈ ప్రమాదంలో ఇప్పటికే ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని బీజేపీ నాయకుడు రాకేష్ సింగ్ మీడియాకు తెలిపారు. “ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు” అని ఆయన పేర్కొన్నారు. అయితే, మరణాల సంఖ్యపై ప్రభుత్వం లేదా జిల్లా యంత్రాంగం నుండి ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రి ఇంద్రనీల్ ఖాన్ సంఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “లోపల చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా రక్షించడమే మా మొదటి ప్రాధాన్యత. అయితే ఈ నిర్మాణం పూర్తిగా చట్టవిరుద్ధంగా జరిగింది. గతంలో టీఎంసీ అధికారంలో ఉన్న సమయంలో దీనికి అనుమతులు ఇచ్చారు” అంటూ ఆరోపించారు. ఈ ఘోర ప్రమాదంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..