AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA 2026: ఫుట్‌బాల్ చరిత్రలో కొత్త రికార్డ్.. రొనాల్డో దెబ్బకు హిస్టరీ క్రియేట్

ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్-కెలో పోర్చుగల్ ఉజ్బెకిస్థాన్‌ను 5-0తో ఓడించి నాకౌట్ దశకు చేరువైంది. ఈ మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో రెండు గోల్స్ చేసి, ఆరు ప్రపంచకప్‌లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచి, తదుపరి మ్యాచ్‌లకు సిద్ధం చేసింది.

FIFA 2026: ఫుట్‌బాల్ చరిత్రలో కొత్త రికార్డ్.. రొనాల్డో దెబ్బకు హిస్టరీ క్రియేట్
Cristiano Ronaldo
SN Pasha
|

Updated on: Jun 24, 2026 | 3:44 PM

Share

ఫిఫా వరల్డ్ కప్ 2026లో గ్రూప్-కె మ్యాచ్‌లో పోర్చుగల్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఉజ్బెకిస్తాన్‌ను 5-0 తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో పోర్చుగల్ నాకౌట్ దశకు మరింత చేరువ కాగా, స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. డీఆర్ కాంగోతో జరిగిన తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన రొనాల్డోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించి విమర్శకులకు తనదైన శైలిలో బదులిచ్చాడు. ఈ రెండు గోల్స్‌తో ఆరు వేర్వేరు ఫిఫా ప్రపంచకప్‌లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2006 నుంచి 2026 వరకు జరిగిన ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో గోల్స్ చేసిన ఏకైక ఫుట్‌బాలర్‌గా నిలిచాడు.

మ్యాచ్ ప్రారంభమైన ఆరో నిమిషానికే రొనాల్డో గోల్ చేసి పోర్చుగల్‌కు ఆధిక్యం అందించాడు. అనంతరం 17వ నిమిషంలో నూనో మెండిస్ అద్భుత ఫ్రీకిక్ ద్వారా స్కోరు 2-0కి పెంచాడు. తొలి అర్ధభాగం ముగిసే ముందు 39వ నిమిషంలో రొనాల్డో మరోసారి గోల్ చేయడంతో పోర్చుగల్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధభాగంలో ఉజ్బెకిస్థాన్ గోల్‌కీపర్ అబ్దువోఖిద్ నెమటోవ్ చేసిన ఓన్ గోల్‌తో స్కోరు 4-0 అయ్యింది.

మ్యాచ్ చివర్లో రాఫెల్ లియో గోల్ చేయడంతో పోర్చుగల్ 5-0తో ఘన విజయం సాధించింది. మొత్తం మ్యాచ్‌లో పోర్చుగల్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి మ్యాచ్‌లో డీఆర్ కాంగోతో 1-1తో డ్రా అయిన తర్వాత ఈ విజయంతో జట్టు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందింది. ప్రస్తుతం గ్రూప్-కెలో నాలుగు పాయింట్లతో నాకౌట్ అవకాశాలను బలపర్చుకుంది. మ్యాచ్ అనంతరం రొనాల్డో కెమెరా ముందు “ఐ యామ్ బ్యాక్” అంటూ స్పందించడం అభిమానులను ఉత్సాహపరిచింది. 41 ఏళ్ల వయసులోనూ ప్రపంచకప్ వేదికపై తన ప్రభావం ఏమాత్రం తగ్గలేదని అతడు మరోసారి నిరూపించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us