AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను కూడా సాయిబాబా భక్తుడినే.. భక్తులకు మంత్రి ఆనం క్షమాపణలు.. ఎందుకంటే..

షిర్డీ సాయిబాబా ఆలయాలకు శ్రీవాణి ట్రస్టు నిధుల కేటాయింపుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తుడినేనని, తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలని కోరారు. సాయిబాబాపై కోట్లాది మంది ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందని స్పష్టం చేసిన మంత్రి, శ్రీవాణి ట్రస్టు నిధుల కేటాయింపు మాత్రం ట్రస్టు లక్ష్యాలు, నిబంధనల ప్రకారమే జరుగుతుందని తెలిపారు.

నేను కూడా సాయిబాబా భక్తుడినే.. భక్తులకు మంత్రి ఆనం క్షమాపణలు.. ఎందుకంటే..
Srivani Funds Controversy
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jun 24, 2026 | 3:33 PM

Share

షిర్డీ సాయిబాబా ఆలయాలకు శ్రీవాణి ట్రస్టు నిధుల అంశంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తుడినేనని, తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. సాయిబాబా భక్తుల విశ్వాసాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందని స్పష్టం చేసిన మంత్రి.. ఈ వివాదాన్ని కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఆలయాలకు టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్టు నిధులు ఇవ్వబోమంటూ ఇటీవల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసమే శ్రీవాణి నిధులు వినియోగిస్తున్నామని, అందుకే షిర్డీ సాయి ఆలయాలకు ఈ పథకం కింద నిధులు ఇవ్వడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ అంశంపై సాయిబాబా భక్తులు, వివిధ హిందూ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

నేను కూడా సాయిబాబా భక్తుడినే

ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సుదీర్ఘ వివరణ విడుదల చేశారు. తాను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తుడినేనని, ప్రతిరోజూ ఉదయం తన పూజా మందిరంలో వివిధ దేవతామూర్తులతో పాటు షిర్డీ సాయిబాబా స్వామివారిని కూడా పూజించిన తర్వాతే దినచర్య ప్రారంభిస్తానని వెల్లడించారు. సాయిబాబా పట్ల తనకు అత్యంత భక్తి, గౌరవం ఉన్నాయని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల వల్ల ఏ ఒక్క భక్తుడి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే హృదయపూర్వకంగా మన్నించాలని కోరారు.

సాయిబాబా భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తాం

సాయిబాబాపై కోట్లాది మంది ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని, ఆ విశ్వాసాన్ని ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తుందని మంత్రి ఆనం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గానీ, దేవాదాయ శాఖ గానీ, టీటీడీ గానీ ఎవరి విశ్వాసాన్ని కించపరచే ఉద్దేశంతో వ్యవహరించడం లేదన్నారు. సాయిబాబా ఆలయాల్లో కూడా హిందూ సంప్రదాయాలకు అనుగుణంగానే పూజలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.

శ్రీవాణి నిధులకు ప్రత్యేక లక్ష్యం

అయితే టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఐదు వేల భజన మందిరాల కార్యక్రమానికి ఒక నిర్దిష్ట లక్ష్యం ఉందని మంత్రి వివరించారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, ప్రచారం, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ హిందూ దేవాలయాల నిర్మాణమే ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు నిబంధనలు, టీటీడీ మార్గదర్శకాలు, పరిపాలనా విధానాల ప్రకారమే నిధుల కేటాయింపు జరుగుతోందని స్పష్టం చేశారు.

అది అవమానం కాదు : ఆనం

షిర్డీ సాయిబాబా ఆలయాలకు ఈ పథకం కింద నిధులు ఇవ్వకపోవడాన్ని అవమానంగా చూడొద్దని మంత్రి ఆనం విజ్ఞప్తి చేశారు. ఇది ఎవరి విశ్వాసాన్ని తక్కువ చేసి చూడడం కాదని, ట్రస్టు లక్ష్యాలు, నిబంధనల ప్రకారం తీసుకున్న పరిపాలనా నిర్ణయం మాత్రమేనని స్పష్టం చేశారు. సాయిబాబా స్వామివారిని గానీ, ఆయన భక్తులను గానీ కించపరచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మరోసారి పునరుద్ఘాటించారు. తాను చేసిన వ్యాఖ్యల ఉద్దేశాన్ని పూర్తిగా పక్కనబెట్టి కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారని మంత్రి ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ వర్గాలు ఈ అంశాన్ని అనవసర వివాదంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఎవరూ నమ్మవద్దని కోరారు.

భక్తి కాదు.. విధానాల అంశం

ఈ వివాదం భక్తి, విశ్వాసాలకు సంబంధించినది కాదని, ట్రస్టుల లక్ష్యాలు, నిబంధనలు, పరిపాలనా విధానాలకు సంబంధించిన అంశమని మంత్రి ఆనం స్పష్టం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ట్రస్టుల లక్ష్యాలను గౌరవిస్తూనే, ప్రతి భక్తుడి విశ్వాసాన్ని కూడా ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు. దీంతో వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇస్తూనే, సాయిబాబా భక్తులకు మంత్రి ఆనం మరోసారి భరోసా ఇచ్చారు.

వీడియో చూడండి..

Follow Us