AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీ తప్పనిసరి! రూల్ బ్రేక్ చేస్తే ప్రింటింగ్ ప్రెస్‌లు కూడా సీజ్?

సమాజంలో ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ, చట్టాలు కఠినతరం చేసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బాల్యవివాహాల జాడ్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సామాజిక మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై రాష్ట్రంలో ముద్రించే ప్రతి పెళ్లి పత్రికపై (Wedding Invitation Cards) పెళ్లికూతురు, పెళ్లికొడుకు పేర్లతో పాటు వారి పుట్టిన తేదీని ఖచ్చితంగా ముద్రించాలనే నిబంధనను తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీ తప్పనిసరి! రూల్ బ్రేక్ చేస్తే ప్రింటింగ్ ప్రెస్‌లు కూడా సీజ్?
Birth Date On Wedding Cards
Jyothi Gadda
|

Updated on: Jun 24, 2026 | 7:00 PM

Share

సామాజిక రుగ్మతగా మారిన బాల్యవివాహాలను వేళ్లతో సహా పెకిలించివేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా జరుగుతున్న బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు, వివాహ ఆహ్వాన పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీని నమోదు చేయడాన్ని ప్రభుత్వం త్వరలోనే చట్టబద్ధం చేయనుంది. ఈ మేరకు మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అదితి తట్కరే రాష్ట్ర అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన చేశారు.

రాజస్థాన్ మోడల్ ఆధారంగా ప్రతిపాదన:

మహారాష్ట్ర అసెంబ్లీలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అదితి తట్కరే ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. బాల్యవివాహాల వల్ల బాలికల విద్యాభ్యాసం, ఆరోగ్యం, వారి భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ప్రభుత్వం అంగీకరించింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే క్రమంలో, ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న విధానాన్ని మహారాష్ట్రలోనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం తుది పరిశీలనలో ఉంది. పెళ్లి పత్రికపై పుట్టిన తేదీ ఉండటం వల్ల, స్థానిక అధికారులు లేదా పౌరులు ఎవరైనా వధూవరుల వయస్సును సులభంగా తనిఖీ చేయడాని, చట్టవిరుద్ధమైన బాల్యవివాహాలను అడ్డుకోవడానికి వీలవుతుంది.

ఇవి కూడా చదవండి

ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు:

రాష్ట్రంలో బాల్యవివాహాల నిరోధక యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. అసెంబ్లీలో సమర్పించిన వివరాల ప్రకారం.. పర్భణి జిల్లాలో దాదాపు 48శాతం మంది బాలికలకు, బీడ్ జిల్లాలో 43.7శాతం మందికి, ధులేలో 40.5శాతం మందికి, సోలాపూర్‌లో 40.3శాతం మందికి 18 ఏళ్లు నిండకుండానే వివాహాలు జరుగుతున్నట్లు షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది.

కఠినంగా మారనున్న నిబంధనలు:

ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం, కేవలం పుట్టిన తేదీని ముద్రించడమే కాకుండా.. వధూవరుల వయస్సును ధృవీకరించే అధికారిక పత్రాలను పరిశీలించిన తర్వాతే వెడ్డింగ్ కార్డులను ముద్రించాలని ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యాలకు నిబంధనలు విధించనున్నారు. ఒకవేళ ఏ ప్రింటింగ్ ప్రెస్ అయినా సరైన వయస్సు ధృవీకరణ లేకుండా, లేదా కార్డుపై పుట్టిన తేదీని ముద్రించకుండా వివాహ పత్రికలను ముద్రిస్తే.. వారి లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు సదరు ప్రెస్‌ను సీజ్ చేసేలా చట్టాన్ని రూపొందిస్తున్నారు.

అంతేకాదు.. కొత్త నిబంధనల ప్రకారం బాల్యవివాహాలు చేసే కుటుంబ సభ్యులపైనే కాకుండా, ఆ వివాహాన్ని జరిపించే పూజారులు, వాయించే బ్యాండ్ మేళం సిబ్బంది, కేటరింగ్ నిర్వాహకులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోనున్నారు. చట్టాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్య, అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయడం ద్వారానే ఈ సమస్యను రూపుమాపగలమని ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే ఈ వెడ్డింగ్ కార్డ్ నిబంధనపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

వీడియో ఇక్కడ చూడండి..

జిల్లా టాస్క్ ఫోర్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు:

బాల్యవివాహాల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కీలక మార్పులను ప్రతిపాదించింది:

జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్: ప్రతి జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడుతుంది. ఇది బాల్యవివాహాలపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తుంది.

ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: బాల్యవివాహాల కేసులను వేగంగా విచారించి బాధ్యులకు త్వరితగతిన శిక్ష పడేలా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.

ఆన్‌లైన్ పోర్టల్: ప్రజలు ఎవరైనా బాల్యవివాహాల గురించి రహస్యంగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఒక ప్రత్యేక వెబ్‌సైట్ లేదా పోర్టల్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.

గ్రామీణ, వలస ప్రాంతాలలో బాలికల హక్కులను కాపాడటానికి ఈ కొత్త నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బిల్లు త్వరలోనే అధికారిక చట్టంగా మారే అవకాశం ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us