AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాఠశాలలో కాల్పుల మోత.. ఆరుగురు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు!

థాయ్‌లాండ్‌లో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్యాంకాక్‌ సమీపంలోని నొంతబురి ప్రావిన్స్‌లోని డెబ్సిరిన్‌ నొంతబురి పాఠశాలలో ఓ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. మరో 15 మంది గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

పాఠశాలలో కాల్పుల మోత.. ఆరుగురు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు!
Thailand School Shooting
Balaraju Goud
|

Updated on: Aug 07, 2026 | 12:52 PM

Share

థాయ్‌లాండ్‌లో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్యాంకాక్‌ సమీపంలోని నొంతబురి ప్రావిన్స్‌లోని డెబ్సిరిన్‌ నొంతబురి పాఠశాలలో ఓ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. మరో 15 మంది గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాఠశాలకు వెళ్లే ముందు నిందితుడు తన ఇంట్లో తాత, నానమ్మపై కాల్పులు జరిపాడు. అనంతరం కుటుంబ సభ్యుడికి చెందిన తుపాకీతో పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులపై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాల్పుల అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

కాల్పుల ఘటనతో పాఠశాలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కాల్పుల శబ్దాలు వినిపించగానే కొందరు విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నారు. మరికొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు పాఠశాల నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఘటన సమయంలో పాఠశాలకు చేరుకున్న అత్యవసర సిబ్బంది పలువురు బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఒక ఉపాధ్యాయుడు పాఠశాలపై అంతస్తులో మృతి చెంది కనిపించగా.. మరో మహిళా ఉపాధ్యాయురాలు ఛాతీ, చేతులకు తీవ్ర గాయాలతో కనిపించారు. ఆమెను కాపాడేందుకు సుమారు 30 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించినట్లు అత్యవసర సిబ్బంది తెలిపారు.

కాల్పుల వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. నిందితుడు తుపాకీని కుటుంబ సభ్యుడి నుంచి ఎలా పొందాడు, దాడికి ముందుగా ఏమైనా ప్రణాళిక చేశాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై థాయ్‌ ప్రధాని అనుటిన్‌ చార్న్‌విరాకుల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులకు, వారి కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇటీవలి కాలంలో థాయ్‌లాండ్‌లో సామూహిక కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2022లో డేకేర్‌ సెంటర్‌పై జరిగిన దాడిలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో పాఠశాలలో కాల్పులు జరగడంతో దేశంలో ఆయుధాల నియంత్రణ, విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us