ఒకే సబ్జెక్టులో ఫెయిలైన 8 లక్షల మంది విద్యార్థులు..కారణం ఇదేనట!
హిందీ అంటే ఉత్తరాది వారికి కొట్టిన పిండి. అయితే, అటువంటి రాష్ట్రంలోనే టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హిందీ సబ్జెక్టులోనే ఫెయిల్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
హిందీ అంటే ఉత్తరాది వారికి కొట్టిన పిండి. అయితే, అటువంటి రాష్ట్రంలోనే టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హిందీ సబ్జెక్టులోనే ఫెయిల్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జూన్ 28న యూపీలో వెలువడిన టెన్త్, ఇంటర్ పరీక్షల్లో 7.97 లక్షల మంది హిందీలో ఫెయిల్ అయ్యారు. ఇందులో 2.7 లక్షల మంది ఇంటర్ విద్యార్థులుండగా, 5.28 లక్షల మంది టెన్త్ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే విద్యార్థుల్లో కొంతమందికి హిందీలో కొన్ని సాధారణ పదాలు కూడా రాయలేకపోయారని జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన టీచర్లు అంటున్నారు.
హిందీ నేర్చుకుంటే అవకాశలేవీ లేవన్న భావనతోనే చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారని టీచర్లు తెలిపారు. గతేడాది కూడా హిందీ పరీక్షల్లో 10 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని బోర్డు అధికారులు వెల్లడించారు. కాగా, యూపీలో ఈ యేడు మొత్తం 50 లక్షల మంది పరీక్షలు రాయగా, ఇందులో దాదాపు 2.39 లక్షల మంది హైస్కూల్, ఇంటర్ విద్యార్ధులు అసలు హిందీ పరీక్షకు హాజరు కాలేదని అధికారులు వెల్లడించారు.