AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zojila Tunnel: శరవేగంగా జోజిలా టన్నెల్‌ నిర్మాణం.. నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సందర్శన..

Zojila tunnel - MEIL: స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అద్భుతమైన టన్నెల్‌ నిర్మాణం వేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ టన్నెల్‌తో 30 ఏళ్ల లద్దాఖ్‌ ప్రజల కోరిక నెరవేరబోతోంది. అలాగే సరిహద్దుల్లో

Zojila Tunnel: శరవేగంగా జోజిలా టన్నెల్‌ నిర్మాణం.. నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సందర్శన..
Zojila Tunnel
Shaik Madar Saheb
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 28, 2021 | 6:34 AM

Share

Zojila Tunnel – MEIL: స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అద్భుతమైన టన్నెల్‌ నిర్మాణం వేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ టన్నెల్‌తో 30 ఏళ్ల లద్దాఖ్‌ ప్రజల కోరిక నెరవేరబోతోంది. అలాగే సరిహద్దుల్లో సైనిక అవసరాలను తీర్చడానికి కూడా ఈ టన్నెల్‌ కీలకంగా మారనుంది. ఆసియాలోనే అతిపొడవైన టన్నెల్‌ ప్రాజెక్టును తెలుగు వారి సంస్థ మేఘా ఇంజినీరింగ్(MEIL) నిర్మిస్తుండటం విశేషం. అయితే.. ఈ జోజిలా టన్నెల్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ (సెప్టెంబర్ 28) సందర్శించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ పలు జాతీయ రహదారులకు శంకుస్థాపనలు చేసేందుకు గడ్కరీ సోమవారం జమ్మూకు చేరుకున్నారు. నిన్న అక్కడ జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం గడ్కరీ.. ఇవాళ నేరుగా జోజిలా టన్నెల్ కు చేరుకుని.. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. జోజిలా టన్నెల్ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 6.5 Km పొడవు సొరంగాన్ని తవ్వారు. పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టన్నెల్ పురోగతి గురించి తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. ఇదిలాఉంటే.. ఆదివారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా జోజిలా టన్నెల్‌ను సందర్శించి అధికారులకు పలు సూచనలు నచేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో పర్యాటకం పెరుగుతుందని పేర్కొన్నారు.

జోజిలా టన్నెల్.. విశేషాలు.. జోజిలా టన్నెల్.. ఆసియాలోని అతి పొడవైన సొరంగ మార్గం. ఇది శ్రీనగర్‌, కార్గిల్‌, లేహ్‌ను కలిపే లైఫ్‌లైన్‌. ఈ నిర్మాణ పనులను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఫస్ట్‌ బ్లాస్ట్‌తో ప్రారంభించారు. దీని పనులు 2020 అక్టోబర్ లో ప్రారంభమయ్యాయి. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఈ రహదారిని నిర్మిస్తున్నారు. శ్రీనగర్‌ నుంచి లేహ్‌ వరకు మధ్యలో కార్గిల్‌కు అనుసంధానం చేస్తూ నిర్మించే ఈ టన్నెల్‌ చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 30 ఏళ్లుగా ఈ టన్నెల్‌ కోసం కార్గిల్‌, లద్దాఖ్‌ ప్రజలు టన్నెల్ నిర్మించాలని కోరుతున్నారు. ఇక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల ఆర్నెల్లపాటు సరుకులు రవాణా సాధ్యం కాని పరిస్థితి నెలకొని ఉంటుంది. అందువల్ల అన్ని వాతావరణ పరిస్థితుల్లో రవాణాకు ఉపయోగపడేలా ఈ టన్నెల్ ను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక జోజిలా టన్నెల్‌ను మేఘా ఇంజినీరింగ్ నిర్మిస్తోంది.

2013లో యూపీఏ హయాంలో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆ తర్వాత మోదీ సర్కార్‌ హయాంలో 4 సార్లు టెండర్లు పిలిచినా సఫలం కాలేదు. ‘ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేయడంలో ఎంతో పేరుగాంచిన MEIL ఈ రహదారిని నిర్మాణ పనులను కూడా నాలుగేళ్ళలోనే పూర్తి చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పాలని’ కేంద్రమంత్రి నితిన్ గడ్కరి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆకాంక్షించారు.

జోజిలా టనెల్‌ నిర్మాణానికి వాస్తవంగా 10,643 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ రోడ్లు, టన్నెల్‌ను వేర్వేరుగా నిర్మించడం వల్ల 3,835 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని ప్రభుత్వం అంటోంది. శ్రీనగర్- లద్దాఖ్‌ మధ్య ప్రస్తుతమైతే ప్రయాణానికి మూడున్నర గంటల సమయం పడుతుంది. జోజిలా టన్నెల్‌ పూర్తయితే కేవలం 15 నిమిషాల్లోనే ఈ దూరాన్ని చేరుకోవచ్చు. జోజిలా టన్నెల్‌ ను అత్యాధునికంగా నిర్మిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు, ఓవర్‌ హైట్‌ వాహనాలను గుర్తించడం, ఆటోమెటిక్‌ ఫైర్‌ డిటెక్షన్‌, ఫైర్‌ అలారం, ఇక స్పీడ్‌ లిమిట్‌ 80 కిలోమీటర్లకు పరిమితం చేస్తూ టన్నెల్‌ను నిర్మిస్తున్నారు.

జోజిలా టన్నెల్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌లో ఒక భాగం. జోజిలా సొరంగం నిర్మాణంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. దీంతోపాటు శ్రీనగర్, లేహ్ మధ్య సంవత్సరమంతా కనెక్టివిటీతో జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రాంతాల ఆర్థిక, సామాజిక- సాంస్కృతిక ఏకీకరణకు ఈ రహదారి దోహదపడుతుంది. అటు వ్యూహాత్మకంగా కూడా జోజిలా టన్నెల్‌ చాలా కీలకం. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్‌ కుట్రల నేపథ్యంలో- సైనిక బలగాల అవసరాలను తీర్చడానికి కూడా ఈ టన్నెల్‌ ఉపయోగపడుతుంది. హిమాలయాల సమీపానికి ఆయుధాలను త్వరగా రవాణా చేయడం, బలగాలను అవసరమైన చోట త్వరగా మోహరించడం జోజిలా టన్నెల్‌తో సాధ్యం అవుతుంది.

Also Read:

Crime News: భార్య ముక్కు కొరికిన భర్త..  భరణం ఇవ్వాలన్నందుకు అత్తారింటికి వెళ్లి..

Crime News: ప్రాణంగా ప్రేమించుకున్నారు.. కలిసుండాలని కలలు కన్నారు.. కానీ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో..