Karnataka Rains: క్షణాల్లో కుంభవృష్టి.. అతలాకుతలం అయిన కర్నాటక.. ముగ్గురు మృతి..

ఒకే ఒక్క వర్షం.. ఓ కుటుంబంలో పెను తుఫాను సృష్టించింది. విహార యాత్రకోసం వెళ్ళిన ఓ తెలుగు కుటుంబానికి బెంగుళూరులోని కెఆర్‌ సర్కిల్‌ అండర్‌పాస్‌ మృత్యుకుహరంలా మారింది. పట్టుమని పాతికేళ్ళు కూడాలేని ఓ యువతి ప్రాణాలు హరించేసింది బెంగుళూరులో కురిసిన కుంభవృష్టి. కర్నాటకలో కుంభ వృష్టికి మొత్తం ముగ్గురు మృత్యువాత పడ్డారు.

Karnataka Rains: క్షణాల్లో కుంభవృష్టి.. అతలాకుతలం అయిన కర్నాటక.. ముగ్గురు మృతి..
Hyderabad
Follow us
Shiva Prajapati

|

Updated on: May 21, 2023 | 8:45 PM

ఒకే ఒక్క వర్షం.. ఓ కుటుంబంలో పెను తుఫాను సృష్టించింది. విహార యాత్రకోసం వెళ్ళిన ఓ తెలుగు కుటుంబానికి బెంగుళూరులోని కెఆర్‌ సర్కిల్‌ అండర్‌పాస్‌ మృత్యుకుహరంలా మారింది. పట్టుమని పాతికేళ్ళు కూడాలేని ఓ యువతి ప్రాణాలు హరించేసింది బెంగుళూరులో కురిసిన కుంభవృష్టి. కర్నాటకలో కుంభ వృష్టికి మొత్తం ముగ్గురు మృత్యువాత పడ్డారు.

బెంగుళూరు మహా నగరంలో వరద విషాదం హడలెత్తించింది. కొద్దిసేపే కురిసిన కుండపోత వర్షం ఓ తెలుగు కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టింది. ఇన్‌ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తోన్న భాను రేఖ అనే తెలుగు యువతి నీటమునిగిన కారులో చిక్కుకుపోయి ఊపిరిసలపక విలవిల్లాడింది. పట్టుమని పాతికేళ్ళు కూడాలేని భానురేఖ వరద భీభత్సానికి బలైపోయింది. విహారయాత్రకోసం వెళ్ళి విషాదంలో మునిగిపోయిన ఆ కుటుంబం కళ్ళముందే కన్నబిడ్డ దూరమై గుండెలవిసేలా రోదిస్తోంది.

చిన్నవానకే చివురుటాకులా వణికిపోయే బెంగుళూరులో కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది. విహార యాత్రకోసం బెంగుళూరుకి వెళ్ళిన ఓ తెలుగు కుటుంబం ప్రయాణిస్తోన్న కారు కెఆర్‌ మార్కెట్‌ వద్ద అండర్‌ పాస్‌లో వరదనీటిలో చిక్కుకుపోయింది. ప్రాణభీతితో హడలిపోయింది. నీటిలోకి వస్తోన్న కారుని ఆపేయాలనీ, నీటిలో మునిగిపోతుందని వారిస్తున్నా వినకుండా నీటిలోకి చొచ్చుకొచ్చింది కారు. క్షణాల్లోనే భారీ వరదనీటిలో మునిగిపోయింది.

ఇవి కూడా చదవండి

దీంతో కారులో ప్రయాణిస్తోన్న ఆరుగురు వ్యక్తులు నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న రక్షణ సిబ్బంది హఠాన్‌పరిణామానికి తేరుకుని నీటిలోకి దూకి అతికష్టం మీద ఆరుగురినీ బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే భాను రేఖ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మాత్రం నీళ్ళుమింగేసింది. రబ్బురు ట్యూబుకి వేలాడబడుతోన్న యువతిని హుటాహుటిన దగ్గర్లో ఉన్న సెయింట్‌ మార్తాస్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

సెయింట్‌ మార్తాస్‌ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యువతిని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. అనంతరం కుటుంబ సభ్యులే యువతిని లోనికి తీసుకెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. భాను రేఖ కన్నుమూసింది. బాధితులు కృష్ణా జిల్లాకి చెందిన తేలప్రోలు వాసులు. ఓ వారం రోజులు ఆటవిడుపుకోసం బెంగుళూరుకి వచ్చిన ఈ కుటుంబం క్యాబ్‌ బుక్‌చేసుకొంది. అదే ఆ కుటుంబానికి మృత్యుశకటంగా మారింది.

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. ఆకస్మిక వరదలపై సీఎం సిద్ధరామయ్య సమీక్షించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఒకే ఒక్క వర్షం బెంగుళూరు ప్రజల గుండెల్లో భయోత్పాతం సృష్టిస్తోంది. వర్షం పడితే చాలు కాంక్రీటు జంగిల్స్‌ నడిసంద్రంలా మారిపోతున్నాయి. ఏది ఏరో… ఏది నీరో తెలియని అగమ్యగోచర పరిస్థితి బెంగుళూరు వాసుల్లో వణుకుపుట్టిస్తోంది. ఎక్కడికక్కడ నిలిచిపోయిన నీళ్ళు జనంలో కలవరం రేకెత్తిస్తున్నాయి. అడుగుతీసి అడుగువేయాలంటే హడలిపోతున్నారు జనం.

మెజెస్టిక్‌, కేఆర్‌ మార్కెట్‌, మల్లేశ్వరం, జయనగర్‌, మల్లేశ్వరం, యశవంతపురం, శేషాద్రిపురం, మేఖ్రీ సర్కిల్‌, జేపీ నగర్‌, నందిని లేఅవుట్‌, రాజాజీనగర్‌లు వరదనీటిలో చిక్కుకుపోయాయి. ఈదురు గాలులతో మొదలైన వాన చూస్తుండగానే భారీ వర్షంగా మారి తుఫానును తలపించింది. చెట్లుకూలిపడ్డాయి. సబ్‌వేలూ.. అండర్‌పాస్‌లూ.. వరదనీటితో మునిగిపోయాయి. బెంగుళూరులో భాను రేఖ, చిక్కమగ్‌ళూరులో మరో వ్యక్తి భారీ వర్షాల ధాటికి మృత్యువాత పడ్డారు.

భారీ వర్షం కారణంగా కుమారకృపా రోడ్డు పక్కనే ఉన్న చెట్ల కొమ్మలు నేలకొరిగాయి. చిత్రకళా పరిషత్ ఎదుట భారీ వృక్షం నేలకూలడంతో కారు, బైక్ ధ్వంసమయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..