Ashwini Vaishnaw: రైల్వే ఆస్తుల పరిరక్షణకు చట్టాన్ని మరింత బలోపేతం చేస్తాం: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, రాకపోకలకు అంతరాయం కలిగించడం వంటి చర్యలు.. ఏ సమస్యకైనా పరిష్కారం కాదంటూ రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ వివరించారు.
Ashwini Vaishnaw – Agnipath scheme:సైన్యం నియామకాల్లో అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎక్కువగా రైల్వే ఆస్థులను నిరసనకారులు ధ్వంసం చేశారు. దీంతోపాటు నిరసనకారులు పలు రైళ్లకు సైతం నిప్పంటించారు. దీంతో పలు చోట్ల భారీగా ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ క్రమంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వే ఆస్తులను పరిరక్షించేందుకు రైల్వే చట్టాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని శనివారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, రాకపోకలకు అంతరాయం కలిగించడం వంటి చర్యలు.. ఏ సమస్యకైనా పరిష్కారం కాదంటూ వివరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ‘అగ్నిపథ్’ నిరసనకారులకు అశ్విని వైష్ణవ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం యువత సమస్యలన్నింటినీ వింటుందని, వాటిని సకాలంలో పరిష్కరిస్తుందని సూచించారు.
రైల్వే మన సొంత ఆస్తి అని అర్థం చేసుకోవాలి. పేద, మధ్యతరగతి వర్గాలకు, విమాన సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకూ రైల్వేశాఖ సేవలు అందిస్తుందంటూ వైష్ణవ్ వివరించారు. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రైల్వే చట్టాన్ని మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైల్వే ఆస్తులను కాపాడుకునేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..