Hyderabad: వర్క్ ఫ్రం హోం‌ను వీడని హైదరాబాద్ ఐటీ సెక్టార్.. ప్రతికూల ప్రభావం ఉండొచ్చంటున్ననిపుణులు

ఇంటిలో ఉండి ఉద్యోగాలు చేయడం హాయిగానే ఉంటుంది కానీ మరి వర్క్ కల్చర్‌తో పాటు  కొలాబిరేషన్‌... టీమ్ వర్క్... లెర్నింగ్ సంగతేంటి అంటున్నారు మరికొందరు ఐటి విశ్లేషకులు. ఇదే విధానాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో ఇది ఐటీ రంగానికి చాలా నష్టాన్నే తెస్తోందని అభిప్రాయపడుతున్నారు.

Hyderabad: వర్క్ ఫ్రం హోం‌ను వీడని హైదరాబాద్ ఐటీ సెక్టార్.. ప్రతికూల ప్రభావం ఉండొచ్చంటున్ననిపుణులు
Work From Home
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 18, 2022 | 1:15 PM

Hyderabad IT Industry: కరోనా లాక్‌డౌన్ కారణంగా వర్క్ ఫ్రం హోం (Work From Home) కు చేరిన సాఫ్ట్ వేర్ రంగం.. ఇప్పట్లో నూటికి నూరుశాతం గడపదాటే అవకాశం లేదా? కరోనా భయాలు తొలగినా ఐటీ సెక్టార్ ఆఫీసులకు పూర్తి స్థాయిలో ఉద్యోగులు వచ్చే అవకాశం ఉందా? భవిష్యత్ లో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఉద్యోగుల్లో 50 శాతం .. ఇళ్లకే పరిమితం కానున్నారా? దీంతో ఐటీ రంగం లాభాలకు ఢోకాలేకున్నా భవిష్యత్ లో ఉద్యోగులు స్కిల్ డెవలెప్మెంట్, లెర్నింగ్ స్కిల్స్, టీమ్ వర్క, వర్క్ కల్చర్‌కు దూరమై.. తద్వారా ఐటి రంగానికి అతిపెద్ద ప్రమాదం పొంచివుందా? అవుననే జవాబులే వినిపిస్తున్నాయి. ఇంతకీ.. వర్క్ ఫ్రైం హోం లో ఇంతకాలం ఉన్న హైదరాబాద్ సాఫ్ట్వేర్ రూట్ ఎటువైపు ప్రయాణంచబోతోంది.

హైదరాబాద్ సాఫ్ట్ వేర్ రంగం దేశంలోనే ప్రధాన భూమిక పోషిస్తోంది. బెంగళూరు కు పోటీ ఇస్తూ ఇక్కడి ఐటి రంగం పరుగులు తీస్తోంది. ఇలాంటి రంగం.. కరోనా తో గడపదాటి రెండేళ్లు అయింది.  కరోనా ఫస్ట్ ,సెకండ్, థర్డ్ వేవ్ లు గడిచాయి… అయినా ఇప్పటికీ వర్క్ ఫ్రం ఆఫీసు గ్యారంటీ కనిపించడంలేదు. మూడో వేవ్ చూసిన తరువాత.. చాలా వరకూ కరోనా భయాలు తగ్గాయి. సాధారణ జనజీవితం కొసాగుతోంది. అనేక రంగాల్లో 50 శాతం నుంచి 90శాతం వరకూ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా.. సాఫ్ట్ రంగంలో మాత్రం.. దీనికి భిన్న మైనపరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ కేవలం 20శాతం లోపు మాత్రమే.. ఈరంగం ఇళ్లు విడిచి ఆఫీసుల్లో అడుగుపెట్టింది. ఇంకా 80శాతం వర్క్ ఫ్రం హోం లలోనే కొనసాగుతోంది. మరి ఈ పరిస్థితులు మారే అవకాశం ఉందా? ఇందులో లాభమెంత నష్టమెంత? ఇవే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఏ రంగమైనా లాభనష్టాలు బేరీజు వేసుకునే తన అడుగులను వేస్తుంది. కరోనా కాలంలో చాలా రంగాలు ఇదే చేశాయి. కానీ ఐటీ రంగానికి మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆఫీసుల్లో ఉన్నా.. ఇంటి పట్టున ఉన్నా.. ఈ రంగం ప్రొడక్టివిటీలో గానీ లాభాల్లో గానీ ఎలాంటి తేడా కనిపించలేదంటున్నారు నిపుణులు. మరో వైపు… వర్క్ ఫ్రం హోం వల్ల అనేక ఖర్చులు తగ్గిపోయి… ఈ రంగం నడుపుతున్నవారికి ఒకింత లాభం చేకూర్చిందనే లెక్కలు వేస్తున్నారు.

రెండేళ్లకు పైగా ఐటి సెక్టార్ … వర్క్ ఫ్రం హోం కే పరిమితం కావడం వల్ల. ఒకప్పుడు కళ కళ లాడుతూ కనిపించిన హైదరాబాద్ ఐటి కారిడార్ లు … ఇంకా పూర్తి స్ధాయిలో రద్దీగా కనిపించడంలేదు. మైండ్ స్పెస్ ఒకప్పుడు.. ఇ ప్పుడు అనేటట్లుగా ఉంది. హైదరాబాద్ ఐటి హబ్ లో మరో కీకలమైన ప్రాంతం … విప్రో సెంటర్. ఫినాన్స్ డిస్ట్రిక్ట్ కు ఇది కేరాఫ్‌ అడ్రస్. ఇక్కడ ఐటి ఉద్యోగుల రాకపోకలతో ఒక పద్మవ్యూహంగా ఉండే ప్రాంతం. కానీ వర్క్ ఫ్రం హోం తో ఈ ప్రాంతాలు కళతప్పి కనిపిస్తున్నాయి. సాధారణ వాహనాల రాకపోకలు మినహా.. ఐటి ఫ్లేవర్ ను ఈప్రాంతం కోల్పోయింది.

ఇవి కూడా చదవండి

సాఫ్ట్‌ వేర్‌ రంగం ఇంటికే పరిమితం కావడం వల్ల ఆ రంగంలోని ఉద్యోగులకు నష్టం లేదు. మరి యాజమాన్యాలకు అసలే నష్టం లేదు.అంటే సరిపోదు. ఎందుకంటే… దీనిపై ఆధారపడిన వారు వన్ ఈస్ట్ టూ 3 నుంచి 6 వరకూ ఉన్నారు. మరి సాప్ట్ వేర్ ఇళ్లకే పరిమితం కావడంతో దాదాపుగా ఐటి కారిడార్ లో దుకాణాలు బంద్ అన్నట్లుగా మారిపోయింది. అనేక వ్యాపారాలు మూతపడ్డాయి.

ఐటి ఉద్యోగులు ఆఫీసు మొఖం చూసి రెండేళ్లకు పై మాటే. ఇలాంటి పరిస్థితులు మధ్య… ఈ ఇండస్ట్రీలో ఉద్యోగులు ఏమనుకుంటున్నారు. ఆఫీసుకంటే.. ఇల్లే పదిలం అనుకుంటున్నారా? అంటే మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. ఏదైనా సరే.. భవిష్యత్ లో 50 నుంచి 60 శాతం మాత్రమే ఐటి రంగంలో ఆఫీసులకు వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంటుందనే విశ్లేషణలే వెల్లడవుతున్నాయి. ఎంతకాలం ఇంటిలో ఉన్నా.. సాఫ్ట్ వేర్ రంగానికి వచ్చిన నష్టం లేదు. దీనికి తోడు ఖర్చులు తగ్గుతున్నాయి. ఉద్యోగులు కడుపులో చల్ల కదల కుండా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇదే కొత్త కాదు.. చాలా వరకూ సాఫ్ట్ వేర్ రంగానికి ఇది అలవాటే. ఇప్పుడు కరోనా వచ్చింది కానీ గతంలో కూడా అనేక ప్రాంతాల నుంచి విధులు నిర్వహించే సిస్టమ్ ఉందంటున్నాయి సాఫ్ట్ వేర్ ఉద్యోగ సంఘాలు . భవిష్యత్ లో కూడా 40 నుంచి 50నుంచి ఐటి రంగం వర్క్ ఫ్రం హోం లోనే కొనసాగుతుందని.. భవిష్యత్ లో 50శాతం మాత్రమే ఆఫీసులకు వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి వెంటాడుతుందని విశ్లేషిస్తున్నారు తెలంగాణ ఐటి ఎంప్లాయిస్ అసోసియేషన్‌ అధ్యక్షుడు సందీప్ మక్తల్.

ఇంటిలో ఉండి ఉద్యోగాలు చేయడం హాయిగానే ఉంటుంది కానీ మరి వర్క్ కల్చర్‌తో పాటు  కొలాబిరేషన్‌… టీమ్ వర్క్… లెర్నింగ్ సంగతేంటి అంటున్నారు మరికొందరు ఐటి విశ్లేషకులు. ఇదే విధానాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో ఇది ఐటీ రంగానికి చాలా నష్టాన్నే తెస్తోందని అభిప్రాయపడుతున్నారు. అమెరికాలాంటి దేశాల్లో సైతం  ఆఫీసులకు వచ్చి వర్క్ చేసే పరిస్థితులు ప్రారంభమయ్యాయని యూఎస్‌ ఐటి కన్‌ సెల్టెంట్, ఐటి విశ్లేషకులు ఎం.చంద్రశేఖర్ తెలిపారు.

వర్క్ ఫ్రం హోం ఉద్యోగం బాగానే ఉంది.. కానీ ఎంత కాలం.. ఐటీ రంగంలో ఇదే పరిస్థితి కొనసాగితే.. దీనిపై ఆధారపడిన అనుబంధ జీవితాలు ఏంకావాలి? అందరూ బాగుడాలి. అందులో మేముండాలి… అనే సమాజ సూత్రం మిస్ అవుతుంది. అందులోనే వర్క్ ప్లేస్ లో విధి నిర్వహణ ఎప్పటికీ మంచిదే అంటున్నారు. ఇప్పటికే ఇళ్లకే పరిమితమైన వర్క్ బోర్ అవుతోందంటున్నారు ఐటి టీమ్ లీడర్ కుమార్. ఐటి సెక్టార్లో కొనసాగుతున్న ఈ తర్జన భర్జనల మధ్య మరి ఈరంగంపై ఆధారపడిన వారి పరిస్థితి అత్యంత ధీనంగానే ఉంది. ఫుడ్… ట్రాన్స్ పోర్ట్…సెక్యురిటీ వంటి రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒకప్పుడు ఉదయం నుంచి అర్థరాత్రి వరకూ చేసే వ్యాపారాలు ఇప్పుడు అంతంత మాత్రంగా మారిపోయాయంటున్నారు వ్యాపారులు. ఐటి ఉద్యోగుల రవాణాకోసం కొన్ని కార్లు మూలపడ్డాయి. చివరికి ఓలా, ఊబర్ వంటి సంస్థల్లో తమ క్యాబ్‌లు పెట్టి బ్యాంకు ఈఎంఐ లు చెల్లించుకునే పరిస్థితి ఉందని గగ్గోలు పెడుతున్నారు క్యాబ్ డ్రైవర్లు.

మరి ఎంత కాలం ఐటి రంగానికి ఈ అజ్ఙాత వాసం. ఉద్యోగులు ఇళ్లకే పరిమితమైతే ఎలాంటి నష్టం లేదా? ఎంప్లాయిస్ నుంచి సంస్థల యజమానుల వరకూ లాభాలు ఒక్కటే చాలా? మౌళిక సదుపాయాలకు వెచ్చించే ఖర్చులు మిగలడమే… వర్క్ ఫ్రం హోం కల్చర్ ను ప్రోత్సహించడానికి కారణమవుతుందా? ఐటి సెక్టార్లో వస్తున్న లాభాలు.. అవుతున్న ఖర్చులను బేరీజు వేస్తే ఉద్యోగులపైనే అత్యధిక మొత్తం చెల్లిస్తున్నామంటున్నాయి ఐటి కంపెనీనల యాజమాన్యాలు. అద్దెలు.. విద్యుత్… రవాణా… వంటి వాటికి వెచ్చిస్తున్న మొత్తం చాలా చిన్నదే అంటున్నాయి. దీని కోసం వర్క్ ఫ్రం హోం ను ప్రోత్సహించాల్సిన అవసరం కంపెనీలకు లేదంటున్నాయి.

మరోవైపు… చిన్న, సూక్ష్మ ఐటి కంపెనీలు ఇప్పటికే వర్క్ ఫ్రం ఆఫీసులను 60 నుంచి 80శాతం ప్రారంభించాయని ఇంకా లార్జ్ కంపెనీలు మాత్రమే కేవలం 10 నుంచి 20 శాతం మాత్రమే ఆఫీసుల్లో పనులు నిర్వహిస్తున్నాయంటున్నారు. మరో మూడు నెలల్లో 50శాతం విధులు ఆఫీసుల నుంచి సాగాల్సిన అవసరం ఉందని.. లేకపోతే ఐటి ఇండస్ట్రీ గ్రోత్ దెబ్బతినే ప్రమాదముందంటున్నారు హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ప్రైసెస్ అసోసియేషన్ కార్యదర్శి భరణి కుమార్. ఇన్ని భిన్న ఆలోచనలు, విశ్లేషణల మధ్య ఐటి సెక్టార్ నూటికి నూరుశాతం వర్క్ ఫ్రం ఆఫీస్ లకు రాకపోయినా… కనీసం 70 నుంచి 80 శాతమైనా ఈ ఏడాది చివరికైనా ప్రారంభమవుతుందా? అనే ప్రశ్నలు బిలియన్ డాలర్ల ప్రశ్నగానే కనిపిస్తోంది.

( గణేష్‌.వై, టివి9 తెలుగు, హైదరాబాద్‌)

మరిన్ని హైదరాబాద్ వార్తలు చదవండి..