President Election 2022: రేసులో నుంచి తప్పుకున్న ఫరూఖ్ అబ్దుల్లా.. ఇక మిగిలింది ఆయనొక్కరే..
Presidential Elections 2022: క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతూ జమ్ముకశ్మీర్, దేశం కోసం మరింత సేవ చేయాలని ఆశిస్తున్నట్లు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా ఓ ప్రకటనలో తెలిపారు.

Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికల రేసులో నుంచి నేషనల్ కాన్ఫెరెన్స్ చీఫ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా(Farooq Abdullah) వైదొలిగారు. ఆ మేరకు ఆయన స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశారు. మరికొంత కాలం యాక్టివ్ పాలిటిక్స్‌లో కొనసాగేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతూ జమ్ముకశ్మీర్, దేశం కోసం మరింత సేవ చేయాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపే అంశంపై ఢిల్లీలో మమతా బెనర్జీ బుధవారం నిర్వహించిన విపక్ష నేతల సమావేశంలో చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరును మమతా బెనర్జీ ప్రతిపాదించగా.. కాంగ్రెస్, వామపక్షాలు, శివసేన తదితర పార్టీలు మద్ధతు తెలిపాయి. అయితే తనకు ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ మిగిలే ఉందంటూ రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని శరద్ పవార్ సున్నితంగా తిరస్కరించారు. దీంతో పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాల్ కృష్ణ గాంధీ, నేషనల్ కాన్ఫెరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా అభ్యర్థిత్వాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపడంపై విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినా.. ఎవరిని నిలపాలన్న అంశంపై నిర్ణయం తీసుకోకుండానే విపక్షాల సమావేశం ముగిసింది. ఉమ్మడి అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకునేందుకు విపక్ష నేతలు మరోసారి(ఈనెల 21న) ఢిల్లీలో సమావేశంకానున్నారు.
ఈ నేపథ్యంలో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిత్వం నుంచి తన పేరును ఉపసంహరించుకుంటున్నట్లు ఫరూఖ్ అబ్దుల్లా ఓ ప్రకటన విడుదల చేశారు. విపక్ష నేతల సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరును మమతా బెనర్జీ ప్రతిపాదించగా.. మద్ధతు తెలియజేస్తూ పలు పార్టీల నేతల నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు తెలిపారు. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా తన పేరును ప్రతిపాదించినందుకు విపక్ష నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం సంక్లి్ష్ట పరిస్థితులు నెలకొన్నాయని.. ఈ పరిస్థితుల్లో క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. జమ్ముకశ్మీర్, దేశానికి మరింత సేవ చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఫరూఖ్ అబ్దుల్లా నిర్ణయంతో ఇక విపక్షాల తరఫున మహాత్మా గాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాల్ కృష్ణ గాంధీ ఉమ్మడి అభ్యర్థి కావొచ్చని తెలుస్తోంది. ఈ నెల 21న ఢిల్లీలో జరగనున్న విపక్ష నేతల సమావేశంలో.. తమ ఉమ్మడి అభ్యర్థిపై విపక్షాలు తుది నిర్ణయం తీసుకోనున్నాయి.





Farooq Abdullah Letter
కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి తరఫున ఎవరిని బరిలో నిలుపుతారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మోడీ – షా ద్వజయం మనసులో ఎవరున్నారన్న అంశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొందరు విపక్ష నేతలతో మాట్లాడారు. అయితే విపక్షాలు మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలో నిలపాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రపతి ఎన్నిక అనివార్యం కానుంది. జులై 18న దేశ 16వ రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనుండగా.. జులై 21న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం జులై 24వ తేదీ వరకు ఉంది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..




