CM KCR: బీజేపీని గద్దె దించాల్సిందే.. కలిసి వచ్చేవాళ్లతోనే ముందుకు.. బీహార్ పర్యటనలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
Telangana CM KCR: బీజేపీ ముక్త్ భారత్ కోసం ప్రతిఒక్కరూ ఉద్యమించాలని.. మరోమారు పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బీహార్ పర్యటనకు వెళ్లిన గులాబీ బాస్... కాషాయ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
BJP Mukt Bharat: దేశరాజకీయాలపై ఫోకస్ పెంచిన కేసీఆర్.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అడుగడుగునా బీజేపీపై దుమ్మెత్తి పోస్తున్న గులాబీ బాస్… బీహార్ పర్యటనలో మరోసారి కాషాయదళంపై నిప్పులు చెరిగారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మం పేరిట చిల్లర రాజకీయాలు చేస్తున్న బీజేపీతో… దేశానికి భారీ నష్టం తప్పదని హెచ్చరించారు కేసీఆర్.
గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశాక.. బీహార్ సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌లతో చర్చలు జరిపిన కేసీఆర్ అనంతరం మీడియాతో ముచ్చటించారు. 8ఏళ్లుగా బీజేపీ పాలనలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కటి కావాల్సిన తరుణం ఆసన్నమైందన్న కేసీఆర్.. కలిసి వచ్చే పార్టీలన్నింటితో ముందుకెళ్తామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని చర్చల జరిపి.. కూటమిని నడిపే నాయకుణ్ని ఎన్నుకుంటామని చెప్పుకొచ్చారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపైనా మండిపడ్డారు గులాబీ దళపతి. శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనివనీ… సీబీఐలాంటి సంస్థలు రాష్ట్రాల్లోకి చొచ్చుకు రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత కేంద్రప్రభుత్వం.. దర్యాప్తు సంస్థల పరువు తీసేలా వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు.
ఇదివరకే దేశంలోని చాలా రాష్ట్రాల్లో పర్యటించి.. విపక్ష పార్టీ ముఖ్యమంత్రులతో చర్చలు జరిపిన కేసీఆర్… ఇవాళ బీహార్ వేదికగా పేల్చిన పొలిటికల్ టపాసులు ఏ స్థాయిలో దుమారం రేపుతాయో చూడాలి.