Aadhar Card: ప్రూఫ్ ఎలా అవుతుంది..? ఆధార్ కార్డుపై సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్..
పలు రాష్ట్రాల్లో ఓటర్ల సమగ్ర సవరణను ఈసీ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా.. ధర్మాసనం ఆధార్ కార్డుపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే..

Supreme Court: ఆధార్ కార్డుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆధార్ కార్డు అనేది భాతర పౌరసత్వానికి ప్రూఫ్ డాక్యుమెంట్ ఎట్టిపరిస్థితుల్లో కాదని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళలో ఓటర్ సవరణపై ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆధార్ ఉన్నవారికి ఓటర్ కార్డు ఇచ్చేయాలా? అంటూ మండిపడింది. కొంతమంది చొరబాటుదారులు ఆధార్ కార్డులు పొందటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. భారత పౌరులు కానివారు ఆధార్ పొందితే వారికి ఓటు హక్కు ఇస్తారా? అంటూ మండిపడింది.
పౌరసత్వానికి ఆధార్ అనేది ప్రూఫ్ కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆధార్ అనేది సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడటానికి ఏర్పాటు చేసిందని, రేషన్ కార్డు కోసం ఆధార్ పొందిన వ్యక్తికి ఓటర్ కార్డు ఇస్తారా? అంటూ ప్రశ్నించింది. చొరబాటుదారులు ఇక్కడ కార్మికులుగా పనిచేస్తుంటే.. వారికి కూడా ఓటు కల్పిస్తారా? అంటూ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా డిసెంబర్ 1లోపు దీనిపై సమాధానం ఇవ్వాలని ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించింది.
ఈ సందర్భంగా ఓటు హక్కును పొందేందుకు ఆధార్ కార్డును ఓ హక్కును నిర్ధారించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఆధార్ కలిగి ఉన్న విదేశీయులను ఓటు వేయడానికి అనుమతించవచ్చా? అంటూ పిటిషనర్లను ప్రశ్నించింది. అయితే పిటిషనర్ల తరపు న్యాయవాది కబిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఓటర్ల సవరణ ప్రక్రియ ఓటర్లపై రాజ్యంగ విరుద్ద భారాన్ని మోపుతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఇంతకముందు ఎప్పుడూ సవరణ ప్రక్రియ లేదు కదా అని.. ఇప్పుడు నిర్వహించడం సరికాదనడం సరికాదని తెలిపింది.




