Mann Ki Baat: ప్రధాని మోడీ ‘మన్‌కీ బాత్’ వందో ఎపిసోడ్.. గల్లీ నుంచి ఐక్యరాజ్యసమితి వరకు లైవ్.. పూర్తి వివరాలివే
ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మన్ కీ బాత్’ రేడియో ప్రోగ్రామ్.. మరో మైలురాయిని అందుకోనుంది. ఇవాళ వందో ఎపిసొడ్ ప్రాసారం కానుంది. మోదీ రేడియో ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మాటలను... ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు.
PM Modi’s ‘Mann Ki Baat’: ప్రతీనెల చివరి ఆదివారం ప్రసారమయ్యే మోదీ ‘మన్ కీ బాత్’ ప్రోగ్రాం జనబాహుళ్యానికి ఎంతగానో దగ్గరైంది. దేశ ప్రజలతో మమేకం కావాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని ప్రజలతో పలు విషయాలపై ముచ్చటిస్తారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో జరిగే అంశాలపై కూడా ప్రస్తావిస్తుంటారు. ఆ నెలలో జరిగిన అంశాలు, వివిధ రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలు సహా అనేక విషయాలను ప్రధాని మోదీ ప్రజలతో పంచుకుంటూ వచ్చారు. మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రోగ్రామ్.. మరో మైలురాయిని అందుకోనుంది. మన్‌కీబాత్ వందో ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. ఈ మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోడీ రూ.100 కాయిన్ను విడుదల చేయనున్నారు. అలాగే, అనేక అంశాలపై కీలక ప్రసంగం చేయనున్నారు.
మన్ కీ బాత్ వందో ఎపిసొడ్‌ను కోట్లాది మంది ప్రజలు ఆలకించేలా బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా 4 లక్షల ప్రాంతాల్లో.. ప్రజలు వీక్షించేందుకు చర్యలు చేపట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడి నుంచి.. పోలింగ్ కేంద్రం స్థాయి నాయకుల వరకు అంతా పాల్గొనేలా పెద్దఎత్తున సమాయత్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా మన్ కీ బాత్ వినేలా ఏర్పాట్లు చేసినట్లు బీజేపీ వివరించింది. గవర్నర్ల అధికారిక నివాసమైన అన్నిరాష్ట్రాల రాజ్ భవన్లు, బీజేపీ పాలిత రాష్ట్రాలు, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ముఖ్యమంత్రుల నివాసాల్లో వందో ఎపిసోడ్‌ను వినిపించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఇక నడ్డాతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే మన్‌కీబాత్ ప్రసార కార్యక్రమాలకు హాజరు కానున్నారు. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు మన్‌కీబాత్ వందో ఎపిసోడ్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.
ప్రముఖుల ప్రశంసలు..
ఈ ప్రోగ్రామ్ నిజమైన భారత్‌ను దేశ ప్రజలకు పరిచయం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిందని దాదాపు 76% మంది భారతీయ మీడియా ప్రతినిధులు విశ్వసిస్తున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నిర్వహించిన స్పెషల్ స్టడీ ఈ వివరాలు వెల్లడించింది. మరోవైపు మన్‌కీబాత్ కార్యక్రమంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు.. ప్రశంసలు కురిపించారు. వందో ఎపిసోడ్ ప్రసారమవుతున్న సందర్భంగా మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ అభినందించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో ముడిపడిన పారిశుద్ధ్యం, ఆరోగ్యం, మహిళా ఆర్థిక సాధికారత వంటి వాటిపై సామాజిక చర్యలు చేపట్టేందుకు మన్ కీ బాత్ దోహదపడిందని ప్రధాని మోదీకి బిల్ గేట్స్ శుభాకాంక్షలు తెలిపారు.
మరో వైపు వందో ఎపిసోడ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అమెరికాలోనూ ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రోగ్రామ్ లైవ్ ప్రసారం చేయనున్నారు. అలాగే అమెరికాలోని భారతీయుల కోసం భారత కాన్సూలేట్ న్యూజెర్సీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అమెరికా కాలమానం ప్రకారం ఈ ప్రోగ్రామ్ అక్కడ ఆదివారం అర్థరాత్రి ఒంటిగంటన్నరకు ప్రసారమవుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..