South Central Railway: సరకు రవాణాలో రికార్డులను కొల్లగొట్టిన దక్షిణ మధ్య రైల్వే.. కేవలం 9 నెలల్లోనే..
దక్షిణ మధ్య రైల్వే మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. కేవలం 9 నెలల్లోనే 100 మిలియన్ టన్నులపైగా ఎక్కువ సరుకును లోడ్ చేసి కీలకమైన మైలురాయిని అధిగమించింది.
దక్షిణ మధ్య రైల్వే మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. కేవలం 9 నెలల్లోనే 100 మిలియన్ టన్నులపైగా ఎక్కువ సరుకును లోడ్ చేసి కీలకమైన మైలురాయిని అధిగమించింది. జనవరి 9 నాటికి దీనిని అధిగమించినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. 9 జనవరి నాటికి 100.236 మిలియన్ టన్నుల (ఎం.టి) సరుకులను లోడ్ చేసి ఈ రికార్డును సొంతం చేసుకుంది. గత ఏడాది కాలంతో పోలిస్తే దాదాపు 11.5 మిలియన్ టన్నులు అధికమని రైల్వే తెలిపింది. గత 2018-19 సంవత్సరంలో 306 రోజులతో పోలిస్తే.. సౌత్ జోన్ ఈ సంవత్సరం 284 రోజులలో 100 మిలియన్ టన్నుల సరుకులను రవాణాను చేసింది. అతి తక్కువ సమయంలో (9 నెలల 9 రోజులు) ఈ రికార్డును నమోదు చేయడంతోపాటు వేగవంతంగా వృద్ధి సాధించినట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది.
దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాలో రూ.9,755 కోట్ల ఆదాయంతో నూతన ఒరవడికి నాంది పలికింది. గత ఆర్థిక సంవత్సరం సరకు రవాణా ఆదాయం రూ.7,870 కోట్లు. దానితో పోలిస్తే దాదాపు 24% ఎక్కువ రాబడిని నమోదుచేసినట్లు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే.. ఈ సంవత్సరం అన్ని రకాల వస్తువుల రవాణాలో అధిక వృద్ధి పుంజుకుంది. లోడింగ్ వివరాలు సరకుల వారీగా ఈ కింది విధంగా ఉన్నాయి..
- 50.35 మిలియన్ టన్నుల బొగ్గు (17.7%)
- 26 మిలియన్ టన్నుల సిమెంట్ (5%)
- 5 మిలియన్ టన్నుల ఎరువులు (23%)
- 18.76 మిలియన్ టన్నుల ఇతర సరకులు (11%)
సౌత్ సెంట్రల్ రైల్వే రవాణాలో నూతన సరకులను లోడింగ్‌ను ఆకర్షించేందుకు అనేక క్రీయాశాలమైన చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో ఇప్పటికే ఉన్న సరుకు రవాణా వ్యవస్థను కూడా బలోపేతం చేసింది. సరుకు రవాణాను నిర్వహించే టెర్మినల్ ను నిరంతరం మెరుగుపర్చుకుంటూ సరుకులను సకాలంలో అందించేలా ఎప్పటికప్పుడు రైళ్ల రాకపోకలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. సరకు రవాణాలో 100 మిలియన్ టన్నుల మార్కును అధిగమించినందుకు గాను దక్షిణ మధ్య రైల్వే ఆపరేషన్స్, కమర్షియల్ టీమ్‌ని ఈ సందర్భంగా అభినందించారు.
జోన్ అంతటా విధాన పరమైన సంస్కరణలు ప్రవేశపెట్టి, వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టడంతో పాటు వ్యాపార అభివృద్ధి కోసం యూనిట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీనివల్ల సరుకు రవాణా పరంగా జోన్ అసాధారణమైన పనితీరును కనబరిచిందని ఆయన పేర్కొన్నారు. సరుకు రవాణాలో అధిక వృద్ధి సాధించేందుకు వీలుగా మిగిలిన ఆర్థిక సంవత్సరంలో ఇదే రీతిలో తమ ప్రతిభను కొనసాగించాలని దక్షిణ మధ్య రైల్వే సిబ్బందికి జనరల్ మేనేజర్ సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..