AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nijjar killing: నిజ్జర్ హత్య వెనుక ఉంది వాళ్లేనా..? కీలక విషయాలు బయటపెట్టిన నిఘా వర్గాలు

ఖలిస్థానీ మద్దతుదారుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యల వల్ల భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే నిజ్జర్ హత్యకు సంబంధించి పలు కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే ఈ హత్య వెనుకాల పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.

Nijjar killing: నిజ్జర్ హత్య వెనుక ఉంది వాళ్లేనా..? కీలక విషయాలు బయటపెట్టిన నిఘా వర్గాలు
Hardeep Singh Nijjar
Aravind B
|

Updated on: Sep 27, 2023 | 5:03 PM

Share

ఖలిస్థానీ మద్దతుదారుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యల వల్ల భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే నిజ్జర్ హత్యకు సంబంధించి పలు కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే ఈ హత్య వెనుకాల పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఉటంకిస్తూ కొన్ని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే భారత్‌-కెనడా మధ్య ఉన్నటువంటి సంబంధాలను దెబ్బతీయడానికే పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్‌ఐ) అనే నిఘా సంస్థ.. హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను అంతమొందించి ఉంటుందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అధినేత అయిన నిజ్జర్‌కు కెనడాలో ఉంటున్నటువంటి పాకిస్థాన్ ఐఎస్‌ఐ నిఘా ఏజెంట్లతో సంబంధాలున్నాయి. అలాగే కెనడాకు వచ్చేటటువంటి తమ గ్యాంగ్‌స్టర్లకు పూర్తిగా మద్దతు ఇవ్వాలని ఐఎస్‌ఐ కూడా గత కొన్ని సంవత్సరాలుగా హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌పై ఒత్తిడి పెంచుతోంది. కానీ.. నిజ్జర్ మాత్రం ఖలిస్థానీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. అంతేకాదు అతడు స్థానికంగా కూడా పాపులారిటీని పెంచుకున్నాడు. అలాగే డ్రగ్స్‌ అక్రమ దందాను నియంత్రించినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే అతడిపై కోపం పెంచుకున్న పాకిస్థాన్ ఐఎస్‌ఐ.. నిజ్జర్‌ను ఎలాగైన హత్య చేయాలని కుట్ర పన్నినట్లు సమాచారం. దీనికోసం ఇద్దరు ఏజెంట్లకు పాక్ ఐఎస్‌ఐ ఈ బాధ్యతను అప్పగించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ఇక, కెనడాలో నిజ్జర్‌ ఉంటున్నటువంటి ప్రాంతానికి చుట్టుపక్కల ఐఎస్‌ఐ మాజీ అధికారులు కూడా ఉంటున్నట్లు తెలిసింది. అంతేకాదు వీరిలో మేజర్‌ జనరల్స్‌ నుంచి హవల్దార్‌ స్థాయి వరకు అధికారులు ఉన్నారట. అయితే వీరి ద్వారానే నిజ్జర్‌ కదలికలను తెలుసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్‌ నెలలో హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (45) కెనడాలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఉన్నటువంటి గురుద్వారా సాహిబ్‌ ప్రాంగణంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు నిజ్జర్‌ను కాల్చి చంపారు. నిషేధిత ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌, ‘గురునానక్‌ సిక్‌ గురుద్వారా సాహిబ్‌’ అధిపతి అయిన హర్‌దీప్‌.. ఇండియాలో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో కూడా ఒకడు. అంతేకాదు అతడి తలపై 10లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. అయితే ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలు చేయడంతో.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..