ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన పదో తరగతి విద్యార్థి.. రాత్రివేళ బిల్డింగ్ పైకి వెళ్లి ఏం చేశాడంటే..?
ఆ బాలుడికి 14 ఏళ్లే.. పదో తరగతి చదువుతున్నాడు.. ఓవైపు చదువు ఒత్తిడి.. మరోవైపు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు.. నిత్యం గేమ్స్ ఆడుతూ ఉండేవాడు.. ఈ క్రమంలోనే బాలుడు రాత్రివేళ అపార్ట్‌మెంట్ పైకి వెళ్లాడు.. ఆ తర్వాత కనిపించలేదు.. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.. ఎంత వెతికినా దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు..
హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఆ బాలుడికి 14 ఏళ్లే.. పదో తరగతి చదువుతున్నాడు.. ఓవైపు చదువు ఒత్తిడి.. మరోవైపు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు.. నిత్యం గేమ్స్ ఆడుతూ ఉండేవాడు.. ఈ క్రమంలోనే బాలుడు రాత్రివేళ అపార్ట్‌మెంట్ పైకి వెళ్లాడు.. ఆ తర్వాత కనిపించలేదు.. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.. ఎంత వెతికినా దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. రంగంలోకి దిగిన పోలీసులు వెతకగా.. ఆ అపార్ట్‌మెంట్ పక్క బ్లాక్‌లో రక్తపు మడుగులో పడిఉన్నాడు.. గత కొద్ది రోజులుగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై, చదువు ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
రాయదుర్గం పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేయాన్ష్ రెడ్డి (14) అనే విద్యార్థి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఖాజాగూడలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 7:30 గంటలకు రేయాన్ష్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు అర్ధరాత్రి దాటాక 2 గంటలకు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మంగళవారం ఉదయం వేళ బాలుడి కుటుంబం నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ పక్క బ్లాక్‌లో రేయాన్ష్ రక్తపు మడుగులో పడి కనిపించాడు. అప్పటికే రేయాన్ష్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
గత కొద్ది రోజులుగా విద్యార్థి ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస కావడం, చదువు ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడినట్లు భావిస్తున్నామని రాయదుర్గం పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కాగా.. రేయాన్ష్ మృతితో అతని తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఒత్తిడి, ఆన్లైన్ గేమ్స్ తదితర సమస్యలతో చిన్నారులు డిప్రెషన్‌కు గురవుతున్నారని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అలాంటి చిన్నారులను గుర్తించి సమయానికి చికిత్స అందిస్తే వారిలో మార్పు తీసుకురావొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే.. చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..