కశ్మీర్‌లో అంతుచిక్కని మరణాలు.. 45 రోజుల్లో 15 మంది మృతి.. దర్యాప్తు విస్తుపోయే వాస్తవాలు!
కశ్మీర్‌లో అసలేం జరుగుతోంది? మూడు కుటుంబాలలో డజనుకు పైగా మరణాలు ఆందోళన కలిగిస్తోంది. 15మంది చావులకు కారణమేంటి? అంతుచిక్కని మరణాలపై అధికారులు ఏమంటున్నారు? విందులకు మరణాలకు లింకేంటి? రంగంలోకి దిగిన సిట్ బృందం ముమ్మర దర్యాప్తు మొదలుపెట్టింది. మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు, జిల్లా యంత్రాంగం త్వరితగతిన విచారణ చేపడుతుందని ఆరోగ్య మంత్రి తెలిపారు.

అందాల కశ్మీ్‌ర్ లోయ అంతుచిక్కని మరణాలతో అల్లాడుతోంది. రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామంలో అనుమానాస్పద మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. నెలన్నర వ్యవధిలో 15 మంది చనిపోయారు .మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల నుంచి రక్త నమూనాలను సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న అత్యున్నత ల్యాబ్‌లకు పంపించింది జమ్ము కశ్మీర్ ప్రభుత్వం. పుణెలోని ఎన్‌ఐవీ, ఢిల్లీలోని ఎన్‌సీడీసీ, లక్నోలోని ఎన్‌ఐటీఆర్ , గ్వాలియర్ లోని డీఆర్‌డీఈ ల్యాబ్‌లకు పంపి టెస్టులు చేయించింది. ఈ మరణాలకు వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ కారణం కాదని ల్యాబ్‌లు వెల్లడించాయి. ఐఐటీఆర్ మాత్రం ఆ నమూనాల్లో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది. మిస్టరీ మరణాలను ఛేదించేందుకు 11 మందితో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది జమ్ముకశ్మీర్ ప్రభుత్వం.
బుధాల్ గ్రామంలో డిసెంబర్ 7న సహపంక్తి భోజనం పెట్టారు. ఇక్కడ భోజనం చేసిన అనంతరం ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 12న సహపంక్తి భోజనంలో విందు ఆరగించిన మరో కుటుంబంలోని తొమ్మిది మంది అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో ముగ్గురు చనిపోయారు. ఈనెల 12న కూడా సహపంక్తి భోజనం చేసిన ఓ కుటుంబంలోని పది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి ఓ బాలిక చనిపోయింది. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. నెలన్నర వ్యవధిలోనే మొత్తం 15 మంది చనిపోయారు. దీంతో గ్రామస్తులంతా భయంతో వణికిపోతున్నారు
విందు భోజనం చేసిన వారే అధిక జ్వరం, వాంతులు, స్పృహకోల్పోవడం వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. విందు భోజనంలో విషం కలిసిందా? లేక ఆయా కుటుంబాలను ఎవరైనా టార్గెట్ చేశారా? అంతుచిక్కని మరణాలకు ఇంకేదైనా కారణం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..