Banana: అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే అంతే సంగతులు..
అరటిపండులో పోషకాలు మెండు. తక్షణ శక్తినిచ్చే ఈ పండును సరైన సమయంలో తింటే అధిక ప్రయోజనాలు పొందవచ్చు. వ్యాయామానికి ముందు, భోజనం తర్వాత, సాయంత్రం స్నాక్‌గా తినడం మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అయితే జలుబు, దగ్గు వంటి సమస్యలున్నవారు ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తినకుండా ఉండాలి.

దాదాపు అన్ని సీజన్లలో, అతి తక్కువ ధరకే లభించే పండు ఏదైనా ఉందంటే అది అరటిపండు. తక్షణ శక్తిని ఇవ్వడంలో దీనికి సాటిలేదు. అయితే అరటిపండులో ఎన్ని పోషకాలు ఉన్నాయో.. దానిని తినడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ శరణ్ జెసి అరటిపండును ఎప్పుడు, ఎలా తినాలో వివరించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పోషకాల గని: అరటిపండు
అరటిపండులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఏ సమయంలో తింటే ఏ ప్రయోజనం?
వర్కవుట్‌కు ముందు: మీరు జిమ్‌కు వెళ్లినా లేదా ఏదైనా శారీరక వ్యాయామం చేసినా.. దానికి 15-30 నిమిషాల ముందు అరటిపండు తినండి. ఇందులోని కార్బోహైడ్రేట్లు మీకు తక్షణ శక్తిని అందిస్తాయి. దీనివల్ల మీ పనితీరు మెరుగుపడుతుంది.
భోజనం తర్వాత: మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అరటిపండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆహారం త్వరగా అరగడానికి సహాయపడటమే కాకుండా కడుపులో మంట, అసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది.
సాయంత్రం వేళల్లో: సాయంత్రం ఆకలిగా అనిపించినప్పుడు సమోసాలు, చిప్స్ వంటి జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా అరటిపండు తినడం మంచిది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు, స్వీట్లు తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది.
జాగ్రత్త: వీరు ఉదయం పూట తినకూడదు!
అరటిపండు ఆరోగ్యానికి మంచిదే అయినా.. తరచుగా జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఉదయం పూట ఖాళీ కడుపుతో దీనిని తీసుకోకపోవడమే మంచిది. మిగిలిన వారు ఉదయం పూట తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
మలబద్ధకానికి చెక్
అరటిపండు శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ సరైన పద్ధతిలో అరటిపండును తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








