Republic Day 2024: రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు.. రేపు జైపూర్‌కు మాక్రాన్

Republic Day 2024 update: దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం (జనవరి 26) జరిగే గణతంత్ర దినోత్సవ వేడులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారత పర్యటన నిమిత్తం రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు ఆయన గురువారం చేరుకుంటారు. అక్కడి అంబర్ ఫోర్ట్, జంతర్ మంతర్, హవా మహల్‌లను సందర్శిస్తారు.

Republic Day 2024: రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు.. రేపు జైపూర్‌కు మాక్రాన్
PM Modi, French President Emmanuel Macron (File Photo)
Follow us
Janardhan Veluru

|

Updated on: Jan 24, 2024 | 4:59 PM

Republic Day 2024 update: దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం (జనవరి 26) జరిగే గణతంత్ర దినోత్సవ వేడులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారత పర్యటన నిమిత్తం రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు ఆయన గురువారం చేరుకుంటారు. అక్కడి అంబర్ ఫోర్ట్, జంతర్ మంతర్, హవా మహల్‌లను సందర్శిస్తారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ రాక నేపథ్యంలో అంబర్ ఫోర్ట్ దగ్గర ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మాక్రాన్ రాక నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా గురువారం జైపూర్ వెళ్లనున్నారు. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన జంతర్ మంతర్ వద్ద మాక్రాన్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలవనున్నారు. మోడీ, మాక్రాన్ హవా మహల్‌లో ఆగి జంతర్ మంతర్ నుండి సంగనేరి గేట్ వరకు ఉమ్మడి రోడ్‌షోలో వారిద్దరూ పాల్గొంటారు.

రాంబాగ్ ప్యాలెస్‌లో మాక్రాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ డిన్నర్ కూడా ఇవ్వనున్నారు. ఇద్దరి మధ్య ముఖాముఖీ భేటీ ఏదీ షెడ్యూల్ లేదా ఉమ్మడి ప్రెస్ మీట్ షెడ్యూల్ కాకపోయినా.. గురువారం రాత్రి వారు ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇద్దరూ ప్రత్యేకంగా సమావేశమై ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాల బలోపేతం, అంతర్జాతీయ అంశాల గురించి చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

జైపూర్‌తో పాటు న్యూఢిల్లీలోనూ ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు రెడ్ కార్పెట్ స్వాగతం పలకనున్నారు. జనవరి 26న కర్తవ్య మార్గ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఫ్రెంచ్ ఆర్మీ బృందం కూడా ఇప్పటికే భారత్ చేరుకుంది. రిపబ్లిక్ డే పరేడ్‌ వీక్షించిన అనంతరం మాక్రాన్ ఫ్రెంచ్ రాయబార కార్యాలయంలోని సిబ్బందితో ముచ్చటించనున్నారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం అధికారిక విందులో పాల్గొంటారు.

భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఐదో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్. గతంలో ఫ్రాంకోయిస్ హోలాండ్ (2016), నికోలస్ సర్కోజీ (2008), జాక్వెస్ చిరాక్ (1998), వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్ (1980), జాక్వెస్ చిరాక్ (1976) తర్వాత భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు.

మరోవైపు ఫ్రాన్స్ బాస్టిల్ డేకు గౌరవ అతిథిగా హాజరైన రెండో భారత ప్రధాని నరేంద్ర మోదీ. 2009లో బాస్టిల్ డే పరేడ్‌కు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. గత సంవత్సరం జూలై 2023లో జరిగిన ఈ వేడుకలో ప్రధాని మోదీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

రక్షణ, వ్యూహాత్మక రంగాలలో భారత్, ఫ్రాన్స్ మధ్య పరస్పర సహకారానికి సంబంధించి ప్రధాన ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. భారత రిపబ్లిక్ డే పరేడ్‌కు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ముఖ్య అతిథిగా హాజరు కావచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తమ దేశంలో ఇతర కార్యక్రమాల కారణంగా భారత రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా రావాలన్న ఆహ్వానాన్ని బిడెన్ సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆయన స్థానంలో భారత ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత్‌కు వస్తున్నారు. చివరి నిమిషంలో మాక్రాన్ భారతదేశ ఆహ్వానాన్ని అంగీకరించడంపై ఫ్రాన్స్‌లోని భారత మాజీ రాయబారి మోహన్ కుమార్ స్పందిస్తూ.. భారతదేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల ఫ్రాన్స్ దేశానికున్న షరతులు లేని నిబద్ధతకు ఇది తార్కాణమన్నారు.