రాష్ట్రపతి, ప్రధానిని వదలని ఏఐ కేటుగాళ్లు.. నిందితుడి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?
ముజఫర్‌పూర్ పోలీసులు ఏఐ ఆధారిత ఫేక్ న్యూస్ కేసును ఛేదించారు. రాష్ట్రపతి, ప్రధాని వీడియోలను మార్ఫ్ చేసి సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయాలని చూసిన నిందితుడిని అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలతో ప్రత్యేక బృందం పట్టుకుంది. ఏఐ దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.

సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న ముఠా గుట్టును బీహార్ ముజఫర్‌పూర్ పోలీసులు రట్టు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్ నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోలు, ఆడియోలను ఏఐ సాయంతో మార్ఫ్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నకిలీ డిజిటల్ కంటెంట్ వెనుక దేశ అత్యున్నత రాజ్యాంగ కార్యాలయాల గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర దాగి ఉంది. ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల్లో అపనమ్మకాన్ని సృష్టించడంతో పాటు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసి శాంతిభద్రతల సమస్యను సృష్టించడమే లక్ష్యంగా ఈ వీడియోలను వైరల్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ప్రత్యేక బృందం వేట
ఈ ఘటన సీరియస్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకున్న సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.. వెంటనే డీఎస్పీ నాయకత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన ఆ టీమ్.. నిందితుడి ఆచూకీని గుర్తించి మెరుపు దాడి చేసింది. ముజఫర్‌పూర్ జిల్లా బోచహాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవాన్‌పూర్ నివాసి అయిన ప్రమోద్ కుమార్ రాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను రికవరీ చేశారు. దీనిపై సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏఐ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించి దేశ వ్యతిరేక భావాలను వ్యాప్తి చేసినా, పుకార్లు సృష్టించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని, అభ్యంతరకర పోస్టులను షేర్ చేయవద్దని ప్రజలను కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
