Heavy Rains: ఉత్తరాదిన భారీ వర్షాలకు కారణం అదేనా? వాతావరణ అధికారులు చెప్తున్న షాకింగ్ రీజన్స్..!
ఉత్తర భారతదేశంలో కురుస్తున్న వర్షాలకు రుతుపవనాలే కారణమా? అవే కారణమైతే ప్రతియేటా ఎందుకు ఈ మాదిరిగా కురవడం లేదు? కాదంటే ఈ నెలలో ఇంత భారీ వర్షపాతానికి కారణమేంటి? ప్రస్తుతం దేశప్రజల మదిలో మెదులుతున్న సందేహాలివి. వర్షాలు, వరదల ప్రభావం భౌగోళికంగా ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైనా దక్షిణాది రాష్ట్రాలపైనా..

-
రుతుపవనాలకు తోడైన పశ్చిమ దిశ గాలులు
-
రెట్టింపు వర్షాలతో నీటమునిగిన ఉత్తరాది రాష్ట్రాలు
ఉత్తర భారతదేశంలో కురుస్తున్న వర్షాలకు రుతుపవనాలే కారణమా? అవే కారణమైతే ప్రతియేటా ఎందుకు ఈ మాదిరిగా కురవడం లేదు? కాదంటే ఈ నెలలో ఇంత భారీ వర్షపాతానికి కారణమేంటి? ప్రస్తుతం దేశప్రజల మదిలో మెదులుతున్న సందేహాలివి. వర్షాలు, వరదల ప్రభావం భౌగోళికంగా ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైనా దక్షిణాది రాష్ట్రాలపైనా మానసిక ప్రభావం ఉంది. అమర్‌నాథ్ యాత్ర, చార్‌ధామ్ యాత్ర, విహార యాత్రల పేరుతో జమ్ము-కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తీర్థయాత్రలు, భక్తియాత్రలు చేసేవారిలో అత్యధికులు దక్షిణాదివారు, వారిలో తెలుగువారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు కాబట్టి ఈ వరదల ప్రభావం దక్షిణాది వరకు ఉందని చెప్పొచ్చు. వర్షబీభత్సం కారణంగా చోటుచేసుకున్న వైపరీత్యాల్లో చిక్కుకుపోతున్నవారిలోనూ తెలుగువారు గణనీయమైన సంఖ్యలో ఉంటున్నారు. తాజా వర్షాలు సైతం వైపరీత్యంగా మారాయి. హిమాలయాల్లో జన్మించే అనేక నదులు, ఉపనదులు, వాగులు, ప్రవాహాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాలయ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగపడి అనేక రహదారులు మూతపడ్డాయి. మైదాన ప్రాంతాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. 2103లో ఉత్తరాఖండ్‌లో సంభవించిన తరహా బీభత్సాన్ని ఇప్పుడు యావత్ ఉత్తర భారతదేశం చవిచూస్తోంది. మరి ఈ వైపరీత్యానికి కారణమేంటి అనే అంశంపై భారత వాతావరణ విభాగం దృష్టిసారించింది. వాతావరణ పరిస్థితులను విశ్లేషించే పనిలో పడింది. రుతుపవనాల సమయంలో సీజన్ మొత్తంలో ఇప్పటి కురవాల్సిన వర్షపాతం సగటు 239.1 మిల్లీమీటర్లు. కానీ జూన్‌లో పెద్దగా వర్షాలే కురవలేదు. అయితే ఈ సీజన్లో ఇప్పటి వరకు కురవాల్సిన మొత్తం వర్షపాతం కొద్ది రోజుల వ్యవధిలోనే కురిసింది. ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం సగటు 243.2కు చేరుకుందని వాతావరణ శాఖ లెక్కించింది. అంటే సీజన్ సగటును మించిన వర్షపాతం కొద్ది రోజుల్లోనే కురిసిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
రుతుపవనాలకు తోడైన పశ్చిమ గాలులు..
దేశ రాజధాని న్యూఢిల్లీ వీధులను జలమయం చేయడం నుంచి మొదలుపెట్టి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము-కాశ్మీర్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కనిపిస్తున్న దృశ్యాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో అనేక కొండచరియలు విరిగిపడ్డాయి. రహదారులు మూతబడ్డాయి. మెరుపు వరదలు ముంచెత్తి అనేక భవనాలు, వాహనాలు జలసమాధి అయ్యాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సాధారణ రుతుపవనాలతో ఇంతటి జల ప్రళయం సంభవించే అవకాశం లేదు. కానీ ఈ ఏడాది పశ్చిమ దిశ నుంచి వీచే గాలులు ఉత్తర భారతదేశంలో వాతావరణంలో అనేక మార్పులు తీసుకొచ్చాయి. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ గా వాతావరణ నిపుణులు వ్యవహరించే ఈ ప్రత్యేక పరిస్థితి రుతుపవనాలకు తోడవడం వల్ల వర్షపాతం అధికంగా నమోదైందని వాతావరణ విభాగం భావిస్తోంది.
అసలు ఈ పశ్చిమ దిశ గాలులు అంటే ఏంటి?
పశ్చిమ దిశ గాలులు భూ మధ్య రేఖకు ఎగువన ఉన్న ఉత్తరార్థ గోళంలోనే ఎక్కువగా సంభవిస్తాయి. మధ్యధరా ప్రాంతం నుంచి ఈ గాలులు మొదలవుతాయి. భారతదేశానికి పశ్చిమ దిశలో ఉన్న ప్రాంతం నుంచి వచ్చే గాలులు కాబట్టి వాటిని పశ్చిమ దిశ గాలులుగా భారత వాతావరణ నిపుణులు వ్యవహరిస్తుంటారు. సాధారణంగా ఇవి డిసెంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో భారతదేశంపై ప్రభావం చూపుతుంటాయి. ఫలితంగా ఉత్తర భారతదేశంలో ఆ సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్య కాలంలో 20 సందర్భాల్లో పశ్చిమ గాలులు భారతదేశాన్ని తాకాయి. ఆ కారణంగానే ఈ ఏడాది వేసవి తీవ్రత ఉత్తరాదిపై తక్కువగా ఉంది. ఉత్తరాదిన సగటు కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలతో సరిపెట్టకుండా రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత కూడా పశ్చిమ దిశ గాలులు భారత్ వైపు వచ్చాయని వాతావరణ శాఖ చెబుతోంది. అరుదుగా మాత్రమే ఈ సీజన్లో పశ్చిమ దిశ గాలులు సంభవిస్తాయని, ఈ ఏడాది రుతుపవనాలు చురుగ్గా ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరించే సమయంలో పశ్చిమ దిశ గాలులు వాటికి తోడయ్యే సరికి వర్షపాతం అనూహ్యంగా పెరిగిపోయిందని విశ్లేషిస్తున్నారు. అందుకే దేశ రాజధాని ఢిల్లీలో నాలుగు దశాబ్దాల రికార్డులను తిరగరాస్తూ భారీ వర్షాలు కురిశాయని లెక్కలు చూపెడుతున్నారు. 2013లో ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్ మార్గంలో సంభవించిన జలప్రళయానికి కూడా ఈ పశ్చిమ గాలులే కారణమని వాతావరణ శాఖ చెబుతోంది.




రుతుపవనాలు ఉత్తర భారతదేశంలో విస్తరించే సమయంలో వాటికి వ్యతిరేక దిశలో చల్లటి, తడితో కూడిన పశ్చిమగాలులు ఎదురుపడితే ఊహించని రీతిలో వర్షపాతం నమోదవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే సాధారణంగా రుతుపవనాలు మోసుకొచ్చే వర్షాలకు ఈ పశ్చిమ గాలులు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. దేశానికి తూర్పున ఉన్న బంగాళాఖాతం మీదుగా వచ్చే తేమకు పశ్చిమ దిశన ఉన్న అరేబియా సముద్రం మీద నుంచి వచ్చే తేమ తోడై డబుల్ ధమాకా పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ తరహా పరిస్థితి శనివారం జమ్మూ & కాశ్మీర్ మీదుగా ఉండగా.. ఆదివారం హిమాచల్ ప్రదేశ్ చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఇదే ఇంతటి భారీ విపత్తుకు, జల ప్రళయానికి కారణమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
