Rajiv Gandhi: రాజీవ్‌ గాంధీ హత్య కేసు నిందితుడిని విడుదల చేయండి.. సుప్రీం కోర్టు ఆదేశాలు..

రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) హత్య కేసులో నిందితుడు పెరరివాలన్‌(perarivalan)ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు(Supreme Court) అదేశాలు జారీ చేసింది...

Rajiv Gandhi: రాజీవ్‌ గాంధీ హత్య కేసు నిందితుడిని విడుదల చేయండి.. సుప్రీం కోర్టు ఆదేశాలు..
Supreme Court
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 18, 2022 | 11:22 AM

రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) హత్య కేసులో నిందితుడు పెరరివాలన్‌(perarivalan)ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు(Supreme Court) అదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎల్.నాగేశ్వర్ రావు నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. శిక్షా కాలంలో సత్ప్రవర్తన, మానవత్వంతో వ్యవహరించిన కారణంగా పెరారివాలన్‌కు న్యాయస్థానం గతంలో బెయిల్ మంజూరు చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరారివాలన్ 31 ఏళ్ల నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. పెరారివాలన్ 1991లో అరెస్టయ్యాడు. జూన్ 11, 1991న చెన్నైలోని పెరియార్ తిడల్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు పెరారివాలన్‌ను అరెస్టు చేసినప్పుడు అతనికి 19 ఏళ్ల వయస్సు. అతను అరెస్టయ్యే సమయానికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర పన్నిన శివరాసన్‌కు పేలుడు పరికరంగా 9 వోల్ట్ బ్యాటరీని అందించినట్లు పెరారివాలన్‌పై ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఈ కేసుకు సంబంధించి 1998లో పేరారివాలన్‌కు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. మరుసటి సంవత్సరం, సుప్రీంకోర్టు ఆ శిక్షతో ఏకీభవించింది కానీ 2014లో దానిని జీవిత ఖైదుగా మార్చింది. ఈ ఏడాది మార్చిలో ఉన్నత న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే కొంతకాలం తర్వాత పెరారివాలన్ జైలు నుంచి త్వరగా విడుదల చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. పెరారివాలన్ అభ్యర్థనను కేంద్రం వ్యతిరేకించింది. కానీ తమిళనాడు గవర్నర్ ఈ విషయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు సూచించినప్పటికీ ఇంతవరకు దీనిపై ఎలాంటి కదలిక లేదు.

ఈ వ్యవహారంలో జాప్యాన్ని, గవర్నర్ చర్యను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగంలోని సెక్షన్ 161 ప్రకారం క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న క్యాబినెట్ నిర్ణయానికి తమిళనాడు గవర్నర్ కట్టుబడి ఉన్నారని, అందువల్ల రాష్ట్రపతి ప్రతిస్పందన కోసం వేచి ఉండబోమని కోర్టు పేర్కొంది. కాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ కేసులో ఏడుగురికి శిక్ష పడింది. అందరికీ మరణశిక్ష విధించబడినప్పటికీ, 2014లో వారి క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రపతి తీవ్ర జాప్యం చేశారని పేర్కొంటూ సుప్రీంకోర్టు వారిని జీవిత ఖైదీలుగా మార్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్న వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి…