Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాల బీభత్సం.. ఒక్క నవంబర్‌లోనే 143.4 శాతం వానలు..
Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. పెనిన్సులర్ ఇండియాలో నవంబర్1 నుంచి నవంబర్ 25 మధ్య 143.4% అధిక వర్షపాతం నమోదైంది.
Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. భారీ వరదల వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. అక్టోబర్ 1 నవంబర్ 25 మధ్య 63 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. అక్టోబర్ 1 నుంచి ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో తమిళనాడులో 61 శాతం, పుదుచ్చేరిలో 83, కర్ణాటకలో 105, కేరళలో 110 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నెలలో కురిసిన వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని చెన్నై, రాయలసీమ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి.
తుఫాను ప్రభావంతో ఆగ్నేయ తమిళనాడులో గురు, శుక్రవారాల్లో మళ్లీ భారీ వర్షాలు కురిశాయి. కాయలపట్టణంలో 31, టుటికోరిన్‌లో 27, తిరుచెందూరులో 25, శ్రీవైకుంటంలో 18, కులశేఖరపట్నంలో 16, వప్పర్‌లో 15, నాగపట్నంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆగ్నేయ తమిళనాడులో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో వరద బీభత్సం కనిపించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వర్షాలు పడడానికి ఇదే కారణం. ఈ నెలలో దాదాపు ప్రతి వారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 29న అండమాన్ సముద్రం మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
నవంబర్ 7 నుంచి 13 మధ్య చెన్నైలో భారీ వర్షాలు కురిసాయి. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యాయి. అదనపు నీటిని విడుదల చేసేందుకు అధికారులు పూండి, చెంబరంబాక్కం రిజర్వాయర్ల గేట్లను తెరిచారు. నవంబర్ 7న చెన్నైలోని నుంగంబాక్కంలో 21.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, డిసెంబర్ 2015లో ఇదే తరహాలో కురిసిన వర్షాలకు వరదలు సంభవించాయి. మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా, నవంబర్ 6 రాత్రి కోస్తాలో భారీ వర్షం ప్రారంభమైంది.