Rahul Gandhi: భారత్ జోడో యాత్ర.. దక్షిణాదిన ఒకలా.. ఉత్తరాదిన మరోలా..
ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అయితే ఓటమికి గల కారణాలను తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటే తదుపరి ఎన్నికల్లో గెలుపొందేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకే రాజకీయ పార్టీలు, విశ్లేషకులు గెలుపు, ఓటములకు దోహదం చేసిన కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈమధ్యనే జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హిందీ మాట్లాడే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన విషయం తెలిసిందే.

ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అయితే ఓటమికి గల కారణాలను తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటే తదుపరి ఎన్నికల్లో గెలుపొందేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకే రాజకీయ పార్టీలు, విశ్లేషకులు గెలుపు, ఓటములకు దోహదం చేసిన కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈమధ్యనే జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హిందీ మాట్లాడే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన విషయం తెలిసిందే. అంతకంటే ముందు ఇదే ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ‘భారత్ జోడో’ పేరుతో రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర తమ విజయానికి దోహదం చేసిందని పార్టీ నేతలు చెప్పారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన ఈ పాదయాత్రలో కర్ణాటకలో ఆయన నడిచిన మార్గం అంతటా కాంగ్రెస్ గెలుపొందడమే వారి విశ్లేషణకు కారణం. కానీ అక్కడ పనిచేసిన ఈ యాత్ర ప్రభావం హిందీ హార్ట్‌ల్యాండ్‌గా పేరున్న ఉత్తరభారత రాష్ట్రాల్లో పనిచేయలేదని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.
అక్కడ సానుకూలం
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ కాలినడకన చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర కర్ణాటకలో 21 రోజుల పాటు సాగింది. 7 జిల్లాల్లో 51 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర జరగ్గా.. వాటిలో 37 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో భారత్ జోడో యాత్ర కారణంగానే ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారని, అందుకే ఈసారి రాహుల్ గాంధీ తమ రాష్ట్రం నుంచే లోక్‌సభకు పోటీ చేయాలని ఆ రాష్ట్ర నేతలు పార్టీ హైకమాండ్‌కు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే అప్పటి వరకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడ్డ వ్యతిరేకత కూడా కాంగ్రెస్ విజయానికి దోహదం చేసిందనే విశ్లేషణలు మరోవైపు ఉన్నాయి. ఏదెలా ఉన్నా జోడో యాత్ర ప్రభావం సానుకూలంగా ఎంతో కొంత ఉండకపోదు. ఈ మధ్యనే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఈ యాత్ర దోహదం చేసిందని అక్కడి నేతలు చెబుతున్నారు.
మధ్యప్రదేశ్‌లో పనిచేయని మంత్రం
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మార్గంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఇంకా చెప్పాలంటే మధ్యప్రదేశ్‌లో ఘోర పరాజయం పాలైంది. అక్కడ బీజేపీ ఏకంగా 163 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ కేవలం 66 సీట్లకే పరిమితమైంది. ఆ రాష్ట్రంలో అప్పటి వరకు అధికారంలో ఉన్నది బీజేపీ. అధికారంలో ఉన్న పార్టీపై సహజంగానే ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. కాంగ్రెస్ అలాంటి వ్యతిరేకతను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఇంకా లోతుగా విశ్లేషిస్తే.. భారత్ జోడో యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్‌లో రాహుల్ గాంధీ పర్యటించిన 21 నియోజకవర్గాల్లో 17 చోట్ల బీజేపీ గెలుపొందింది. మాల్వా-నిమార్ ప్రాంతంపై కూడా రాహుల్ యాత్ర ప్రభావం ఏమాత్రం లేదని స్పష్టమైంది. ఈ ప్రాంతంలోని మొత్తం 30 సీట్లలో కాంగ్రెస్ కేవలం 5 మాత్రమే గెలుపొందింది.
రాజస్థాన్‌లో బీజేపీకి లాభించిన రాహుల్ యాత్ర
రాజస్థాన్‌లో గత ఐదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. మరో 7 గ్యారంటీలను ప్రకటించింది. ఆకట్టుకునే మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ రాష్ట్రంలోనూ రాహుల్ పాదయాత్ర జరిగింది. గత ఏడాది డిసెంబర్ 5 నుంచి 20 తేదీల జరిగిన జోడో యాత్రకు జనం కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఇక్కడ ఐదేళ్లకు ఓసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ మార్చి వరుసగా రెండోసారి గెలుపొందుతాం అని ఆ పార్టీ భావించింది. కానీ ఇక్కడ కూడా ఫలితాలు ఆ పార్టీని నిరాశపరిచాయి. రాహుల్ యాత్ర 7 జిల్లాల్లోని 19 నియోజకవర్గాల మీదుగా సాగింది. వీటిలో కాంగ్రెస్ కేవలం 8 మాత్రమే గెలుచుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ యాత్రా లేని సమయంలోనే 13 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, కనీసం పాత సీట్లను నిలబెట్టుకోలేకపోయింది. ఇక్కడ బీజేపీ గెలుచుకున్న 11 సీట్లలో 5 పాతవి కాగా, మరో 6 కాంగ్రెస్ చేతి నుంచి లాక్కుందని స్పష్టమైంది. అంటే ఇక్కడ యాత్ర బీజేపీకే లాభం చేసిందని స్పష్టమవుతోంది. యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించిన ఝల్రాపటాన్, యాత్ర ముగిసిన అల్వార్ స్థానాల్లోనూ పార్టీ ఓటమిపాలైంది.
‘భారత్ జోడో’ యాత్రకు ముందు రాహుల్ గాంధీపై ఉన్న నాన్-సీనియర్ రాజకీయ నాయకుడి ముద్ర, యాత్ర తర్వాత తొలగిపోయింది. ఈ యాత్ర రాహుల్ వ్యక్తిగత ఇమేజి పెంచుకోవడం వరకు మాత్రమే ఉపయోగపడింది తప్ప రాజకీయంగా సానుకూల ఫలితాలను అందించలేకపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.