AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagwant Mann: పంజాబ్‌ సీఎం మద్యపాన వివాదం! మూడేళ్ల క్రితం మద్యం మానేస్తున్నట్లు బహిరంగ సభలో ప్రకటన..

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఫూటుగా మద్యం సేవించి విమానం ఎక్కడంతో, ఆయనను జర్మనీ ఎయిర్‌పోర్టులో విమానంలోనుంచి దించేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనితో పలు వార్తాకథనాలు కూడా వెలువడ్డాయి. ఐతే తన తల్లి కోరిక మేరకు..

Bhagwant Mann: పంజాబ్‌ సీఎం మద్యపాన వివాదం! మూడేళ్ల క్రితం మద్యం మానేస్తున్నట్లు బహిరంగ సభలో ప్రకటన..
Cm Bhagwant Mann
Srilakshmi C
|

Updated on: Sep 22, 2022 | 12:58 PM

Share

Punjab CM Bhagwant Mann Alcohol controversy: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఫూటుగా మద్యం సేవించి విమానం ఎక్కడంతో, ఆయనను జర్మనీ ఎయిర్‌పోర్టులో విమానంలోనుంచి దించేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలు వార్తాకథనాలు కూడా వెలువడ్డాయి. ఐతే తన తల్లి కోరిక మేరకు తాను మద్యపానం మానేస్తున్నట్లు సీఎం భగవంత్‌ మాన్‌ ఓ బహిరంగ సభలో ప్రకటించిన మూడేళ్ల తర్వాత తాజా వివాదంలో చిక్కుకోవడం గమనార్హం. 2019 జనవరిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రచారంలో భాగంగా పంజాబ్‌లోని బర్నాలాలో ఏర్పాటు చేసిన భారీ సభకు భగవంత్‌ మాన్‌, ఆయన తల్లి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సభలో మాన్‌ మాట్లాడుతూ..

‘ఎప్పుడో ఒకసారి మాత్రమే మద్యం సేవిస్తాను. ప్రతిపక్షాలు మాత్రం భగవంత్‌ మాన్‌ రేయింబవళ్లు మద్యం సేవిస్తాడని, ఎల్లప్పుడు మత్తులోనే తూలుతాడని నాపై దుష్‌ప్రచారం చేస్తున్నాయి. నన్ను కించపరిచేలా మాట్లాడుతున్న వీడియోలు చూస్తే బాధగా ఉంది. అతిగా మద్యం తాగుతాడని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు చూసిన నా తల్లి మద్యపానం మానేయాలని కోరింది. అందుకే ఇకపై ఎవరూ వేలెత్తి చూపకుండా మద్యం సేవించడం మానేస్తున్నట్లు’ వ్యాఖ్యానించారు. ఇదే సభలో ఉన్న రవింద్‌ కేజ్రీవాల్‌ మాన్‌ నిర్ణయాన్ని గొప్ప త్యాగంగా అభినందించారు. భగవంత్‌ మాన్‌ నా హృదయాన్ని గెలుచుకున్నారు. నా ఒక్కడిదే కాదు పంజాబ్‌ ప్రజల మనసుల్ని గెలిచారు. ప్రజలకోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమయ్యేవాడే నిజమైన నాయకుడు. ఇది చిన్న విషయం కాదు. ఇది చాలా పెద్ద కమిట్‌మెంట్‌. మాన్‌ జనవరి 1 నుంచి మద్యపానం మానేయాలనే నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయం’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

బహిరంగంగా ప్రమాణం చేసిన మాన్‌ జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ ఎయిర్‌పోర్టులో విమానం నుంచి దించేసినట్లు వార్తలు గుప్పుమనడంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. మాన్‌ ప్రవర్తన సిగ్గుచేటుగా పేర్కొంటూ శిరోమణి అకాలీదళ్‌ నేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ట్విటర్‌లో ఓ పోస్టు షేర్‌ చేశారు. మాన్‌ తప్పతాగి నడవలేని స్థితిలో ఉండటంతో ఆయనను లుఫ్తాన్సా ఫ్రాంక్‌ఫర్ట్-ఢిల్లీ విమానం విమానం నుంచి దించేశారని, అందుకే విమానం 4 గంటలు ఆలస్యమైనట్లు ఆరోపించారు. ఐతే ఈ ఆరోపణలను ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆయన షెడ్యూల్‌ కారణంగా జర్మనీ నుంచి ఢిల్లీకి రావడం ఆలస్యమైందని తెలిపింది. ప్రతిపక్షాలు కావాలనే ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టింది.

ఈ వ్యవహారంపై పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. దీనిపై వాస్తవాలను నిర్ధారించుకోవాడానికి విమానయాన సంస్థ ‘లుఫ్తాన్సా’ ఇచ్చే వివరాలపై ఆధారపడి ఉంటుందని, తనకు వచ్చిన అభ్యర్థనల ప్రకారం దీన్ని పరిశీలిస్తానని పేర్కొన్నారు. ఐతే విమానం ఆల్యంగా బయల్దేరడంపై లుఫ్తాన్స ప్రకటన వేరేలా ఉంది. ఇన్‌బౌండ్ ఫ్లైట్ ఆలస్యం, ఎయిర్‌క్రాఫ్ట్ మార్పుల వల్ల విమానం ఆలస్యంగా బయలుదేరిందని, సీఎం భగవంత్ మాన్ వివరాలు వెల్లడించడానికి విమానయాన సంస్థ నిరాకరించింది. డేటా సంరక్షణ కారణాల దృష్ట్యా ప్రయాణీకులకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని అందించలేమని లుఫ్తాన్స తన ప్రకటనలో పేర్కొంది.

భగవంత్ మాన్‌పై ‘మద్యం’ ఫిర్యాదులు

  • 2015లో పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లోని బార్‌గారి గ్రామంలోని గురుద్వారా నుంచి మద్యం సేవించిన కారణంగా భగవంత్ మాన్‌ను వెళ్లగొట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.
  • 2016లో సస్పెండ్ అయిన ఆప్ ఎంపీ హరీందర్ సింగ్ ఖల్సా భగవంత్ మాన్‌పై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఫిర్యాదు చేశారు. తన పక్కన కూర్చున్న భగవంత్ మాన్ వద్ద మద్యం దుర్వాసన వెదజల్లుతున్నందున పార్లమెంట్‌లో తన సీటు మార్చాలని ఖాల్సా స్పీకర్‌ను కోరారు.
  • 2019కి ముందు భగవంత్ మాన్‌ అధిరంగా మద్యం సేవిస్తారని ప్రతిపక్ష పార్టీలు తరచుగా విమర్శించేవి.