Caste Politics: దేశంలో కులగణన జపం చేస్తున్న రాజకీయ పార్టీలు ఇవే..
కుల గణ మన.. ఇదే ఇప్పుడు రాజకీయ పార్టీల పాలిట జాతీయ గీతంగా మారింది. కులాల ప్రాతిపదికన జనాభా లెక్క తియ్యాలనే ప్రతిపాదన కొన్ని పార్టీల్లో జోష్ నింపితే.. మరికొన్ని పార్టీల్లో పరేషాన్ పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీసీ జనాభా లెక్క తేలుస్తామని ప్రామిస్ చేస్తుంటే.. బీజేపీ మాత్రం చూద్దాం చేద్దాం అంటూ డైలమాలోనే ఉంది. అంతలోనే క్యాస్ట్ సెన్సస్ రిపోర్ట్‌ని పట్టుకుని బీహార్ రాష్ట్రం పదండి ముందుకు అంటోంది. మొత్తంగా 2024 లోక్‌సభ ఎన్నికలకు కుల గణన అనేది కీలక అంశంగా

కుల గణ మన.. ఇదే ఇప్పుడు రాజకీయ పార్టీల పాలిట జాతీయ గీతంగా మారింది. కులాల ప్రాతిపదికన జనాభా లెక్క తియ్యాలనే ప్రతిపాదన కొన్ని పార్టీల్లో జోష్ నింపితే.. మరికొన్ని పార్టీల్లో పరేషాన్ పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీసీ జనాభా లెక్క తేలుస్తామని ప్రామిస్ చేస్తుంటే.. బీజేపీ మాత్రం చూద్దాం చేద్దాం అంటూ డైలమాలోనే ఉంది. అంతలోనే క్యాస్ట్ సెన్సస్ రిపోర్ట్‌ని పట్టుకుని బీహార్ రాష్ట్రం పదండి ముందుకు అంటోంది. మొత్తంగా 2024 లోక్‌సభ ఎన్నికలకు కుల గణన అనేది కీలక అంశంగా మారబోతోంది. బీహార్ దారి చూపింది.. ఆ దారిలోనే దేశమంతా నడవబోతోందా.? కుల ప్రాతిపదికన జనాభా లెక్కల విషయంలో ఏ రాజకీయ పార్టీ వైఖరి ఎలా ఉంది.. దేశవ్యాప్త కుల గణన సాధ్యాసాధ్యాలేంటి..? ఇదే ఇప్పుడు నేషనల్ పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ ఇష్యూ.
ఏ కులంలో ఎంతమంది.. వాళ్లలో ఎంతమంది పేదలు.. ఎంతమంది నిరక్ష్యరాస్యులు.. ఎంతమందికి దక్కాల్సింది దక్కడం లేదు.. అనే లెక్క తీసి.. పక్కా రిపోర్ట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది బీహార్ ప్రభుత్వం. ఇదే దామాషా ప్రకారం.. కులాల వారీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాలన్న తీర్మానాన్ని ఆమోదించింది నితీశ్‌కుమార్ సర్కార్. మరి.. మిగతా రాష్ట్రాల రూటెటు? బీహార్‌లో జరిగిన కులగణన ముఖ్యంగా బీజేపీకి సవాల్‌గా మారింది. 2024 ఎన్నికల్ని గట్టెక్కడానికి ఇదొక పెద్ద అడ్డంకిగా భావిస్తోంది కమలం పార్టీ. బీజేపీ హిందూ కార్డుకు పోటీగా కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి పార్టీలన్నీ కుల గణనను ఒక అస్త్రంగా ప్రయోగిస్తున్నాయి. మేం అధికారంలోకొస్తే దేశవ్యాప్తంగా కులజనగణన జరుపుతామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దండోరా వేస్తోంది. అంతరాలు తగ్గిస్తాం.. బీసీలకు న్యాయం చేస్తాం.. అని ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు రాహుల్ గాంధీ.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యగానే కుల గణన చేస్తామన్న కాంగ్రెస్ ప్రామిస్‌కి తమిళనాడులో డీఎంకె కూడా కోరస్ ఇస్తోంది. కానీ.. బీజేపీకి మాత్రం ఇది పంటి కింద రాయిగా మారింది. కులాల లెక్కలు తీయడానికి స్వతహాగానే ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకం. దేశంలో ఎస్‌సీ, ఎస్‌టీలు తప్ప మరో కులం ఉన్నా లేనట్టే అని రెండేళ్ల కిందట కేంద్ర హోంశాఖ స్వయంగా చెప్పేసింది. గతంలో మండల్ కమిషన్ నివేదిక అమలు చేశాక.. పెద్దఎత్తున రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ఈసారి ఎటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందో అనేది బీజేపీ భయం. కులాల వారీగా జనాభా లెక్కలు తేలితే.. దానికి అనుగుణంగా రిజర్వేషన్ లెక్కలు కూడా మారిపోతాయన్న గుబులు అగ్రకులస్థుల్ని వేధిస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న గీతను కేంద్ర ప్రభుత్వమే దాటేసింది. బీహార్ బాటలో మిగతా రాష్ట్రాలు కూడా నడిస్తే.. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల సమస్య పేట్రేగే ప్రమాదం ఉందని సంకోచిస్తోంది కమలం పార్టీ.
బీహార్‌లో కులగణనకు అక్కడి రాష్ట్ర బీజేపీ ఓకే చెప్పినా.. దేశవ్యాప్తంగా మాత్రం అవసరం లేదంటోంది. ఇప్పటికే మోదీ క్యాబినెట్‌లో ఎక్కువ మంది బీసీలున్నారని, తెలంగాణలో బీసీ వ్యక్తికే సీఎం కుర్చీ ఇవ్వబోతున్నామని బీజేపీ చెబుతోంది. కులం పేరుతో రాజకీయాలు చేస్తోందని, జాతీయ సమైక్యతను దెబ్బతీస్తోందని దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పార్టీపై విరుచుకుపడుతున్నారు ప్రధాని మోదీ. అటు.. బీసీ కులాల మధ్య అంతరాల్ని ఉపయోగించుకుంటూ.. యాదవుల్ని, యాదవేతర కులాల మీదకు ఉసిగొల్పే ప్రయత్నం చేస్తూ.. అట్నుంచి నరుక్కొస్తోంది బీజేపీ. మరి.. దేశవ్యాప్తంగా కులగణనపై బీజేపీ అంతరంగం ఏంటి.. బీసీల పట్ల తమకున్న చిత్తశుద్ధిని ఎలా ఎక్స్‌పోజ్ చేసుకుంటుంది అనేది సస్పెన్స్‌గా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








