Operation Theatre: షాకింగ్ ఘటన.. ‘టీ’ ఇవ్వలేదనే కోపంతో ఆపరేషన్ మధ్యలోనే వెళ్లిపోయిన డాక్టర్
వైద్య వృత్తి పవిత్రమైనది. దేవుడు జన్మ ఇస్తే వైద్యుడు పునర్జన్మ ఇస్తాడని అంటారు. అందుకే వైద్యులను దేవుడితో పోలుస్తుంటారు. అయితే నేటి కాలంలో వైద్య వృత్తి కూడా వ్యాపారమయం అయ్యింది. డబ్బులుంటేనే సరైన వైద్యం అందుతుందనే దుస్థితికి చేరిపోయింది. డబ్బుతో కాకుండా మానవతా హృదయంతో తమ వద్దకు వచ్చిన వారి ప్రాణాలను రక్షించే వైద్యులు కూడా లేకపోలేదు. అలాంటి వాళ్లు నూటికో, కోటికో ఒక్కరు అన్నట్లు తయారైంది నేటి పరిస్థితి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుప్రతులనే..
నాగ్‌పూర్, నవంబర్ 8: వైద్య వృత్తి పవిత్రమైనది. దేవుడు జన్మ ఇస్తే వైద్యుడు పునర్జన్మ ఇస్తాడని అంటారు. అందుకే వైద్యులను దేవుడితో పోలుస్తుంటారు. అయితే నేటి కాలంలో వైద్య వృత్తి కూడా వ్యాపారమయం అయ్యింది. డబ్బులుంటేనే సరైన వైద్యం అందుతుందనే దుస్థితికి చేరిపోయింది. డబ్బుతో కాకుండా మానవతా హృదయంతో తమ వద్దకు వచ్చిన వారి ప్రాణాలను రక్షించే వైద్యులు కూడా లేకపోలేదు. అలాంటి వాళ్లు నూటికో, కోటికో ఒక్కరు అన్నట్లు తయారైంది నేటి పరిస్థితి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుప్రతులనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ఇదే దుస్థితి. తాజాగా అలాంటి ఓ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. డ్యూటీ చేస్తుండగా తనకు టీ ఇవ్వలేదన్న కోపంతో ఆపరేషన్ మధ్యలో ఆపేసి వెళ్లిపోయాడో వైద్యుడు. వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా ఉన్న ఈ సంఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని మౌడ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో నవంబర్ 3న 8 మంది మహిళలు స్టెరిలైజేషన్ సర్జరీ (వేసెక్టమీ) కోసం వచ్చారు. డాక్టర్ తేజ్‌రంగ్ భాలవి నలుగురు మహిళలకు శస్త్రచికిత్స నిర్వహించాడు. ఆ తర్వాత మిగిలిన వారికి కూడా సర్జరీ చేసేందుకు ముందుగా అనస్తీషియా ఇచ్చాడు. ఇంతలో ఆసుపత్రి సిబ్బందిని ఒక కప్పు టీ తీసుకురమ్మని డాక్టర్ తేజ్‌రంగ్ భాలవి అడిగాడు. కానీ వారు టీ సకాలంలో తీసుకురాకపోవడంతో ఆగ్రహించిన డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి కోపంగా బయటికి వెళ్లిపోయాడు. సంఘటన జరిగిన సమయంలో నలుగురు మహిళలకు అనెస్థీషియా ఇవ్వడంతో వారు మత్తులోనే ఉన్నారు. దీంతో వారికి ఆపరేషన్ నిర్వహించకుండానే డాక్టర్ వెళ్లిపోయాడు.
ఈ విషయంపై వెంటనే మహిళల కుటుంబ సభ్యులు జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నపళంగా మరో వైద్యుడిని నియమించి మహిళలకు సర్జరీలు చేసేందుకు పంపించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ భలవి నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జిల్లా యంత్రాంగం సీరియస్ అయ్యింది. ముగ్గురు సభ్యులతో కూడిని కమిటీని విచారణకు ఏర్పాటు చేసినట్లు నాగ్‌పూర్ జిల్లా పరిషత్ సీఈవో సౌమ్యశర్మ తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, కమిటీ నివేదిక ఆధారంగా అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.