మహిళలపై బీహార్ సీఎం నితీశ్ వ్యాఖ్యలపై దుమారం.. ఆ కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన..

తన వ్యాఖ్యలు సృష్టించిన కలకలం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అర్థమైంది. నిరసన సెగ నితీశ్‌కు చురక అంటించింది. అంతే.. తప్పును గ్రహించిన నితీశ్, క్షమాపణ కోరుతూ తనను తానే నిందించుకున్నారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. తాను కేవలం మహిళా విద్య గురించి మాత్రమే మాట్లాడానని, తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.

మహిళలపై బీహార్ సీఎం నితీశ్ వ్యాఖ్యలపై దుమారం.. ఆ కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన..
Nitish Kumar
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 08, 2023 | 3:16 PM

బీహార్ అసెంబ్లీలో జనాభా నియంత్రణ గురించి మాట్లాడుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా మహిళా ప్రజా ప్రతినిధులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా అడ్డుకున్నారు. చివరకు ఆయన మరో ద్వారం నుంచి లోపలకు వెళ్లాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలు సృష్టించిన కలకలం ఆయనకు అర్థమైంది. నిరసన సెగ నితీశ్‌కు చురక అంటించింది. అంతే.. తప్పును గ్రహించిన నితీశ్, క్షమాపణ కోరుతూ తనను తానే నిందించుకున్నారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. తాను కేవలం మహిళా విద్య గురించి మాత్రమే మాట్లాడానని, తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. ఇంత రచ్చకు కారణమైన ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా దెబ్బకొడతాయా లేక క్షమాపణ కోరడం వల్ల నష్టాన్ని నివారిస్తుందా అన్నదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

మాట జారితే..

బిహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ జనాభా నియంత్రణ గురించి మాట్లాడుతున్నారు. “ఒక మహిళ కోరుకుంటే, ఆమె జనాభాను నియంత్రించగలదు” అని చెప్పాలనుకున్నారు. కానీ ఆయన అంతటితో ఆగలేదు. “మహిళ కోరుకుంటే తన భర్తను సెక్స్ చేయకుండా ఆపగలదు” అంటూ వివాదాన్ని రాజేశారు. నితీష్‌ కుమార్‌ చేసిన ఈ ప్రకటన తీవ్ర కలకలాన్ని సృష్టించింది. నితీశ్ కుమార్ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారని, అందరికీ అర్థమయ్యే భాషలో వివరించారని కొందరు సమర్థించుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ నితీష్‌ కుమార్‌ చేసిన ఆ ప్రకటన మహిళా ఎమ్మెల్యేలను తీవ్రంగా బాధించింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను అందరూ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మెయిన్ ఎంట్రన్స్ గేట్‌ వద్ద సీఎంను ఘెరావ్ చేశారు. సీఎం లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. చేసేది లేక మరో ద్వారం నుంచి నితీశ్ అసెంబ్లీ లోపలకు వెళ్లారు.

సభ లోపల కూడా నిరసన జ్వాలలు ఆగలేదు. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి మరీ గోల చేశారు. సీఎం వ్యాఖ్యలను తప్పుబడుతూ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.

నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై దుమారం..

అసెంబ్లీలోనే క్షమాపణలు చెప్పిన నితీశ్

అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నితీశ్ కుమార్ తన వ్యాఖ్యలపై అసెంబ్లీలోనే వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలకు తానే సిగ్గుపడుతున్నానని అన్నారు. “నన్ను నేను విమర్శించుకుంటున్నాను. నా వ్యాఖ్యల పట్ల సిగ్గుపడటమే కాకుండా విచారం కూడా వ్యక్తం చేస్తున్నాను. నేను మహిళలకు అండగా ఉంటాను. తాను కేవలం మహిళా విద్య గురించే మాట్లాడాను. మహిళలు చదువుకుంటే జనాభా పెరగదు అన్నదే తన మాటల అర్థం” అంటూ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ కొందరు సమర్థించినప్పటికీ.. తాను తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

నితీష్‌ను సమర్థించిన లాలూ ఫ్యామిలీ

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను సమర్థిస్తూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడిన అంశాన్ని సరైన కోణంలో చూడాలని కోరారు. ఆయన మాటల్లో అభ్యంతరకరం ఏమీ లేదని, సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా పాఠశాలల్లో పిల్లలకు ఈ విషయాలు చెబుతారని తెలిపారు. ఆయన మాటలను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే అది సరికాదని అన్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడ్డానికి ప్రజలు సిగ్గుపడుతుంటారని, నితీశ్ కేవలం జనాభా నియంత్రణ గురించి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారని అన్నారు. వాటిని వక్రీకరిస్తూ వివాదాస్పదం చేశారని తేజస్వి యాదవ్ అన్నారు.

తేజస్వి యాదవ్‌తో ఆయన తల్లి, బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి కూడా గొంతు కలిపారు. నితీశ్ నోటి నుంచి పొరపాటున మాట దొర్లిందని, దాన్ని నొక్కి చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

నితీశ్ మహిళలను అవమానించారు: ప్రతిపక్షాలు

నితీష్ ప్రకటనపై బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మహిళా ఎమ్మెల్సీ నివేదా సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నితీష్ వ్యాఖ్యల అనంతరం ఆమె సభ నుంచి బయటకెళ్లి కన్నీరు పెట్టుకున్నారు. నితీష్ కుమార్ మహిళలను అవమానించారని నివేదా సింగ్ అన్నారు. ఆయన మాట్లాడిన విషయాలు అందరికీ తెలిసినవే అని, కానీ వాటిని సభలో బహిరంగంగా ఇలా మాట్లాడకూడదని అన్నారు.

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ కూడా నితీశ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అసభ్యకరంగా ఆయన మాట్లాడారని నిందించారు. ‘థర్డ్ గ్రేడ్’ వ్యాఖ్యలుగా అభివర్ణిస్తూ నితీశ్ మతిస్థిమితం కోల్పోయారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిహార్‌కు చెందిన మరో కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే కూడా నితీశ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. చట్టసభల సభ్యతను మంటగలిపారని, ఆయన ముందు రాజీనామా చేసి వెంటనే ఓ వైద్యుణ్ణి సంప్రదించాలని సూచించారు.

మొత్తమ్మీద ఇంత వివాదాన్ని సృష్టించిన ఆయన వ్యాఖ్యలు మహిళా నేతలనే కాదు, మహిళా ఓటర్లను కూడా ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. రాజకీయాల్లో ‘మాట తెచ్చే చేటు’ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పదవులు కోల్పోయిన ఘటనలు, ఎన్నికల్లో ఓడిపోయిన ఉదంతాలు దేశంలో అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నితీశ్ కుమార్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణ కోరినప్పటికీ.. అవి ప్రజల్లోకి దావాగ్నిలా వ్యాపించాయి. వాటిపై ఆయన ఇచ్చిన వివరణ కంటే ముందు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఎక్కువ మందికి చేరతాయి. దీంతో క్షమాపణతో నష్ట నివారణ సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.