PM Narendra Modi: డబుల్ ఇంజిన్ ప్రభుత్వం లక్ష్యం అదే.. గుజరాత్ గౌరవ్ అభియాన్‌లో ప్రధాని మోడీ
నవ్‌సారిలో పర్యటించిన ప్రధాని మోడీ.. 'గుజరాత్ గౌరవ్ అభియాన్' లో భాగంగా బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. గుజరాత్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు గర్వపడుతున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
PM Narendra Modi Gujarat Visit: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించారు. మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోడీ ఎప్పటికప్పడు స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రెండు నెలల్లో ఇప్పటికే నాలుగు సార్లు పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తాజాగా శుక్రవారం కూడా గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గుజరాత్‌లో రూ. 3,050 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నవ్‌సారిలో పర్యటించిన ప్రధాని మోడీ.. ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’ లో భాగంగా బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. గుజరాత్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు గర్వపడుతున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు గర్వంగా ఉందని.. గుజరాత్ ప్రజలతోనే తనకు దేశానికి సేవ చేసే భాగ్యం కలిగిందని మోడీ పేర్కొన్నారు. ఇన్నేళ్ల కాలంలో గిరిజన ప్రాంతంలో ఇలాంటి పెద్ద కార్యక్రమం ఎప్పుడూ జరగలేదంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. అదివాసీ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టినట్లు మోడీ వివరించారు.
తాను గుజరాత్‌ను విడిచిపెట్టిన తర్వాత, ఆ బాధ్యతను స్వీకరించిన భూపేంద్ర భాయ్, సిఆర్ పాటిల్ ఉత్సాహంతో.. ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని కలిగించినందుకు గర్వపడుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. గుజరాత్‌లో గత రెండు దశాబ్దాల్లో వేగంగా అభివృద్ధి జరిగిందని.. ఇది దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అందరి అభివద్ది కోసం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని తెలిపారు. రూ. 3,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే అవకాశం లభించడం గర్వకారణమన్నారు.
ఈ ప్రాజెక్టులన్నీ సూరత్, తాపి, నవ్‌సారి, వల్సాద్‌తో సహా దక్షిణ గుజరాత్‌లోని కోట్లాది మంది ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తాయన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో విద్యుత్, నీరు, రోడ్లు, వైద్యం, విద్య ఇలా అన్ని రకాల సంక్షేమ ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలను పెంచుతాయని పేర్కొన్నారు.
The rapid development in the state during the last two decades is the pride of Gujarat. In the last 8 years, following the mantra of Sabka Saath, Sabka Vikas, our government has put utmost emphasis on the welfare of the people in the state: PM Narendra Modi in Navsari, Gujarat pic.twitter.com/v91FwAtNvf
— ANI (@ANI) June 10, 2022
బీజేపీ సర్కార్ 8ఏళ్ల పాలనను ప్రస్తావిస్తూ.. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ నినాదంతో తమ ప్రభుత్వం పేదల సంక్షేమం, కనీస సౌకర్యాలు కల్పించడంపై అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని మోడీ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అభివృద్ధిపై ఎవరూ దృష్టిసారించలేదంటూ.. మోడీ విమర్శించారు.
కాగా.. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఆదివాసీలు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. సంప్రదాయ పద్దతిలో మేళా తాళాలతో ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ.. గిరిజనుల నృత్యాలను తిలకిస్తూ.. ముందుకు సాగారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..