PM Modi: హస్తిన వీధుల్లో ప్రధాని మోదీ మెగా రోడ్ షో.. పూల వర్షం కురిపించిన ఢిల్లీ వాసులు..
సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అంతకుముందు ఢిల్లీలో మెగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయనకు ఢిల్లీ ప్రజలు, బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికారు.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (జనవరి 16) ఢిల్లీలో నిర్వహించిన మెగా రోడ్‌షోకు భారీ స్పందన లభించింది. పెద్ద ఎత్తున ఢిల్లీ ప్రజలతోపాటు బీజేపీ శ్రేణులు హాజరయ్యారు. ఈ రోడ్‌షో పటేల్ చౌక్ నుంచి NDMC కన్వెన్షన్ సెంటర్ వరకు జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా సామాన్య ప్రజలు, బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. ప్రధాని కాన్వాయ్‌పై ప్రజలు పూల వర్షం కురిపించారు. రోడ్‌షో అనంతరం ఎన్‌డిఎంసి కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న ప్రధాని మోడీకి బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో బీజేపీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ రోడ్డ్ షోను నిర్వహించారు.
లోక్‌సభ, విధానసభల ఎజెండాను ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత పార్టీ నిర్వహిస్తున్న తొలి ప్రధాన సమావేశం ఇదే. దేశంలోని ప్రస్తుత సమస్యలు, పార్టీలోని సంస్థాగత అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం..
ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగ్గా.. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి జనవరి 17వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.
మోదీ రోడ్ షోను ఇక్కడ చూడండి..
నడ్డా నేతృత్వంలో..
జాతీయ అధ్యక్షుడిగా నడ్డా మూడేళ్ల పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు ఆయనే పార్టీకి నాయకత్వం వహించే అవకాశం ఉంది. జేపీ నడ్డా నేతృత్వంలోని జాతీయ కార్యవర్గానికి ముందు పార్టీ జాతీయ ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర శాఖ అధ్యక్షులు, వివిధ సంస్థ కార్యదర్శుల సమావేశం జరిగిందని బీజేపీ నేత సంబిత్ పాత్రా తెలిపారు. సమర్పించాల్సిన అన్ని ప్రతిపాదనలపై ఇక్కడ చర్చించారు.
జనపనారతో చేసిన బ్యానర్లను..
అయితే, ఈ సమావేశాలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. బీజేపీ జాతీయ సమావేశాల్లో పూర్తి స్థాయిలో ఏకో ఫ్రెండ్లీగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ ను ఉపయోగించడం లేదు. పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో ఫ్లెక్సీలను అస్సలు ఉపయోగించడం లేదు. దాదాపు అన్నింటిని ఇలానే ప్లాన్ చేశారు. బ్యానర్లు కూడా జనపనారతో తయారు చేసినవి మాత్రమే ఉపయోగిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం