AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.. గంగా జలంతో అభిషేకం

ప్రధాని మోదీ తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూలై 26న తూత్తుకుడికి చేరుకున్న ప్రధాని మోదీ వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అదే రోజు రాత్రి ప్రైవేట్ విమానంలో తిరుచ్చికి బయలుదేరి వెళ్లిన మోదీ ఈరోజు (జూలై 27) ఉదయం 11 గంటలకు తిరుచ్చిలో బస చేసిన హోటల్ నుంచి అరియలూర్ జిల్లాలోని గంగైకొండ చోళపురానికి బయలుదేరారు. అక్కడ ఈ రోజు మొదటి రాజేంద్ర చోళ జయంతి సందర్భంగా గంగైకొండ చోళపురం ఆలయంలో పూజలు చేశారు..

గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.. గంగా జలంతో అభిషేకం
PM Modi Offers Prayers At Gangaikonda Cholapuram Temple
Srilakshmi C
|

Updated on: Jul 27, 2025 | 5:59 PM

Share

అరియలూర్, జూలై 27: చోళ చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (జులై 27) తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో దేవుడిదర్శనం చేసుకుని, గంగా జలంతో చోళీశ్వరుడికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లటి ధోతి, తెల్లటి చొక్కా, మెడలో అంగవస్త్రం ధరించి కనిపించారు. కాగా ప్రధాని మోదీ తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూలై 26న తూత్తుకుడికి చేరుకున్న ప్రధాని మోదీ వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అదే రోజు రాత్రి ప్రైవేట్ విమానంలో తిరుచ్చికి బయలుదేరి వెళ్లిన మోదీ ఈరోజు (జూలై 27) ఉదయం 11 గంటలకు తిరుచ్చిలో బస చేసిన హోటల్ నుంచి అరియలూర్ జిల్లాలోని గంగైకొండ చోళపురానికి బయలుదేరారు.

తిరుచ్చి నుంచి హెలిప్యాడ్‌కు మోదీ కారులో వెళ్లారు. కారులో వెళ్తున్న ప్రధాని మోదీకి రోడ్డుకు ఇరువైపులా కార్యకర్తలు పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్‌లో అరియలూర్‌కు వెళ్లారు. అక్కడి నుంచి కారులో గంగైకొండ చోళపురం చేరుకున్నారు. గంగైకొండ చోళపురం వద్ద బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా బీజేపీ, ఏఐఏడీఎంకే జెండాలు కట్టారు. రాజేంద్ర చోళుడి చిత్రాలు, ప్రధానమంత్రిని స్వాగతించే సందేశాలు కలిగిన ఫ్లెక్స్ బోర్డులు, బ్యానర్లు దారి పొడవునా ఏర్పాటు చేశారు. జనాలు పెద్ద మొత్తంలో తరలి రావడంతో ప్రధాని మోదీ రోడ్ షో కూడా నిర్వహించారు. అనంతరం గంగైకొండ చోళపురం ఆలయాన్ని మోదీ దర్శించారు. అక్కడ బృహదీశ్వరుడు, దుర్గ, పార్వతి, మురుగన్ ఆలయాలలో పూజలు చేశారు.

ఇవి కూడా చదవండి

ఆలయ శివాచార్యులు ప్రధానమంత్రికి పూలమాలలు వేసి, ప్రసాదాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారణాసి నుంచి తీసుకువచ్చిన గంగా జలంతో విగ్రహానికి అభిషేకం చేశారు. అనంతరం మొదటి రాజేంద్ర చోళుడు ఆగ్నేయాసియాకు సముద్ర యాత్ర చేసి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజేంద్ర చోళుడు గంగను జయించి గంగా జలాన్ని తీసుకువచ్చి చోళుల కొత్త రాజధానిగా గంగైకొండ చోళపురాన్ని స్థాపించాడని చరిత్రలో చెప్పబడింది. ఇందుకు కృతజ్ఞతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడుకు వచ్చినప్పుడల్లా గంగా జలాన్ని తీసుకువచ్చేవారు. ఇదే ఆనవాయితీని ఇప్పుడు కూడా పాటించారు. మోదీ తెచ్చిన గంగా జలంతో బృహదీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. దీని తర్వాత ఇళయరాజా సంగీత ప్రదర్శన నిర్వహించారు. అంతేకాకుండా ఆది తిరువతిరై పండుగ పురస్కరించుకుని గంగైకొండ చోళపురం ఆలయంలో జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ గొప్ప చక్రవర్తులలో ఒకరైన మొదటి రాజేంద్ర చోళుడి గౌరవార్థం ఒక స్మారక నాణేన్ని విడుదల చేశారు.

ఎవరీ రాజేంద్ర చోళుడు?

రాజేంద్ర చోళుడు (1014-1044 CE) దేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన పాలకుడిగా పేరుపొందాడు. ఆయన కాలంలో చోళ సామ్రాజ్యం దక్షిణ, ఆగ్నేయాసియా అంతటా విస్తరించింది. గంగైకొండ చోళపురాన్ని సామ్రాజ్య రాజధానిగా చేసుకుని పాలన కొనసాగించాడు. అక్కడ నిర్మించిన ఆలయంలో 250 ఏళ్లకు పైగా శైవ భక్తికి ప్రతీకగా నిలిచింది. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది. ఇందులోని శిల్పాలు, చోళుల కాంస్య శిల్పాలు, పురాతన శాసనాలు వారసత్వ సంపదగా ప్రసిద్ధి చెందాయి. ఆది తిరువతిరై పండుగ తమిళ శైవ భక్తులకు చాలా ప్రత్యేకం. ఇక్కడ తమిళ శైవ మతానికి చెందిన సాధువు-కవులు అయిన 63 మంది నాయన్మార్లు అమరత్వం పొందారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.