Parliament Budget Session: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఈ అంశాలపైనే కీలక చర్చ..
కీలక బిల్లులను ఆమోదించుకునే దిశగా కేంద్రం రెడీ అవుతుంటే.. పలు అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ్లి నుంచి ప్రారంభం కానున్న రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కేంద్రం .. విపక్షాల మధ్య కీలక అంశాలపై చర్చ జరగనుంది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించుకునే దిశగా కేంద్రం రెడీ అవుతుంటే.. పలు అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి (మార్చి 10) నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సెషన్ మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ మొదలై ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. మణిపూర్‌లో తాజా హింసాకాండ, యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బెదిరింపు, పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్‌లో వాడిగా వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఓ వైపు బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదముద్ర వేయడం, బడ్జెట్ సంబంధిత అంశాలను పూర్తి చేయడం, మణిపూర్ బడ్జెట్‌కు, వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.
అయితే వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో అక్రమాల ఆరోపణలు, మణిపూర్‌లో హింసాకాండ, అమెరికాలోని ట్రంప్ సర్కార్‌తో భారత్ వ్యవహరిస్తున్న తీరును పార్లమెంట్‌లో నిరసించాలని ప్రతిపక్షాలు సిద్ధం అవుతున్నాయి.
నకిలీ ఓటరు కార్డుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఉభయ సభల్లో ఈ సమస్యను లేవనెత్తడానికి కాంగ్రెస్, డిఎంకె, ఉద్ధవ్ వర్గం శివసేన సహా ఇతర ప్రతిపక్షాల మద్దతును తృణమూల్ కోరింది. అయితే దీనిపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది.
మొత్తానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మరోసారి అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..