AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్లు మామూలోళ్లు కాదు.. సెల్‌ఫోన్లు దొంగతనం చేసి ఏం చేస్తున్నారో తెలుసా..

ఢిల్లీలో సెల్‌ఫోన్లు దొంగలిస్తూ... బంగ్లాదేశ్‌లో విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. వీరి నెట్‌వర్క్‌ ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌తో పాటు బంగ్లాదేశ్‌లోనూ విస్తరించి ఉన్నట్లు తెలిపారు. పక్కా ప్లానింగ్‌ ప్రకారం చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

వీళ్లు మామూలోళ్లు కాదు.. సెల్‌ఫోన్లు దొంగతనం చేసి ఏం చేస్తున్నారో తెలుసా..
Delhi Mobiles Seize
Shaik Madar Saheb
|

Updated on: Mar 10, 2025 | 8:04 AM

Share

అంతర్జాతీయ దొంగల ముఠా గుట్టురట్టు చేశారు ఢిల్లీ పోలీసులు. భారత్‌లో సెల్‌ఫోన్లను దొంగలించి బంగ్లాదేశ్‌లో విక్రయిస్తున్న కేటుగాళ్లకు కళ్లెం వేశారు. ఖరీదైన 48 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 20 లక్షలకుపైనే ఉంటుందని తేల్చారు. ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… మిగతా వారి కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సెల్ ఫోన్ల అక్రమ దందా ఎన్నో నెలలుగా నడుస్తున్నట్లు తెలిపారు పోలీసులు. మెట్రో స్టేషన్లు, బస్టాండ్‌లు, రద్దీగా ఉండే మార్కెట్లలో దొంగతనాలకు పాల్పడుతూ బంగ్లాదేశ్‌కి వెళ్లి విక్రయాలు జరుపుతున్నట్లు వెల్లడించారు. గత 18 నెలల్లో సుమారు 800కి పైగా ఫోన్లను దొంగలించి బంగ్లాకు తరలించారని… వీరి నెట్‌వర్క్‌ ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌తో పాటు బంగ్లాదేశ్‌లోనూ విస్తరించి ఉన్నట్లు తెలిపారు. పక్కా ప్లానింగ్‌ ప్రకారం చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. పక్క దేశానికి సెల్‌ఫోన్ల తరలింపులో అధికారుల పాత్ర ఉంటుందన్న అనుమానాలనూ ఢిల్లీ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తర ఢిల్లీలోని కొత్వాలిలోని సలీంఘర్ బైపాస్ సమీపంలో దొంగిలించిన ఫోన్లతో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, 24 ఏళ్ల అబ్దుష్ అనే స్మగ్లర్‌ను అరెస్టు చేసినట్లు డిసిపి (క్రైమ్ బ్రాంచ్) ఆదిత్య గౌతమ్ తెలిపారు.. వీరు పక్కా ప్లాన్ తో దొంగతనాలు చేస్తారని .. పెద్ద నెట్ వర్క్ ఉన్నట్లు తెలిపారు. దొంగిలించబడిన తర్వాత, గుర్తించకుండా ఉండటానికి మొబైల్ ఫోన్‌లను స్థానికంగా విక్రయించరు.. లేదా ఉపయోగించరని తెలిపారు. స్మగ్లర్లు సేకరించి.. ఒక్కో ఫోన్ కు రూ. 2,000-3,000 నామమాత్రపు ధరకు కొనుగోలు చేస్తారని.. ఆ తర్వాత మార్పులు చేసి.. సరిహద్దుల్లో రూ.8 వేల నుంచి 10వేలకు అమ్ముతారని అని డిసిపి (క్రైమ్ బ్రాంచ్) ఆదిత్య గౌతమ్ వివరించారు.

ఇక అదుపులో ఉన్న నిందితుడు అబ్దుష్‌ను విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని… అతి త్వరలో ముఠా సభ్యులందరిని పట్టుకుని తీరుతామని చెబుతున్నారు. సైబర్‌ సెల్‌ సైతం నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు ఢిల్లీ పోలీసులు..

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..