అమిత్ షా
అమిత్ షా.. ప్రధాని నరేంద్ర మోదీకి నమ్మిన బంటు. గత దశాబ్ధ కాలంగా బీజేపీ రాజకీయ వ్యూహరచనల్లో ఆయన అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ఆయన ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నారు. మోదీ కేబినెట్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన వారిలో ఒకరైన అమిత్ షా.. 2014-2020 వరకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 10వ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేశారు. అంతకు ముందు 2014 వరకు ఎన్డీయే ఛైర్మన్‌గానూ సేవలందించారు. 2017 నుంచి 2019 వరకు గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యంవహించారు. 2019లో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఎన్నికల వ్యూహాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి రాక ముందు వరకు అమిత్ షా.. 1997, 1998, 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గుజరాత్ మంత్రిగానూ సేవలందించారు. కాలేజీ రోజుల్లో ఏబీవీపీలో అమిత్ షా చురుగ్గా పనిచేశారు.