AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Security Breach: లోక్‌సభలో అలజడి ఘటన.. ఎనిమిది మంది భద్రతా అధికారులపై సస్పెన్షన్‌ వేటు

పార్లమెంటులో బుధవారం (డిసెంబర్‌ 13) దుండగులు అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. భద్రతా ఉల్లంఘన కారణంగా లోక్‌సభలోకి దుండగులు చొచ్చుకురాగలిగారని భావించిన లోక్‌సభ సెక్రటేరియట్ భద్రతా లోపాలపై సీరియస్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం (డిసెంబర్‌ 14) ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది. 2001 పార్లమెంట్ ఉగ్రదాడి వార్షికోత్సవం సందర్భంగా భద్రతా ఉల్లంఘన..

Parliament Security Breach: లోక్‌సభలో అలజడి ఘటన.. ఎనిమిది మంది భద్రతా అధికారులపై సస్పెన్షన్‌ వేటు
Parliament Security Breach
Srilakshmi C
|

Updated on: Dec 14, 2023 | 2:47 PM

Share

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 14: పార్లమెంటులో బుధవారం (డిసెంబర్‌ 13) దుండగులు అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. భద్రతా ఉల్లంఘన కారణంగా లోక్‌సభలోకి దుండగులు చొచ్చుకురాగలిగారని భావించిన లోక్‌సభ సెక్రటేరియట్ భద్రతా లోపాలపై సీరియస్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం (డిసెంబర్‌ 14) ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది. 2001 పార్లమెంట్ ఉగ్రదాడి వార్షికోత్సవం సందర్భంగా భద్రతా ఉల్లంఘన జరిగింది. ఇద్దరు వ్యక్తులు–సాగర్ శర్మ, మనోరంజన్ డి- జీరో అవర్ సమయంలో పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకి, పసుపు వాయువును విడుదల చేశారు. మనోరంజన్‌, సాగర్‌ శర్మ, నీలమ్‌, అమోల్‌ శిందె, విశాల్‌, లలిత్‌ అనే ఆరుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే.

ఇందులో మనోరంజన్‌, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్‌, అమోల్‌ శిందే పార్లమెంట్‌ భవనం వెలుపల నినాదాలు చూస్తూ గందరగోళం సృష్టించారు. ఈ ఘటన మొత్తానికి మాస్టర్‌ మైండ్‌ మనోరంజనే అని పోలీసు వర్గాలు తాజాగా వెల్లడించాయి. మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆరో నిందితుడు పరారీలో ఉన్నాడు. హోం మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తును ప్రారంభించింది. విచారణకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) చీఫ్‌గా నియమించింది. వీరిపై అతిక్రమణ, నేరపూరిత కుట్ర, అడ్డుకోవడం, అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టడం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు భద్రతా ఉల్లంఘనలపై పార్లమెంట్‌లో సీనియర్‌ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఉభయ సభల్లోని విపక్ష నేతలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం నాటి భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రతిపక్ష ఎంపీల నినాదాల మధ్య లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం నాటి సభలో జరిగిన గందర గోళంపై ఆందోళన వ్యక్తం చేశారు. సభ భద్రత లోక్‌సభ సెక్రటేరియట్‌దే బాధ్యత అని అన్నారు. పార్లమెంటు భద్రతపై సమీక్ష జరపాలని కోరుతూ హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తానని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. చొరబాటుదారులలో ఒకరికి జారీ చేసిన విజిటర్ పాస్‌పై సంతకం చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై చర్య తీసుకోవాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. ఘటనపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలన్నారు. అతను దీని నుండి పారిపోలేడు. బీజేపీ ఎంపీ సింహా దోషులకు పాస్‌లు అందించారు. దీని వెనుక లోతైన కుట్ర ఉందని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.