Parliament Session: ఇప్పటి దాకా ఒకెత్తు.. ఇకపై ఒకెత్తు.. ఆగస్టు తొలివారంలో పార్లమెంటు సెషన్ మరింత హాట్‌హాట్

ఇక తొలి పది రోజుల వర్షాకాల సమావేశాలతో పోల్చుకుంటే ఆగస్టు తొలి వారంలో పార్లమెంటు మరింతగా దద్దరిల్లబోయే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం సభలో పరిణామాలు, పరిస్థితులు ఎలా ఉన్నా తాము అనుకున్న 13 బిల్లులను ఆమోదింప చేసుకోవడానికి మోదీ సర్కార్ సమాయత్తమవుతుంది. ఈ 13 బిల్లులతో పాటు విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై కూడా ఆగస్టు తొలి వారంలోనే చర్చ జరిగే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైతే అది ఎన్ని మలుపులు తిరుగుతుందో ఊహించలేము.

Parliament Session: ఇప్పటి దాకా ఒకెత్తు.. ఇకపై ఒకెత్తు.. ఆగస్టు తొలివారంలో పార్లమెంటు సెషన్ మరింత హాట్‌హాట్
PM Modi, Amit Shah - Mallikarjun Kharge, Rahul Gandhi
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 31, 2023 | 10:01 PM

జులై 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పదకొండు రోజులు గడిచినా సజావుగా సాగింది లేదు. మణిపూర్‌లో మూడు నెలల క్రితం ప్రజ్వరిల్లిన హింసాత్మక ఘటనలను ఆధారం చేసుకున్న విపక్షాలు.. నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉభయ సభల్లో చర్చకు పట్టుబడుతున్నాయి. మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం తరపున హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పలుమార్లు ప్రకటించినా కేవలం తాము సూచించిన నిబంధనల ప్రకారమే సభలో చర్చ జరగాలని పట్టుబడుతూ వర్షాకాల సమావేశాలను ప్రతిపక్ష పార్టీలు వృధా చేస్తున్నాయి. చర్చ జరగడం ముఖ్యం కానీ అది ఏ సెక్షన్ ప్రకారం అన్నది కీలకం కాదన్నది జగమెరిగిన సత్యం. చర్చ జరగాలి.. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఇది చాలు. కానీ, త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయాలకే అధిక ప్రాధాన్యతనిస్తూ సున్నితమైన అంశాలను పరిష్కార దిశకు మళ్ళించాలన్న స్పృహను విపక్షాలు పక్కన పెడుతున్నాయనే చెప్పాలి.  జులై 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుంచి ఇటీవల కాంగ్రెస్ సారధ్యంలో ఏర్పడిన విపక్ష కూటమికి చెందిన రాజకీయ పార్టీలు ఒకవైపు లోక్‌సభలో, మరొకవైపు రాజ్యసభలో హంగామా సృష్టిస్తూనే ఉన్నాయి. ప్రారంభమైన రెండో రోజునే మణిపూర్ హింసాత్మక ఘటనలపైనా, తాజా పరిణామాలపైనా చర్చకు సిద్ధమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. ఇంకోవైపు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్న మేరకు మణిపూర్ ఘటనలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, విపక్షాలు చర్చలకు వస్తే చర్చ జరిగే తేదీని, ఏ నిబంధన ప్రకారం ఆ చర్చ చేపడదామన్నది ఖరారు చేద్దామని పిలుపునిస్తూనే ఉన్నారు. సభ నిర్వాహకులుగాని, ప్రభుత్వ పెద్దలు కాని చర్చకు సిద్ధమని పదేపదే చెబుతున్నా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా విపక్ష పార్టీల ఎంపీలు సభలో హంగామా చేయడం ఆపడం లేదు. అయితే, ఒకవైపు విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నా, పోడియంలోకి చేరుకొని గట్టిగా నినాదాలు చేస్తున్నా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. తాము అనుకున్న విధంగా బిల్లులను ప్రవేశ పెడుతూ, వాటిని ఆమోదింప చేసుకుంటూ ముందుకు సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వారాంతపు సెలవుల తర్వాత వర్షాకాల సమావేశాలు తిరిగి జూలై 31న మళ్లీ ప్రారంభమయ్యాయి. సోమవారం కావడంతో ఎంపీలు పెద్ద సంఖ్యలో ఉభయ సభల్లో కనిపించారు. కానీ, గత పది రోజులుగా కొనసాగినట్లుగానే జులై 31న కూడా పార్లమెంటు ఉభయ సభలలో విపక్షాల హంగామా కొనసాగింది. నినాదాలపర్వం కొనసాగింది. నిరసనల పర్వం కొనసాగింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదాల పర్వమూ కొనసాగింది.

ఇక తొలి పది రోజుల వర్షాకాల సమావేశాలతో పోల్చుకుంటే ఆగస్టు తొలి వారంలో పార్లమెంటు మరింతగా దద్దరిల్లబోయే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం సభలో పరిణామాలు, పరిస్థితులు ఎలా ఉన్నా తాము అనుకున్న 13 బిల్లులను ఆమోదింప చేసుకోవడానికి మోదీ సర్కార్ సమాయత్తమవుతుంది. ఈ 13 బిల్లులతో పాటు విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై కూడా ఆగస్టు తొలి వారంలోనే చర్చ జరిగే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైతే అది ఎన్ని మలుపులు తిరుగుతుందో ఊహించలేము. ఎందుకంటే ఆ చర్చలో పాల్గొనే ఎంపీలు ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు వ్యక్తం చేస్తున్నామనేది వివరిస్తూ దేశంలో ఏదైనా అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. దాంతో చర్చ కాస్త ఉద్రిక్తత దిశగా మళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈసారి ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుతో పాటు 13 బిల్లులను ప్రవేశపెట్టినందుకు మోదీ ప్రభుత్వం రెడీ అవుతోంది. అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలపై నియంత్రణను పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ మోడీ సర్కార్ ఆర్డినెన్సును గతంలో జారీ చేసింది. దాన్ని బిల్లు రూపంలో ఆమోదింప చేసుకొనేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆగస్టు తొలి వారంలోనే ఈ బిల్లు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. నిజానికి జూలై 31న ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించినప్పటికీ సానుకూల వాతావరణ లేకపోవడంతో వాయిదా వేసుకున్నారు. ఢిల్లీ బిల్లును అక్కడి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా వ్యతిరేస్తోంది. తమకు సభలో సహకరించాల్సిందిగా, ఢిల్లీ ఆర్డినెన్సును వ్యతిరేకించాల్సినదిగా కాంగ్రెస్ సారధ్యంలోని 26 పార్టీల విపక్ష కూటమి సభ్యులను అరవింద్ కేజ్రీవాల్ ఒప్పించుకున్నారు. సో, సహజంగానే ఈ ఢిల్లీ ఆర్డినెన్సుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే ఆ సందర్భంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య పెద్ద యుద్ధమే జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్డీఏ, విపక్ష కూటమిల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక మోదీ సర్కార్ ఈ వారంలో ప్రవేశపెట్టాలనుకుంటున్న మిగిలిన బిల్లులలో జనన, మరణాల నమోదు సవరణ, షెడ్యూల్డ్ ట్రైబ్స్ సంబంధించి రాజ్యాంగ సవరణ, జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ల బిల్లు వంటివి కూడా ఉన్నాయి. అయితే ఈ బిల్లులన్నింటినీ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన తర్వాతనే ప్రవేశపెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అవిశ్వాస తీర్మానం ఒకవైపు పెండింగులో ఉండగా బిల్లులను ఎలా ప్రవేశపెడతారని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. నైతికంగా ఇది కరెక్ట్ కాదని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుపై పార్లమెంటరీ కమిటీ నివేదికను సభలో పెట్టవద్దని వామపక్షాలు కోరుతున్నాయి. తమకు సిఫార్సు చేయని బిల్లును సభలో ప్రవేశపెట్టే అధికారం కమిటీకి లేదని సిపిఎం పార్టీ వాదిస్తోంది. ఇదిలా ఉండగా లోక్‌సభలో ఎంపీలు కొందరు కూడ బలుక్కుని స్ట్రాటజికల్‌గా అడ్డంకులు సృష్టిస్తూ సభా మర్యాదను మంటగలుగుతున్నారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గువాహటీలో చేసిన కామెంట్స్ కలగలం రేపాయి. సభలో కార్యకలాపాలను అడ్డుకుంటూ నినాదాలు చేయడం, అనవసరంగా పోడియంలోకి దూసుకొచ్చి ప్లకార్డులతో హంగామా చేయడం హుందాగా లేదని ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక మణిపూర్‌లో రెండు జాతుల మధ్య ఘర్షణలను నివారించడంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మూడు నెలలుగా మణిపూర్ తగలబడి పోతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వహించడం సమంజసం కాదని ఇటీవల మణిపూర్‌లోపర్యటించి వచ్చిన విపక్ష కూటమి సభ్యులు అంటున్నారు. తమ పర్యటనలో తాము గ్రహించిన అంశాలను పార్లమెంటులో ప్రస్తావిస్తామని, అందుకు తక్షణమే మణిపూర్ అంశాన్ని చర్చకు టేకప్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మణిపూర్ బాధితులకు వెంటనే పునరావాసం కల్పించడంతోపాటు ఆ రాష్ట్రంలో తక్షణం శాంతి నెలకొల్పేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు తొలి వారంలో పార్లమెంటులో ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అవిశ్వాస తీర్మానం ఇంకొక వైపు మణిపూర్ హింసాత్మక ఘటనలను ఆధారం చేసుకుని విపక్ష కూటమి ప్రభుత్వంపై ఆరోపణాస్త్రాలను సిద్ధం చేసుకుంది. చర్చ జరిగితే అది ఒక్క మణిపూర్ రాష్ట్రానికే పరిమితం చేయకుండా విపక్ష కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు ప్రభుత్వాలను నడుపుతున్న బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో జరిగిన హింసాత్మక ఘటనను కూడా ప్రస్తావించాలని అధికార పక్షం అస్తాలను సిద్ధం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు తొలి వారంలో పార్లమెంటు సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.