OnePlus Nord 2 Explodes: లాయర్ కోటు జేబులో మంటలు, పొగలు.. ఏంటా అని చూస్తే ఊహించని పేలుడు.. పూర్తి వివరాలు మీకోసం..
OnePlus Nord 2 Explodes: ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్సే బాంబుల్లా మారుతున్నాయి. రోజూ మాదిరిగానే జేబులో పెట్టుకున్న ఫోన్‌లు.. ఊహించని రీతిలో బాంబుల్లా పేలిపోతున్నాయి.

OnePlus Nord 2 Explodes: ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్సే బాంబుల్లా మారుతున్నాయి. రోజూ మాదిరిగానే జేబులో పెట్టుకున్న ఫోన్‌లు.. ఊహించని రీతిలో బాంబుల్లా పేలిపోతున్నాయి. తాజాగా ఢిల్లీలోని హజారీ కోర్టులో ఓ న్యాయవాది జేబులో మొబైల్ ఫోన్ పేలింది. అదృష్టవశాత్తు ఫోన్ నుంచి పొగరావడాన్ని ముందే పసిగట్టిన ఆ లాయర్.. తాను ధరించిన లాయర్ కోట్ సహా ఫోన్‌ను తీసి కింద పడేశాడు. అలా కింద పడేసిన వెంటనే మొబైల్ పేలింది. ఈ ఘటనలో న్యాయవాదికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలియగానే పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన న్యాయవాదిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. స్వల్ప గాయాలవడంతో ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న న్యాయవాది.. మొబైల్ కంపెనీ, మొబైల్ డిస్ట్రిబ్యూట్ చేసిన కంపెనీపై సబ్జిమండి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధిత న్యాయవాది గౌరవ్ గులాటీ 2014 నుంచి ఉత్తర ఢిల్లీలోని 30 హజారీ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కోర్టు ఆవరణలో ఈయనకు ఒక గది కూడా ఉంది. అయితే, ఇటీవల గౌరవ్ గులాటీ వన్ ప్లస్ నార్డ్2 5జీ మొబైల్ ఫోన్‌ను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేశాడు. ఈ ఫోన్‌ను ఆగస్టు 25న అమేజాన్ సంస్థ డెలివరీ చేసింది. అయితే, తాజాగా తాను కొన్న కొత్త ఫోన్‌ను వెంట తీసుకెళ్లాడు. కోర్టు ఆవరణలోని తన కార్యాలయంలో పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. తాను ధరించిన లాయర్ కోట్ జేబు కాలిపోతూ పొగ రావడం ప్రారంభమైంది. అయితే, పొగను గుర్తించిన గులాటీ.. వెంటనే తాను ధరించిన కోట్‌ను విప్పి ఫోన్‌తో సహా కింద పడేశాడు. అలా పడేసిన వెంటనే మొబైల్ ఫోన్ బ్లాస్ట్ అయ్యింది. ఆ ఘటనలో గులాటీకి స్వల్ప గాయాలయ్యాయి. ఇదే విషయాన్ని గులాటీ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఆ మేరకు ఒక ట్వీట్ చేశాడు.
#Blast & #Fire in my brand new #oneplusnord25g.@OnePlus_IN Today morning while i was in my office ( Court Chamber) @OnePlusNord2_ @oneplus @OnePlus_USA pic.twitter.com/TwNKNmnhzo
— GAURAV GULATI (@Adv_Gulati1) September 8, 2021
తనకు చాతి వద్ద గాయాలయ్యాయని, పేలుడు సంభవించిన వెంటనే వన్‌ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్, అమెజాన్ ఎగ్జిక్యూటీవ్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసుల సమక్షంలో వైద్య పరీక్షలు చేయించుకున్నానని చెప్పారు. అయితే, ఈ అంశంపై వన్‌ప్లస్ యాజమాన్యం స్పందించింది. ఈ పేలుడు గురించి తెలుసుకున్న తరువాత బాధిత వ్యక్తిని సంప్రదించేందుకు ప్రయత్నించామంది. అయితే, పేలుడు సంభవించడానికి గల కారణాలను విశ్లేషించేందుకు యూజర్ నిరాకరించారని వన్‌ప్లస్ పేర్కొంది. ‘‘వినియోగదారుడు ట్విట్టర్ ద్వారా వన్‌ప్లస్ నార్డ్2 పేలుడుపై ఫిర్యాదు చేశాడు. క్లెయిమ్ చట్టబద్ధతను ధృవీకరించేందుకు మా బృందం వెంటనే ఆ వ్యక్తిని సంప్రదించింది. వినియోగదారుడు భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, పేలిన పరికరాన్ని విశ్లేషించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అతను సహకరించలేదు. పేలుడుపై విచారణ జరుపకుండా క్లెయిమ్ చట్టబద్ధతను ధృవీకరించడం, యూజర్ డిమాండ్లను పరిష్కరించడం అసాధ్యమైన పని.’’ అని వన్‌ప్లస్ స్పష్టం చేసింది.
వన్‌ప్లస్ ఆరోపణలపై గులాటీ క్లారిటీ ఇచ్చారు. వన్‌ప్లస్ బృందానికి స్మార్ట్ ఫోన్ ఇవ్వడానికి తాను నిరాకరించానని స్పష్టం చేశాడు. ఈ పేలు పేలుడు పెద్ద విషయం కాదని చూపించేలా ఈ టీమ్ టాంపరింగ్ చేసే అవకాశం ఉందని భావించానని, అందుకే వారికి స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదని వివరణ ఇచ్చాడు. ఈ పేలుడు పట్ల వారు సీరియస్‌గా లేరనే విషయం వారి ప్రవర్తనతోనే అర్థమయ్యిందన్నారు. వ్యక్తుల ప్రాణాలకు ప్రమాదకరమైన వన్‌ప్లస్ నార్డ్2 మొబైల్ ఫోన్ల అమ్మకాలను నిలిపివేయడమే తన లక్ష్యం అని గులాటీ తేల్చి చెప్పారు. ఒక బాంబు లాంటి పరికరాన్ని జేబులో పెట్టుకుని నడవడం చాలా ప్రమాదకరం అన్న ఆయన.. బహిరంగ ప్రదేశాల్లో పేలుడు సంభవిస్తేనే ఊహించని ప్రమాదాలు జరుగుతాయని, అలాంటిది విమానాల్లో మొబైల్ పేలుడు సంభవిస్తే ఎంతటి ఘోరాలు జరుగుతాయో ఊహించండి అంటూ గులాటి తన ఆందోళనను వ్యక్తం చేశాడు.
కాగా, గత నెలలోనూ ఇలాంటి ఘటనలుు చాలానే చోటు చేసుకున్నాయి. బెంగుళూరులోని ఒక వినియోగదారుడి జేబులో వన్‌ప్లస్ నార్డ్2 5జీ మొబైల్ పేలింది. అయితే, ఇతర కారణాల వల్ల పేలిందని, తయారీ సమస్య వల్ల కాదని తేల్చారు.
Also read:
Andhra Pradesh: వైసీపీ నేతలకు భూమా బ్రహ్మానందరెడ్డి స్వీట్ వార్నింగ్.. ఏ విషయంలోనంటే..
Adilabad: అక్కడ ఎటు చూసిన పులుల ఆనవాళ్లే.. ఆనందంలో అధికారులు.. ఆందోళనలో రైతులు, పశువుల కాపరులు..




