వర్ష బీభత్సం.. ఆ ఒక్క రాష్ట్రంలోనే 69 మంది మృతి.. రూ.5వేల కోట్ల నష్టం..
దక్షిణాదిలో దంచికొట్టకపోయినా.. ఉత్తరాదిలో మాత్రం నైరుతి ఉరుముతోంది. భారీగా కురుస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న వరదలతో హిమాచల్‌ప్రదేశ్ అతలాకుతలమైపోయింది. భారీగా ప్రాణనష్టం జరిగింది. ఇక ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్రకు అంతరాయం కలిగింది. భిమ్‌టల్‌లో ఉప్పొంగుతున్న జలాశయంలో మునిగి నేవీకి చెందిన ఇద్దరు సిబ్బంది చనిపోయారు.

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వరదలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరదలు ముంచెత్తిన ఘటనల్లో 69 మంది మృతి చెందగా 37 మంది కనిపించకుండా పోయారు. ఒక్క మండి జిల్లాలోనే 17 మంది చనిపోగా, 31 మంది గల్లంతయ్యారు. జూన్ 20వ తేదీ నుంచి హిమాచల్‌లో కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా రాష్ట్రంలో 5 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. వచ్చే మంగళవారం వరకు వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇద్దరు నేవీ సిబ్బంది మృతి..
ఇక ఉత్తరాఖండ్‌లోని భిమ్‌టల్‌లో ఉప్పొంగుతున్న జలాశయంలో మునిగి నేవీకి చెందిన ఇద్దరు సిబ్బంది చనిపోయారు. పఠాన్ కోట్‌కు చెందిన ప్రిన్స్ యాదవ్, బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన సాహిల్ కుమార్‌గా వీరిని గుర్తించారు. నైనిటాల్ నుంచి సరదాగా గడిపేందుకు వచ్చిన 8 మంది IAF సిబ్బందిలో వీరున్నారు.
వర్షాల కారణంగా రాష్ట్రంలోని 100కు పైగా రహదారులను మూసివేశారు. చార్‌ధామ్ యాత్రకు అంతరాయం కలిగింది. యమునోత్రికి వెళ్లే జాతీయ రహదారిపై ఐదు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడి ఈ రహదారిపైనున్న సిలాయి మలుపు దగ్గర 12 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో తొమ్మిదిమంది కార్మికులు కొట్టుకుపోయారు. వీరికోసం గాలింపు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కావడి యాత్ర ఏర్పాట్లలో భాగంగా..గంగానదిలో రెస్క్యూ సిబ్బంది డెమో నిర్వహించారు.
భారీ వర్షాలతో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మండ్లా, సియోని, బాలాఘాట్ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. జబల్పూర్–మండ్లా జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా పొఖ్రాన్‌లో 128 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..