Technology India 2025: ప్రపంచం మొత్తం మనవైపే.. ఈ ఏడాది టెక్నాలజీలో భారత్ దూకుడే దూకుడు.. సరికొత్త మార్పులు ఇవే..
టెక్నాలజీ రంగంలో ఈ ఏడాది భారత్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిందని చెప్పవచ్చు. ఏఐను అందిపుచ్చుకోవడంతో పాటు సెమీ కండక్టర్ల తయారీ, అంతరిక్ష ప్రయోగాలు, అణుశక్తి బిల్లు ఆమోదించడం వరకు 2025లో టెక్నాలజీ రంగంలో ప్రపంచం మొత్తాన్ని భారత్ తమవైపు తిప్పుకున్న విషయాలు ఇవే.

2025లో భారత్ టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. టెక్నాలజీకి సంబంధించి ఇతర దేశాలపై ఆధారపడకుండా సొంతగా రూపొందించుకుంటూ ప్రపంపచానికి తన సత్తాను చాటి చెప్పింది. డిజిటల్ ఇండియా, వికసిత్ భారత్-2047 లక్ష్యాలతో టెక్నాలజీలో ప్రపంచానికే భారత్ ఓ అడ్డాగా మారింది. ఏఐ, సెమీ కండకర్లు, అణుశక్తి నుంచి అంతరిక్ష ప్రయోగాల వరకు టెక్నాలజీపై ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశంలోనే అభివృద్ది చేస్తోంది. 2025లో సరికొత్త ఆవిష్కరణలతో టెక్నాలజీ ప్రపంచమే భారత్ వైపు చూసింది. ఈ ఏడాదిలో టెక్నాలజీలో చోటుచేసుకుంటున్న మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఏఐ రంగంలో భారత్ దూకుడు
ఈ ఏడాదిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచనాలు సృష్టిస్తోంది. దీంతో ప్రపంచంలోనే ఏఐలో భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ క్రింద ఏకంగా రూ.10 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం ఏఐ అభివృద్దిలో అమెరికా, చైనా తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉన్నట్లు తేలింది. దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్, జపాన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అభివృద్ది చెందిన దేశాల కంటే ఇండియా టాప్‌లో దూసుకెళ్తుంది. భారత్‌లో ఏఐ ఎంతగా అభివృద్ది దిశగా దూసుకెళ్తుందనేది దీనిని బట్టి తెలుసుకోవచ్చు.
సెమీకండక్టర్ల తయారీలో ముందడుగు
స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వంటి పరికరాలకు ఉపయోగించే సెమీ కండక్టర్లు తయారీలో ఈ ఏడాది భారత్ పెద్ద ముందడుగు వేసింది. ఇప్పటివరకు 90 శాతం వరకు ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటుండగా.. మే 2025లో 3-నానోమీటర్ చిప్ డిజైన్ తయారీకి నోయిడా, బెంగళూరులో రెండు అధునాతన సౌకర్యాలను కేంద్రం ప్రారంభించింది. అలాగే మరో 5 సెమీకండక్టర్ల తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం యూనిట్ల సంఖ్య 10కి చేరుకుంది. వీటిల్లో దాదాపు రూ.1.60 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. దీంతో 2030 నాటికి సెమీ కండక్టర్ల తయారీలో సరికొత్త ఆవిష్కరణకు భారత్ కేంద్ర బిందువుగా మారనుందని చెప్పవచ్చు.
క్రిటికల్ మినరల్ మిషన్ ప్రారంభం
ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం రూ.16,300 కోట్ల వ్యయంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ప్రారంభించింది. సెమీకండక్టర్ల తయారీ కోసం అవసరమైన ఖనిజాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా.. దేశంలోనే అందుబాటులోకి తెచ్చేలా 195 ఖనిజా అన్వేషణ ప్రాజెక్టులను చేపట్టింది. కోబాల్ట్ పౌడర్, లిథియం-అయాన్ బ్యాటరీ స్క్రాప్, సీసం, జింక్‌తో పాటు మరో 12 కీలకమైన ఖనిజలపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో మినహాయించింది. అలాగే ఖనిజాలను రీసైక్లింగ్ చేయడానికి ఈ ఏడాది రూ.1500 కోట్ల రీసైక్లింగ్ పథకానికి ఆమోదం తెలిపింది.
అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర
ఇక ఈ ఏడాదిలో అంతరిక్ష రంగంలో భారత్ తనదైన ముద్ర వేసుకుంది. జూలై 2025లో శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు ప్రయాణించిన మొదటి భారతీయ వ్యోమగామిగా అవతరించి చరిత్ర సృష్టించారు. ఇక నవంబర్ 2న భారత్ 4,400 కిలోగ్రాముల బరువున్న CMS-03 ఉపగ్రహాన్ని ప్రయోగించి రికార్డ్ నెలకొల్పింది. ఇటీవల డిసెంబర్‌లో ప్రధాని మోదీ మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-Iను ఆవిష్కరించారు. ఈ ఏడాది SpaDeX మిషన్‌లో ఇన్-స్పేస్ డాకింగ్‌తో ఇది సాధించిన నాల్గోవ దేశంగా భారత్ ఎదిగింది. ఈ ఏడాది అంతరిక్ష రంగంలోకి భారీగా పెట్టుబడుల ప్రవాహం కొనసగ్గా.. ఇదే జోరు కొనసాగితే 2033 నాటికి $8.4 బిలియన్ల నుండి $44 బిలియన్ల అంతరిక్ష పరిశ్రమగా భారత్ మారనుంది.
అణుశక్తిలో జోరు
ఇక అణుశక్తి రంగంలపై కూడా ఈ ఏడాది భారత్ మరింత దృష్టి పెట్టింది. డిసెంబర్‌లో కేంద్రం అణుశక్తి బిల్లు, 2025ను ఆమోదించింది. దీని ద్వారా ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించారు. ఇక స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన ‘ఫెర్రోకార్బోనేటైట్ (FC) – (BARC B1401) అనే సర్టిఫైడ్ రిఫరెన్స్ మెటీరియల్ (CRM) నవంబర్‌లో విడుదల చేశారు. ఇది భారతదేశంలో మొట్టమొదటిది కాగా.. ప్రపంచంలో నాల్గవదిగా చెబుతున్నారు.
