Odisha Train Accident: మృతుల సంఖ్య విషయంలో నిజాలు దాయడంలేదు.. ఆరోపణలను తోసిపుచ్చిన ఒడిశా సర్కారు
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య విషయంలో నిజాలు దాస్తున్నారంటూ కొందరు విపక్ష నేతలు చేసిన ఆరోపణలను ఒడిశా ప్రభుత్వం తోసిపుచ్చింది. మృతుల సంఖ్య విషయంలో తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకతను పాటిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీకే జీనా స్పష్టంచేశారు.
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య విషయంలో నిజాలు దాస్తున్నారంటూ కొందరు విపక్ష నేతలు చేసిన ఆరోపణలను ఒడిశా ప్రభుత్వం తోసిపుచ్చింది. మృతుల సంఖ్య విషయంలో తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకతను పాటిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీకే జీనా స్పష్టంచేశారు. మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపించే ఉద్దేశం ఒడిశా ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి మీడియా ప్రతినిధులు ఘటనా స్థలి దగ్గరే ఉన్నారని పేర్కొన్నారు. రిస్క్యూ ఆపరేషన్ పూర్తిగా మీడియా కెమెరాల ముందే జరిగిందని గుర్తుచేశారు.
బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో 288 మంది మృతి చెందినట్లు రైల్వే శాఖ తెలిపిందని.. వారిచ్చిన సమాచారం మేరకే తాము ముందుగా ఇదే మరణాల సంఖ్యను వెల్లడించినట్లు తెలిపారు. అయితే బాలాసోర్ జిల్లా కలెక్టర్ మరణాల సంఖ్యపై పరిశీలన జరిపి ఆదివారం ఉదయం 10 గం.ల వరకు 275 మంది మరణించినట్లు ధృవీకరించినట్లు తెలిపారు. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించడం వల్లే మరణాల సంఖ్యలో మార్పు చేయాల్సి వచ్చిందన్నారు. 275 మృతదేహాల్లో 108 మందిని గుర్తించగా.. మిగిలిన వారిని గుర్తించేందుకు చేర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్యపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తంచేశారు. తమ రాష్ట్రానికి చెందిన 61 మంది మృతి చెందినట్లు రైల్వే శాఖ ధృవీకరించిందని.. అయితే 182 మంది ప్రయాణీకులు కనిపించడం లేదని మమతా బెనర్జీ మీడియాకు తెలిపారు. ఒక రాష్ట్రం నుంచే పరిస్థితి ఇలా ఉంటే.. మరణాల సంఖ్య ఏ స్థాయిలో ఉండొచ్చో అంచనావేయొచ్చన్నారు. అయితే ఆమె ఆరోపణలపై స్పందించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిరాకరించారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..