ఇకపై ఈ రూల్ తప్పనిసరి.. వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటేనే పెట్రోల్, డీజిల్.. ఎప్పటినుంచంటే..?
పొల్యూషన్‌లో పీక్స్‌కి చేరిన ఢిల్లీని కాలుష్యకాసారం నుంచి బయటపడేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టారు. ఇకపై ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేకుండా పెట్రోల్ బంకుల్లో.. నో పెట్రోల్, డీజిల్. ఈ సంచలన నిర్ణయం అక్టోబర్ 25 నుంచి అమలులోకి రానుంది.

దేశరాజధాని ఢిల్లీ పర్యావరణ పరిరక్షణలో ముందడుగు వేసింది. అక్టోబర్ 25 నుంచి ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేకుండా ఏ వాహనానికీ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా చేయరు. గత కొద్ది రోజులుగా ఢిల్లీని పొల్యూషన్ నుంచి కాపాడే ప్రయత్నంలో భాగంగా ఎంతో ఆలోచించి, ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. త్వరలోనే దీనిపై నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మరో వారం రోజుల్లో దీని అమలుపై ఓ స్పష్టత వస్తుందని మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. ఢిల్లీని చుట్టుముట్టిన కాలుష్యానికి వాహనాలు విడుదల చేసే పొల్యూషన్ ఓ ప్రధాన కారణం. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అధికారిక లెక్కల ప్రకారం ఢిల్లీలో 17 లక్షల వాహనాలు పిల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేకుండా అక్రమంగా నడుపుతున్నారు. అందులో 13 లక్షల ద్విచక్రవాహనాలు, 3 లక్షల కార్లు ఉన్నాయి.
కాలుష్యంలో అగ్రభాగాన ఉన్న ఢిల్లీ నగర ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. శ్వాస కోశ వ్యాధులు, ఇతరత్రా వ్యాధులతో సతమతమవుతున్నారు. దీంతో గతనెలలో పర్యావరణ, రవాణా, ట్రాఫిక్ విభాగాలకు సంబంధించిన అధికారులతో దీని సాధ్యాసాధ్యాలపై చర్చించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం.. సరైన పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేకుండా పట్టుబడితే వాహన యజమాని ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. లేదా 10,000 రూపాయల జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. దీంతో ఢిల్లీ ప్రజలు అలర్ట్ అయ్యారు.
తాను సెప్టెంబర్ 29న రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు, సంబంధిత అన్ని శాఖల అధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గోపాల్ రాయ్ తెలిపారు. రవాణా శాఖ అక్టోబర్ 3న నోటీసు జారీ చేస్తుందని, ప్రజలు తమ వాహనాల పీయూసీ సర్టిఫికెట్లు పొందేందుకు అక్టోబర్ 25 వరకు సమయం ఉంటుందని వెల్లడించారు.




శీతాకాలంలో దేశ రాజధాని, పరిసర ప్రాంతాలలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ మేరకు వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కూడా అమలుచేస్తున్నారు. ఇదిలా ఉండగా, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం.. ఢిల్లీలో గాలి నాణ్యత గత నెలలో బాగా పడిపోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..