Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిరక్ష్యం వద్దు

ఏపీలో తొలి బర్డ్‌ఫ్లూ వైరస్ మరణం నమోదైంది. నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి బర్డ్‌ఫ్లూతో మృతిచెందినట్టు ICMR నిర్ధారించింది. పచ్చి కోడిమాంసం తినడంతో పాటు.. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే చిన్నారి మృతికి కారణమని వెల్లడించింది. బర్డ్‌ఫ్లూ కారణంగా చిన్నారి మృతితో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం. మృతిచెందిన చిన్నారి ఇంటి చుట్టుపక్కల ఆరోగ్యశాఖ సర్వే చేయగా.. అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని స్పష్టమైంది.

Andhra: ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిరక్ష్యం వద్దు
Ap Bird Flu Case
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 02, 2025 | 8:24 AM

ఏపీలో తొలి బర్డ్‌ఫ్లూ వైరస్ మరణం నమోదైంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూ H5N1 వైరస్‌తో మరణించినట్టుగా భారత వైద్య పరిశోధన మండలి(ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్ధారించింది. పచ్చి కోడి మాంసం తినడంతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతోనే చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యుల వెల్లడించారు. బర్డ్‌ఫ్లూ కారణంగా ఒకరు మృతి చెందటం రాష్ట్రంలో ఇదే తొలి కేసు కాగా.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, మూర్ఛ, విరేచనాలు, ఆహారం తినలేని లక్షణాలతో మార్చి 4న మంగళగిరిలోని ఎయిమ్స్‌లో నరసరావుపేట చిన్నారిని చేర్చారు ఆమె కుటుంబసభ్యులు. ఎయిమ్స్ వైద్యులు చిన్నారికి ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించినా.. మార్చి 16న తుదిశ్వాస విడిచింది.

ఇక చికిత్స అందించే సమయంలో మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి తీసిన స్వాబ్ నమూనాలను ఎయిమ్స్ వీఆర్డీఎల్లో పరీక్ష చేయించగా.. బర్డ్ ఫ్లూ వైరస్ అనే అనుమానం రావడంతో.. ఆ శాంపిల్స్‌ను మార్చి 15న ఢిల్లీకి పంపించారు. అక్కడ నివేదిక కూడా బర్డ్‌ఫ్లూ‌నేమోనని అనుమానం రావడంతో అప్రమత్తమైన ఐసీఎంఆర్.. మార్చి 24న స్వాబ్ నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ వైరాలజీకి పంపించింది. దీంతో ఈ రెండు ల్యాబ్స్‌లో నమూనాలను క్షుణ్ణంగా చెక్ చేయగా.. చిన్నారికి సోకింది హెచ్5ఎన్1 వైరస్‌గా నిర్ధారణ అయింది.

కాగా, బర్డ్‌ఫ్లూ కారణంగా చిన్నారి మృతితో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం. మృతిచెందిన చిన్నారి ఇంటి చుట్టుపక్కల ఆరోగ్యశాఖ సర్వే చేసింది. అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని నిర్ధారించుకున్నారు. ఇంట్లో చికెన్‌ కర్రీ వండుతున్న సమయంలో పాప అడిగిందని పచ్చిమాంసం ముక్క చిన్నది పెట్టామని.. అదే ఇలా మరణానికి కారణం అవుతుందనుకోలేదని పేరెంట్స్ కన్నీరు పెడుతున్నారు. ఉడికించిన మాంసం తిన్న తమకు ఏమీ కాలేదని అధికారులకు తల్లితండ్రులు వివరణ ఇచ్చారు.