Nitin Gadkari: ప్రతిపక్ష కూటమి నన్ను ప్రధానిగా ఉండమంది: నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
భారతీయ జనతా పార్టీ (BJP) వరుసగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం ఆయన ఈ శాఖకు మంత్రిగా కొనసాగుతున్నారు. ఒక శాఖకు మంత్రిగా ఉంటేనే ఆ శాఖ పనులను ఇంతగా పరుగులు పెట్టిస్తున్నవాడు ఏకంగా ప్రధాన మంత్రిగా ఉంటే ఇంకెలా ఉంటుంది? ఈ ఆలోచన బీజేపీలోనో లేక ఆ పార్టీ అభిమానుల్లోనో కలిగితే అందులో వింతేమీ ఉండదు. కానీ..
దేశంలో ఎక్స్‌ప్రెస్ వేలు, జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తుంటే అందరికీ గుర్తొచ్చే పేరు నితిన్ గడ్కరీ. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిగా ఆయన పనితీరును ప్రతిపక్షాలు సైతం ప్రశంసిస్తున్నాయి. దేశాభివృద్ధికి రహదారులే కీలక చోదకశక్తి అని భావించే ఆయన దేశంలోని అన్ని మూలలా మెరుగైన రోడ్డు సదుపాయం కల్పిస్తున్నారు. శరవేగంగా పనులు పూర్తయ్యేలా యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) వరుసగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం ఆయన ఈ శాఖకు మంత్రిగా కొనసాగుతున్నారు. ఒక శాఖకు మంత్రిగా ఉంటేనే ఆ శాఖ పనులను ఇంతగా పరుగులు పెట్టిస్తున్నవాడు ఏకంగా ప్రధాన మంత్రిగా ఉంటే ఇంకెలా ఉంటుంది? ఈ ఆలోచన బీజేపీలోనో లేక ఆ పార్టీ అభిమానుల్లోనో కలిగితే అందులో వింతేమీ ఉండదు. కానీ నితిన్ గడ్కరీని ప్రధాన మంత్రిగా ఉండాలని ఓ విపక్ష నేత కోరుకున్నారట. అంతేకాదు.. “మీరు ప్రధానిగా ఉండండి, మేము (విపక్షం) మీకు మద్ధతిస్తాం” అంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా నితిన్ గడ్కరీయే వెల్లడించారు. శనివారం నాగ్‌పూర్‌లో జరిగిన ఓ జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అక్కడ ఈ సంచలన విషయాన్ని బహిర్గతం చేశారు.
తనను సంప్రదించిన నేత పేరును బహిర్గతం చేయనప్పటికీ.. ఆయన చేసిన ప్రతిపాదన ఏంటన్నది వివరించారు. సరిగ్గా 2024 సార్వత్రిక ఎన్నికల వేళ ఓ ప్రతిపక్ష నేత తనను సంప్రదించారని, ప్రధాని అభ్యర్థిగా తాను ఉన్నట్టయితే తమ కూటమి కూడా మద్దతిస్తుందని చెప్పారని గడ్కరీ అన్నారు. అయితే తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని వెల్లడించారు. “నేను ఒక భావజాలం, సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను. ఆ ప్రకారమే నడచుకుంటాను. నాకు పార్టీ ఎన్నో ఇచ్చింది. కలలో సైతం ఊహించనన్ని అవకాశాలు కల్పించింది. నన్ను ఎలాంటి ఆఫర్ కూడా ప్రలోభపెట్టలేదు” అని తాను ఆ నేతకు స్పష్టం చేసినట్టుగా గడ్కరీ తెలిపారు. తానెప్పుడూ ప్రధాని పదవి కోరుకోలేదని, ఆ పదవి కోసం తాపత్రాయ పడలేదని తెలిపారు. తాను పార్టీ సిద్ధాంతాలు, నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని అన్నారు.
వీడియో చూడండి..
Big revelation – Nitin Gadkari says was offered PM position by opposition leader , he declined pic.twitter.com/RbecgJoFBR
— Naveen Kapoor (@IamNaveenKapoor) September 15, 2024
పార్టీ జాతీయ అధ్యక్షుడిగా…
గడ్కరీ భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షులుగా కీలక సమయంలో సేవలు అందించారు. అప్పటికి వరుసగా 2 పర్యాయాలు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన స్థితిలో 2009 డిసెంబర్‌లో సారథ్య బాధ్యతల్ని చేపట్టారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా అంత్యోదయ వంటి పార్టీ మూల సిద్ధాంతాలకు తగ్గట్టుగా ఆయన కృషి చేశారు. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు అభివృద్ధి విషయంలో కీలక సూచనలు చేస్తూ పార్టీలో వివిధ విభాగాలను ఏర్పాటు చేశారు. పార్టీ అధినేతగా ఆయన దేశాభివృద్ధికి ప్రైవేటీకరణ అవసరమని గట్టిగా నొక్కి చెప్పారు. 2013 జనవరి వరకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 2014 సార్వత్రిక ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు.
పార్టీ జాతీయ నాయకత్వంలో సీనియర్ నేతల్లో ఒకరిగా ఉన్న ఆయన పేరు గతంలోనూ ప్రధాని రేసులో వినిపించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోతే, మిత్రపక్షాలు ప్రధానిగా గడ్కరీ పేరునే ప్రతిపాదించే అవకాశం ఉందంటూ కూడా కథనాలు వచ్చాయి. అయితే గడ్కరీ మాత్రం పార్టీ సిద్ధాంతాలు, భావజాలానికి కట్టుబడి ఎలాంటి ప్రలోభాగాలకు గురికాకుండా తనకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..