AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virus: చావుకబురు చల్లగా.. ముంచుకొస్తున్నమరో ముప్పు.. మరో మహమ్మారి మరింత డేంజర్.!

కరోనా విలయాన్ని ఈ ప్రపంచం మరిచిపోలేదు. మానవాళికి మరణశాసనం లిఖించిన ఘోరకలి ఆ వైరస్‌. అందుకే అప్పుడప్పుడూ కొత్త వైరస్‌లు బయటపడ్డప్పుడల్లా ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ప్రమాదమేమీ లేదని తెలిశాకే ఊపిరిపీల్చుకుంటోంది. వైరస్‌ల పుట్టినింట్లో ఇప్పుడు అలాంటి మహమ్మారే బయటపడింది. యావత్‌ ప్రపంచాన్నీ భయపెడుతోంది.

Virus: చావుకబురు చల్లగా.. ముంచుకొస్తున్నమరో ముప్పు.. మరో మహమ్మారి మరింత డేంజర్.!
VirusImage Credit source: NIAID
Ravi Kiran
|

Updated on: Jun 27, 2025 | 9:46 PM

Share

ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద విలయాన్ని సృష్టించింది కరోనా వైరస్. మనుషుల జీవితాల్ని, ఆర్థికవ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసిందా మహమ్మారి. ఆ షాక్‌నుంచి ప్రపంచం ఇంకా తేరుకోకముందే.. చావుకబురు చల్లగా చెప్పింది చైనా. గబ్బిలాల్లో 22 కొత్త వైరస్‌లను గుర్తించారు ఆ దేశ శాస్త్రవేత్తలు. వీటిలో కొన్ని ప్రాణాంతక వైరస్‌లకు దగ్గరగా ఉండటం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. చైనాలోని గబ్బిలాల్లో 22 కొత్త వైరస్‌లను శాస్త్రవేత్తలు గుర్తించారు. గబ్బిలాలైనా జనవాసాల్లో ఉండే జీవులే కావటంతో వాటి ద్వారా పశువులు, మనుషులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటున్నారు. 2017 నుంచి 2021 మధ్య చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో 142 గబ్బిలాల కిడ్నీ కణజాలంలో 22 వైరస్‌లను గుర్తించారు. జన్యుపరంగా ఈ వైరస్‌లలో రెండు.. ప్రాణాంతకమైన హెండ్రా, నిపా హెనిపా వైరస్‌లకు దగ్గరగా ఉన్నాయి.

వైరస్‌లు గుర్తించిన గబ్బిలాలు గ్రామీణ ప్రాంతాల్లోని పండ్ల తోటల దగ్గర నివసిస్తున్నాయి. ఈ గబ్బిలాల మూత్రం ద్వారా హెనిపా వైరస్‌లు వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. గబ్బిలాల ద్వారా కలుషితమైన పండ్లను మనుషులు, జంతువులు తింటే.. వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటున్నారు. ఇంతకుముందు తెలియని రెండు కొత్త వైరస్‌లకు.. యునాన్ బ్యాట్ హెనిపావైరస్ వన్‌, టూ అని పేరు పెట్టారు. కొత్తగా గుర్తించిన యునాన్ బ్యాట్ వైరస్‌లు.. ప్రమాదకరమైన హెనిపావైరస్‌ల వైరస్‌లతో 52 నుంచి 57 శాతం జన్యువుని పంచుకుంటాయి. అందుకే కొత్త వైరస్‌లు కలవరపెడుతున్నాయి. గబ్బిలాలు పండ్లు, కూరగాయలను తినడం వల్ల వాటి నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుంది. అలాగే గబ్బిలాల మూత్రం నుంచి కూడా ఈ వైరస్ మానవులకు వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వీటివల్ల ఇంకా తీవ్రమైన వ్యాధులు సోకి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు. ఈ కొత్త వైరస్‌లు మానవ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ప్రాణాంతక వ్యాధులుగా మారతాయి. నిపా వంటి వైరస్‌ ఒకసారి శరీరంలోకి ప్రవేశించాక మెదడు పనితీరుకు తీవ్ర నష్టం కలిగించడమే కాదు, శ్వాస ప్రక్రియని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది కొన్ని గంటల్లోనే మరణాలకు దారితీసే ప్రమాదం ఉంది.

శాస్త్రవేత్తల అధ్యయనంలో ఒక కొత్త పరాన్నజీవితో పాటు రెండు కొత్త బాక్టీరియా జాతులను కూడా కనిపెట్టారు. గబ్బిలాలలో అధ్యయనం చేయని కణజాలాల్లో.. చాలా మైక్రోబియల్ థ్రెట్స్ పొంచిఉన్నాయని తాజా పరిశోధనతో తేలింది. వీటి ద్వారా జెనోటిక్ ట్రాన్స్‌మిషన్ జరిగే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా పీడకల తర్వాత మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమున్నా.. గబ్బిలాల వైరస్‌ల విషయం ప్రపంచానికి మరో ప్రమాద హెచ్చరికగా మారింది. ఈ వైరస్‌లు వేగంగా వ్యాపిస్తే ప్రపంచం మరో మహమ్మారితో తలపడాల్సి వస్తుందని భయపడుతున్నారు.