NEET UG 2024 Paper Leak: ‘జులై మూడో వారంలో నీట్ యూజీ కౌన్సెలింగ్.. రీ-ఎగ్జాం అక్కర్లేదు’ అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడి
నీట్ యూజీ 2024 పరీక్షలో జరిగిన అవకతవకలకు దేశం అట్టుడికి పోయింది. విద్యార్ధులు రోడ్లపైకి వచ్చి నిరసనలతో వెళ్లువెత్తారు. ప్రస్తుతం ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తాజాగా అత్యున్నత ధర్మాసనానికి కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింద. దీనిలో పలు అంశాలను ప్రస్తావించింది. నీట్ యూజీ పరీక్షలో పెద్దగా అవకాతవకలు జరగలేదని, అందుకు ఆధారాల్లేవని కొట్టిపారేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని..
న్యూఢిల్లీ, జులై 13: నీట్ యూజీ 2024 పరీక్షలో జరిగిన అవకతవకలకు దేశం అట్టుడికి పోయింది. విద్యార్ధులు రోడ్లపైకి వచ్చి నిరసనలతో వెళ్లువెత్తారు. ప్రస్తుతం ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తాజాగా అత్యున్నత ధర్మాసనానికి కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింద. దీనిలో పలు అంశాలను ప్రస్తావించింది. నీట్ యూజీ పరీక్షలో పెద్దగా అవకాతవకలు జరగలేదని, అందుకు ఆధారాల్లేవని కొట్టిపారేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పింది. నిరాధారమైన అనుమానాల వల్ల మే 5న పరీక్షకు హాజరైన 24 లక్షల మంది విద్యార్ధుల భవితవ్యంపై భారం పడుతుందని పేర్కొంది. అందుకే అడ్మిషన్లకు చివరి దశ అయిన కౌన్సెలింగ్ జులై మూడో వారంలో ప్రారంభిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది. ఎవరైనా అభ్యర్థి ఏదైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే, కౌన్సెలింగ్ ఏ దశలో ఉన్నా, కౌన్సెలింగ్ తర్వాత కూడా వాని ప్రక్రియను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించింది. దీనిపై జులై 11న జరగాల్సిన విచారణను సుప్రీంకోర్టు జులై 18కి వాయిదా వేసింది. కేంద్రం, ఎన్‌టీఏ దాఖలు చేసిన ప్రతులు కొన్ని పక్షాలకు ఇంకా అందలేదని, అందుకే వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.
నీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీ నేపథ్యంలో నీట్ యూజీ ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టులో కొందరు పిటిషనర్లు డిమాండ్ చేయగా.. మరికొందరేమో మళ్లీ పరీక్ష నిర్వహించొద్దంటూ పిటిషన్లు వేశారు. పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. విచారణ పురోగతికి సంబంధించిన నివేదికను తమకు సమర్పించినట్లు ఈ సందర్భంగా కోర్టు తెలిపింది. నీట్ (యూజీ)-2024 పరీక్షా ఫలితాల డేటాను విశ్లేషించి ఐఐటీ మద్రాస్ ఇచ్చిన నివేదికతో జులై 10న కేంద్రం అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. విద్యార్థులు పొందిన మార్కులలో ప్రత్యేకంగా 550 నుంచి 720 వరకు పెరుగుదల కనిపించిందని డేటా వెల్లడించింది. ఈ పెరుగుదలకు సిలబస్‌లో 25 శాతం తగ్గింపే కారణమని పేర్కొంది. అవకతవకలు జరిగినట్లు నివేదిక ఎక్కడా ప్రస్తావించలేదని అందులో పేర్కొంది.
ఇక జులై 3వ వారంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించి.. నాలుగు రౌండ్లలో నిర్వహిస్తామని అఫిడవిట్‌లో తెలిపింది. డేటా విశ్లేషణ ద్వారా అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై దర్యాప్తు జరపాలని ఐఐటీ మద్రాస్‌ను అభ్యర్థించామని, ఒకవేళ ఎవరైనా అభ్యర్ధి అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడిస్తే, వారి కౌన్సెలింగ్ సమయంలో లేదా తర్వాత అయినా.. ఏ దశలోనైనా రద్దు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే మరోవైపు నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసులో పరారీలో ఉన్న కీలక సూత్రధారుల్లో ఒకరైన రాకీ అలియాస్ రాకేశ్ రంజన్‌ను జులై 11న సీబీఐ పట్నాలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.