AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NDA: ఉపరాష్ట్రపతి ఎన్నిక.. మెజార్టీ కోసం మోడీ-షా వ్యూహాలు.. వాటిపై ఫోకస్

మరో నాలుగు రోజుల్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి ఈసీ అన్నీ ఏర్పాట్లు చేసింది. ఎన్డీఏ అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. వీలైనన్నీ ఎక్కువ ఓట్లు తెచ్చుకునే పనిలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు ఎన్డీఏకు షాక్ ఇచ్చేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తోంది.

NDA: ఉపరాష్ట్రపతి ఎన్నిక.. మెజార్టీ కోసం మోడీ-షా వ్యూహాలు.. వాటిపై ఫోకస్
Modi Cp Radhakrishnan
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Sep 05, 2025 | 7:33 PM

Share

ఉపరాష్ట్రపతి ఎన్నికకు అంతా సిద్ధమైంది. ఈ నెల 9న ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. సంఖ్యాబలం పరంగా ఎన్డీఏ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, తెలుగు వ్యక్తి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని బరిలోకి దింపడం ద్వారా ఇండియా కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆసక్తికరంగా మారింది.

గెలుపు కోసం ఎన్డీఏ వ్యూహాలు

ప్రస్తుతానికి ఎన్డీఏకు గెలుపునకు అవసరమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, క్రాస్-ఓటింగ్ జరగకుండా, చెల్లని ఓట్లను నిరోధించడానికి ఎన్డీఏ జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రధానంగా ఈ ఎన్నికలో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ లేకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేన, జేడీఎస్, అప్నాదళ్, ఎల్‌జేపీ వంటి పార్టీల మద్దతు తప్పనిసరిగా మారింది.

ఎన్డీఏ కీలక చర్యలు:

ఓటింగ్ ప్రక్రియపై శిక్షణ: సెప్టెంబర్ 6-8 వరకు ఎన్డీఏ ఎంపీలకు ఓటింగ్ ప్రక్రియపై శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నారు. బ్యాలెట్‌ను సరిగ్గా ఎలా మార్క్ చేయాలి, ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్నునే ఎలా ఉపయోగించాలి, బ్యాలెట్‌ను సరిగ్గా మడతపెట్టడం వంటి విషయాలను వారికి వివరిస్తారు. ఎన్డీఏ ఎంపీలందరూ తప్పకుండా ఓటు వేసేలా చూసేందుకు కేంద్ర మంత్రులు, ఎంపీలను రాష్ట్రాల వారీగా నియమించారు. గెలుపునకు అవసరమైన 391 ఓట్ల కంటే ఎక్కువ, అంటే 436 ఓట్లు తమకు వచ్చే అవకాశం ఉందని ఎన్డీఏ అంచనా వేస్తోంది. వైసీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించగా, తటస్థ పార్టీలైన బిజూ జనతాదళ్ (బీజేడీ), బీఆర్‌ఎస్ మద్దతు కోసం కూడా ఎన్డీఏ ప్రయత్నిస్తోంది.

ఇండియా కూటమి ప్రయత్నాలు

సంఖ్యాబలం లేనప్పటికీ ఇండియా కూటమి తమ అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సుదర్శన్ రెడ్డి ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల ఎంపీలకు లేఖ రాశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమ అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేయాలని ఆయన కోరారు. ఆయన ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో పర్యటించి ఇండియా కూటమి పార్టీల మద్దతు కోరారు. చాలా విపక్ష పార్టీల అధినేతలు తమ మద్దతు ఆయనకేనని ప్రకటించాయి.

ఈ ఎన్నికలో మొత్తం 782 మంది ఎంపీలు ఓటు వేయడానికి అర్హులు. పూర్తి ఓటింగ్ జరిగితే గెలుపునకు కనీసం 392 ఓట్లు అవసరం. ఈ నేపథ్యంలో ఇరు కూటములు తమ అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రధాని మోదీ కూడా సెప్టెంబర్ 8న ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. ఈ ఎన్నికలు భారత రాజకీయాల్లో కీలక ఘట్టంగా మారనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..