AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National: ప్రతిపక్ష కూటమి ప్రధాని అభ్యర్థి ఆమేనా.? దేశ రాజకీయాల్లో ఏం జరగనుంది.?

ఎన్డీఏలో బీజేపీనే ఏకైక జాతీయ పార్టీ. ఆ కూటమి ప్రధాని అభ్యర్థిగా ఈసారి కూడా నరేంద్ర మోదీయే ఉన్నారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) నుంచి I.N.D.I.A గా పేరు మార్చుకున్న విపక్ష కూటమి నుంచే ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. 2004లో ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకపోయినా.. గెలుపొందిన తర్వాత సోనియా గాంధీపై విదేశీ విమర్శల నేపథ్యంలో మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా ఎన్నుకున్నారు...

National: ప్రతిపక్ష కూటమి ప్రధాని అభ్యర్థి ఆమేనా.? దేశ రాజకీయాల్లో ఏం జరగనుంది.?
National Politics
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Aug 18, 2023 | 4:58 PM

Share

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ఐక్యతారాగం వినిపిస్తున్న ప్రతిపక్ష కూటమి “ఇండియా (I.N.D.I.A)”లో ఇప్పుడు ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతోంది. తమ మొదటి లక్ష్యం భారతీయ జనతా పార్టీ (BJP) సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వాన్ని గద్దె దించడమేనని, ప్రధానిగా ఎవరుంటారన్నది ఎన్నికల తర్వాత తేల్చుకునే వ్యవహారమని విపక్ష నేతలు పైకి చెబుతున్నప్పటికీ.. ప్రధాని రేసులో ఎవరికి వారు తమ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నాలు మాత్రం ఇప్పటి నుంచే చేస్తున్నారు. సాధారణంగా కూటమిలో పెద్దన్న పాత్ర పోషించే జాతీయ పార్టీ నుంచే ప్రధాన మంత్రి అభ్యర్థి ఉంటారు.

ఎన్డీఏలో బీజేపీనే ఏకైక జాతీయ పార్టీ. ఆ కూటమి ప్రధాని అభ్యర్థిగా ఈసారి కూడా నరేంద్ర మోదీయే ఉన్నారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) నుంచి I.N.D.I.A గా పేరు మార్చుకున్న విపక్ష కూటమి నుంచే ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. 2004లో ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకపోయినా.. గెలుపొందిన తర్వాత సోనియా గాంధీపై విదేశీ విమర్శల నేపథ్యంలో మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా ఎన్నుకున్నారు. 2009 నాటికి రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కొందరు ప్రతిపాదించినప్పటికీ.. మన్మోహన్ సింగే మరోసారి కొనసాగారు. 2014, 2019 ఎన్నికల్లో అప్రకటిత ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ కొనసాగారు. కానీ వరుసగా రెండు పర్యాయాలు ఓటమిపాలవడం, కనీసం ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు కూడా సాధించలేకపోవడంతో కాంగ్రెస్ గ్రాఫ్‌తో పాటు రాహుల్ గాంధీ గ్రాఫ్ కూడా పడిపోయింది. ఒకదశలో ‘ఫెయిల్యూర్ ప్రొడక్ట్’ను మళ్లీ మళ్లీ లాంచ్ చేస్తున్నారంటూ బీజేపీ నేతల వ్యంగ్యం, ఎద్దేవా ఎదురైంది. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల సమరంలో కూటమి ప్రధాని అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించలేకపోతోంది. ఫలితంగా కూటమిలోని ఇతర పార్టీల అధినేతలు ఎవరికివారుగా ప్రధాని అభ్యర్థి రేసులో దిగారు.

రేసులో దీదీ – మోదీతో ఢీ..

ఎన్డీయే కూటమిలో ప్రధాని మోదీతో ఢీకొట్టే మరో ప్రధాని అభ్యర్థి 2024 ఎన్నికల్లోనైతే ఎవరూ లేరు. కానీ I.N.D.I.A కూటమిలో మాత్రం చాలా మందే ఆశావాహులు ఉన్నారు. పీఎం పదవి రేసులో పోటీపడుతున్నవారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ముందు వరుసలో కనిపిస్తున్నారు. ఇప్పటికే మూడు పర్యాయాలు బెంగాల్ సీఎం పీఠంపై కూర్చున్న ఆమెకు ప్రధాని సీటులో కూర్చోవాలని ఆమె చాలా కాలం నుంచే ఆశపడుతున్నారు. ఒక దశలో విపక్ష కూటమికి తానే నాయకత్వం వహించాలని భావించారు. కేవలం బెంగాల్ రాష్ట్రంతో పాటు ఈశాన్యాన మరికొన్ని చిన్న రాష్ట్రాల్లో మాత్రమే ఉనికి కల్గిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రిగా ఆమె యావద్దేశానికి ప్రధాని కావాలనుకోవడం ఎలా కుదురుతుంది అన్న ప్రశ్న తలెత్తుతుంది. అందుకే ఆమె ఆ సమయంలో బెంగాల్‌కు ఎక్కడో సుదూరాన ఉన్న గోవా ఎన్నికల్లోనూ తన పార్టీని పోటీ చేయించారు. ఆనాటి ప్రయత్నాలు అనుకున్నంత సాఫీగా ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు పాట్నా, బెంగళూరు నగరాల్లో జరిగిన ప్రతిపక్ష కూటమి సమావేశాల్లో మమత క్రియాశీలంగా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు తాజాగా ఆ పార్టీకి చెందిన నేత శతృఘ్న సిన్హా ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో “మనకు ఒక మహిళ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో, ఒక మహిళ ప్రధానమంత్రిగా ఉండటం దేశానికి చాలా మంచిది. మమతా బెనర్జీ లాంటి మాస్ బేస్ ఉన్న ఫైర్‌బ్రాండ్ నాయకురాలు అందుకు సరిగ్గా సరిపోతారు” అంటూ వ్యాఖ్యానించారు. ఇది ఆయన మనసులో మాటే కావొచ్చు. కానీ మమత బెనర్జీ కాదనలేని మాట. టీఎంసీ సోషల్ మీడియాలోనూ మమతను ప్రధాని అభ్యర్థిగా చూపిస్తూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ మమత అనుమతి లేకుండా జరిగే పరిణామాలు కావు. సోషల్ మీడియా ప్రచారం ద్వారా ప్రధానమంత్రి పదవికి అర్హత, సమర్థత కలిగిన అభ్యర్థిగా ప్రచారం చేసుకోవడమే మమత పార్టీ లక్ష్యం. ఎఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు పేరును పిఎంగా ముందుకు తెచ్చారు, అయితే ఆయనను ప్రధాని అభ్యర్థిగా ‘అర్హుడు’ మరియు ‘సమర్థుడు’ అని పిలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికలు.

నితీశ్, కేజ్రీ – సర్వేలో సమఉజ్జీ..

ప్రతిపక్ష కూటమిలో ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్నవారిలో బిహార్ ముఖ్యమంత్రి, జనతా దళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ ఉన్నారు. ఆయనకు ఎన్డీఏలో ఉన్నప్పటి నుంచే ఈ కోరిక ఉంది. అయితే బీజేపీ వంటి పెద్ద పార్టీని దాటి ఎన్డీఏలో మరో పార్టీకి ప్రధాని పదవి ఇచ్చే అవకాశమే లేదని ఆయనకు తెలుసు. ఇప్పుడు విపక్ష కూటమిలో అవకాశం లేదు అనుకోడానికి లేదు. అందుకే ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రతిపక్ష కూటమిని తొలుత సమావేశపరిచింది కూడా ఆయనే. బిహార్ రాజధాని పాట్నాలోనే తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసి, వివిధ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. ఇప్పుడు ఇండియా కూటమి గెలుపుతో పాటు పరిస్థితులు తనకు అనుకూలించాలని కోరుకుంటున్నారు.

రాజకీయ పార్టీని స్థాపించిన అతి తక్కువ సమయంలోనే దేశంలోని రెండు రాష్ట్రాల్లో అధికారం సాధించడంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరించి జాతీయ పార్టీ హోదా పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కూడా ప్రధాని పదవికి రేసులో ఉంది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తనను ప్రధాని అభ్యర్థిగా చాటుకునే ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. విపక్ష కూటమిలో భాగమైన ఆ పార్టీ.. కాస్త పెద్ద సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుపొందగల్గితే కేజ్రీవాల్ ప్రధాని పదవి కోసం పట్టుబట్టే అవకాశం లేకపోలేదు.

పెద్దన్న సంగతేంటి?

I.N.D.I.A కూటమిలో ఇప్పటికీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీయే. యూపీఏ హయాంలో ఉన్నంత ప్రాభవం ఇప్పుడు లేకపోవచ్చు. కానీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని మూలల్లో ఉనికి కలిగిన విపక్ష కూటమి పార్టీ కాంగ్రెస్ మాత్రమే. కమ్యూనిస్టులకు కూడా దేశవ్యాప్తంగా ఉనికి ఉండేది. కానీ అది గతం. వర్తమానంలో ఆ పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో గెలుపు అనంతరం ఆ పార్టీలో జోష్ పెరిగింది. మోడీ ఇంటి పేరు వ్యాఖ్యల నేపథ్యంలో పరువునష్టం కేసులో జైలు శిక్షకు గురై అనర్హత వేటుకు గురి కావడం కూడా రాహుల్ గాంధీకి పరోక్షంగా కలిసొచ్చింది. ఈ పరిణామాలు ఆయనపై సానుభూతిని పెంచాయి. సుప్రీంకోర్టు ‘స్టే’ నేపథ్యంలో ఆయన తన ఎంపీ పదవిని తిరిగి తెచ్చుకున్నారు. రెండు పర్యాయాలు ప్రధాని అభ్యర్థిగా విఫలమైనా.. ఆనాటి రాహుల్ గాంధీకి.. ఇప్పటి రాహుల్ గాంధీకి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. గతం కంటే పరిణితి కనిపిస్తోందని కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్ష నేతలు కూడా చెబుతున్నారు. ఎంతకాదన్నా.. 2024 సార్వత్రిక ఎన్నికలు సైతం ‘నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ’ అన్నట్టుగానే ఉండబోతున్నాయన్నది నిర్వివాదాంశం.

అయితే సీ-ఓటర్ సంస్థ నిర్వహించిన సర్వే కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిత్వంలో ట్విస్ట్ తీసుకొచ్చింది. ఆ సంస్థ సర్వే నిర్వహించే సమయానికి అనర్హత వేటుకు గురైన స్థితిలో రాహుల్ గాంధీ ఉన్నారు. ఆ ప్రకారం ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేయడంలో అనిశ్చితి నెలకొని ఉంది. అందుకే ఆ సంస్థ “విపక్ష కూటమిలో ప్రధాని అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారు?” అన్న ప్రశ్నతో సర్వే చేపట్టినా.. సమాధానంగా ఇచ్చిన ఆప్షన్లలో రాహుల్ గాంధీ పేరును పేర్కొనలేదు. ఆయన స్థానంలో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ పేరును ప్రస్తావించింది. సర్వే ఫలితాల్లో అనూహ్యంగా ఆమె అందరి కంటే ఎక్కువ ఆదరణ పొందారు. విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రియాంకను కోరుకుంటున్నవారి శాతం 33 కాగా, ఆ తర్వాతి స్థానంలో 14శాతం ఆమోదంతో బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమఉజ్జీలుగా ఉన్నారు.

పెద్ద సీటుపై ఆశలుపెట్టుకున్న దీదీ కేవలం 10 శాతం మాత్రమే మద్దతు పొందగలిగారు. అంటే విపక్ష కూటమిలో కాంగ్రెస్ పార్టీయే పెద్దన్నగా నిలిచింది. అనూహ్యంగా ప్రియాంక గాంధీ ప్రధాని రేసులోకి వచ్చారు. అయితే రాహుల్ పునరాగమనం తర్వాత ఆయన మరో భారత్ జోడో యాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీరు వరకు దేశంలో నిలువుగా దక్షిణం నుంచి ఉత్తరం దిశగా యాత్ర సాగించిన రాహుల్.. ఈసారి గుజరాత్ నుంచి అస్సాం వరకు పశ్చిమం నుంచి తూర్పు దిశగా యాత్ర చేపట్టాలని చూస్తున్నారు. ఈ యాత్ర ద్వారా రేసులో రాహుల్ తన బలాన్ని, గ్రాఫ్‌ను మరింత పెంచుకోవాలన్న లక్ష్యం కూడా దాగి ఉంది.

టూ మెనీ కుక్స్ సామెతను తలపించేలా…

ఆంగ్ల సామెత “టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద ఫుడ్”ను తలపించే పరిస్థితి I.N.D.I.A కూటమిలో కనిపిస్తోంది. వంటలో ఒకరి కంటే ఎక్కువ మంది చేతులు పడ్డాయంటే రుచి మాట దేవుడెరుగు, మొత్తం వంటకమే పాడైపోతుందన్నది ఈ సామెత అర్థం. కూటమిలో ఐక్యతే అతి పెద్ద సవాలుగా మారిన పరిస్థితుల్లో ప్రధాని అభ్యర్థిత్వంపై చర్చకు తెరలేపడం ద్వారా మొత్తం కూటమి విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. జులై 17న బెంగళూరులో బీజేపీకి వ్యతిరేకంగా ఎజెండాను రూపొందించేందుకు 26 పార్టీల ప్రతిపక్ష కూటమి సమావేశమై నెల దాటిపోయింది. ఆ తర్వాత కూటమి మళ్లీ కలవలేదు. ఈలోగా దేశంలో చాలా పరిణాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లోక్‌సభ ఎంపీగా తిరిగి నియమితులయ్యారు.

పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలలో మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC గెలుపొందారు. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిక ఏర్పడింది. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా విపక్ష కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోటీకే మొగ్గు చూపుతున్న కాంగ్రెస్ ప్రకటించడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుబడుతోంది. అలాంటప్పుడు I.N.D.I.A కూటమి ఏర్పాటు చేయడంలో అర్థం లేదు అంటూ ఆప్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూటమి తదుపరి సమావేశానికి హాజరుకావాలా వద్దా అన్న విషయంపై ఆప్ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన మంత్రి అభ్యర్థిత్వం మొత్తంగా కూటమిలో ప్రతిష్టంభనకు దారితీస్తుంది. తదుపరి ఈ నెలాఖరున ముంబైలో జరిగే కూటమి తదుపరి సమావేశంలో ఆ ప్రతిష్టంభన తలెత్తకుండా చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..