MP Vasant Chavan: హైదరాబాద్‌ ‘కిమ్స్’లో కాంగ్రెస్‌ ఎంపీ వసంత్‌ చవాన్‌ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్ (70) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 13న శ్వాస సంబంధిత సమస్యతో నాందేడ్‌లోని ఓ దవాఖానలో చేరారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఇటీవల ఆయనను హైదరాబాద్‌కు వాయుమార్గంలో తరలించారు. దీంతో కొన్ని రోజులుగా ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..

MP Vasant Chavan: హైదరాబాద్‌ 'కిమ్స్'లో కాంగ్రెస్‌ ఎంపీ వసంత్‌ చవాన్‌ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
MP Vasant Chavan
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 26, 2024 | 5:02 PM

నాందేడ్‌, ఆగస్టు 26: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్ (70) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 13న శ్వాస సంబంధిత సమస్యతో నాందేడ్‌లోని ఓ దవాఖానలో చేరారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఇటీవల ఆయనను హైదరాబాద్‌కు వాయుమార్గంలో తరలించారు. దీంతో కొన్ని రోజులుగా ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి సోమవారం ఉదయం 4 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎంపీ వసంత్ చవాన్ మృతి చెందిన విషయాన్ని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోమవారం ధృవీకరించింది. ఆయన అంత్యక్రియలు నాందేడ్‌లో నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోనున్న కిమ్స్ వైద్యబృందం ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆయనను కాపాడలేకపోయారని తన ప్రకటనలో తెల్పింది.

ఆయన హైపోక్సిక్ ఇస్కీమిక్ ఎన్సెఫలోపతితో సహా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో రక్త ప్రవాహం తగ్గడం వల్ల సంభవించే వ్యాధి ఇది. ఒక రకంగా చెప్పాలంటే మెదడు పనిచేయకపోవడం లాంటిది. అలాగే శ్వాసకోశ వైఫల్యం, మూత్రపిండ వ్యాధి కారణంగా చవాన్‌కు గుండె ఆగిపోయిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి మల్టీడిసిప్లినరీ వైద్యుల బృందం చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని వెల్లడించింది. ఆయన మృతి పట్ల మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సంతాపం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని నైగావ్‌లో జన్మించిన వసంత్ చవాన్.. 1978లో నాయ్‌గావ్‌ సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా, 2002లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009-2014 వరకు నైగావ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన.. నాందేడ్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నికై ఎంపీగా గెలుపొందారు. అంతేకాకుండా 2021- 2023 వరకు నాందేడ్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా కూడా పని చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రతాప్ పాటిల్ చిఖాలికర్​పై 59,442 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.