Viral Video: భయానక వీడియో.. తుపాకులతో కాల్పులు జరిపి జ్యువెల్లరీ షాప్‌ దోచేశారు! షాపు యజమాని మృతి

ఆయుధాలు ధరించిన కొందరు దుండగులు జ్యువెలరీ షాప్‌ను దోచుకెళ్లారు. కారులో వచ్చిన వీరు షాపులోని వారిపై మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో షాపు యజమాని మరణించగా.. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి..

Viral Video: భయానక వీడియో.. తుపాకులతో కాల్పులు జరిపి జ్యువెల్లరీ షాప్‌ దోచేశారు! షాపు యజమాని మృతి
Robbers Loot Jewellery Shop
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 25, 2024 | 8:34 AM

జైపూర్‌, ఆగస్టు 25: ఆయుధాలు ధరించిన కొందరు దుండగులు జ్యువెలరీ షాప్‌ను దోచుకెళ్లారు. కారులో వచ్చిన వీరు షాపులోని వారిపై మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో షాపు యజమాని మరణించగా.. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజస్థాన్‌లోని భివాడిలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.

ఆగస్టు 23న సాయంత్రం ఏడు గంటల సమయంలో ముఖాలకు ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు కారులో భివాడి సెంట్రల్ మార్కెట్‌ వద్ద ఉన్న కమలేష్ జ్యువెలర్స్‌ షాపులో చొరబడ్డారు. షాపు బయట ఉన్న సెక్యూరిటీ గార్డును కర్రతో చావగొట్టి, అతని వద్ద ఉన్న గన్‌ను లాక్కున్నారు. అనంతరం నగల దుకాణంలో ప్రవేశించి లోపల ఉన్న సిబ్బందిని విచక్షణా రహితంగా కొట్టారు. అడ్డుకోబోయిన యజమాని కమలేష్ సోనీని తీవ్రంగా కొట్టారు. అతడి కుమారుడు వైభవ్, షోరూమ్ సిబ్బందిని కొట్టి బంధించారు. ఈ ఘటనలో సెక్యురిటీ గార్డుతో సహా మరో ముగ్గురు గాయపడ్డారు. అనంతరం దుండగులు తమ వెంట తెచ్చిన రెండు బ్యాగుల్లో లక్షల విలువైన బంగారం, వెండి నగలను దోచుకున్నారు. దోపిడీ తర్వాత నిందితులు అక్కడి నుండి పారిపోయారు.

ఇవి కూడా చదవండి

నగలతో పారిపోతున్న దుండగులను కమలేష్‌ సోదరుడు మధుసూదన్ బయటి నుంచి అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో దుండగులు పలుమార్లు కాల్పులు జరిపారు. ఈ గందరగోళంలో నగల షోరూమ్ లోపల ఒక బ్యాగ్‌ను వదిలేసిన దుండగులు మరో బ్యాగ్‌తో కారులో హర్యానా వైపు పారిపోయారు. తుపాకీ కాల్పుల్లో జ్యువెలరీ షాప్‌ యజమాని, అతడి సోదరుడు మధుసూదన్, గార్డు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ యజమాని కమలేష్‌ మరణించాడు. మధుసూదన్‌కు భివాడిలో చికిత్స పొందుతుండగా, వెన్నెముకలో బుల్లెట్ దిగిన గార్డును గురుగ్రామ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు రాజస్థాన్ పోలీసులు తెలిపారు.

కాగా రాజస్థాన్‌లో వ్యాపారుల భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. గతంలోనూ రాజస్థాన్‌లోని అల్వార్‌లోని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో పగటిపూట జరిగిన దోపిడీలో సుమారు ఆరుగురు సాయుధులు సుమారు కోటి రూపాయల విలువైన నగదు, బంగారాన్ని అపహరించారు. 30 నిమిషాల వ్యవధిలో చోరీ చేసి, అనంతరం బైక్‌లపై పరారయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.